తూర్పుగోదావరి, కాకినాడ లీగల్: బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడి పెళ్లి చేసుకోవడానికి ముఖం చాటేసిన నయవంచకుడికి పదేళ్ల జైలు, రూ.ఐదు వేలు జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి జి.గోపిచంద్ గురువారం తీర్చు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్‌సిటీ రాజీవ్ గృహకల్పకు చెందిన గుల్లిపల్లి హరికృష్ణ బంధువుల ఇంటికి తరచూ వెళ్లేవాడు. 2011లో బంధువుల ఇంటి పక్కన ఉన్న బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి వంచించాడు. బాలిక కుటుంబ సభ్యులు లేని సమయంలో తరచూ ఆమె ఇంటికి వెళ్లి, పెళ్లి చేసుకుంటానని శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు.
దీంతో బాలిక 2012లో గర్భం దాల్చగా అది పోవడానికి టాబ్లెట్లు ఇచ్చాడు. ఇలా పలుమార్లు చేయడంతో హరికృష్ణను పెళ్లి చేసుకోవాలని బాలిక నిలదీయగా అతడు నిరాకరించాడు. దీంతో బాలిక విషయాన్ని తన తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పడంతో వారు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెళ్లి చేసుకోవాలంటే రూ.రెండు లక్షలు ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో 2014లో బొమ్మూరు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా లైంగికదాడికి పాల్పడినందుకు ఐపీసీ 417, 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో హరికృష్ణపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ఏపీపీ వై.ప్రశాంతి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. బాధితురాలికి రూ. మూడు లక్షలు ప్రభుత్వం నుంచి పరిహారం కల్పించాలని తీర్పులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment