సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్యాకుమారి జిల్లాలోని చెక్‌పోస్టులో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ విల్సన్‌ను తీవ్రవాద ముఠా హతమార్చడం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దులో ఉండడం, నిందితులు ఆ రాష్ట్రానికి పారిపోయినట్లు ప్రాథమిక సమాచారంతో రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్‌ఐని కాల్చిచంపిన కేసు నేపథ్యంలో ఐదుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. హత్యకు పాల్పడినవారు కేరళకు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళలో దాక్కుని ఉన్న ముగ్గురిని, ఢిల్లీలో మరో ఇద్దరిని క్యూబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారి జిల్లా కిళియక్కావిళై మార్కెట్ రోడ్డులో పోలీసు చెక్‌పోస్టులో ఎస్‌ఐ విల్సన్ విధుల్లో ఉండగా బుధవారం రాత్రి ఇద్దరు అగంతుకులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చిన సంఘటన రాష్ట్ర పోలీసు యంత్రాగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కన్యాకుమారి జిల్లా కలెక్టర్, ఎస్పీ, చెన్నై నుంచి డీజీపీ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఐదు ప్రత్యేక పోలీసు బృందాలతో కేసు విచారణ ప్రారంభించారు.
తుపాకీ కాల్పులకు పాల్పడే ముందు ఎస్‌ఐని కత్తులతో పొడిచి చిత్రవధకు గురిచేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హతుని శీరరం నుంచి తీవ్రవాదులు వినియోగించిన తుపాకీ తూటాలను పోలీసులు సేకరించారు. హత్య జరిగిన ప్రాంతం కేరళ సరిహద్దు కావడంతో ఆ రాష్ట్ర డీజీపీ, ఇతర పోలీసు అధికారులు సైతం చెక్‌పోస్టును పరిశీలించారు. హత్య జరిగిన పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల పుటేజీలో నమోదైన దృశ్యాల ద్వారా తిరువితాంగోడుకు చెందిన అబ్దుల్ సమీం, నాగర్‌కోవిల్‌కు చెందిన తవుబిక్‌లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. హంతకులు కేరళ పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని తమిళనాడు పోలీసుశాఖ, రూ.5 లక్షలు బహుమానమని కేరళ ప్రభుత్వం ప్రకటించాయి. ఇదిలా ఉండగా నిందితులు పారిపోయేందుకు సహకరించిన నేరంపై కేరళ రాష్ట్రం పాలకోట్టైకి చెందిన ముగ్గురిని క్యూబ్రాంచ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో ఉంచి విచారణ జరుపుతున్నారు. దీనివల్ల కన్యాకుమారి–కేరళ సరిహద్దుల్లో తీవ్రవాద ముఠా సానుభూతిపరులు ఉన్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment