కోల్‌కతా : నటనలో శిక్షణ పేరుతో యువతులను అసభ్యంగా తాకుతూ అభ్యంతరకరంగా వ్యవహరించారనే ఆరోపణలపై కోల్‌కతాలో థియేటర్ ఆర్టిస్ట్, హెరిటేజ్ అకాడమీ ఫ్యాకల్టీ మెంబల్ సుదీప్తో ఛటర్జీపై కళాశాల యాజమాన్యం దర్యాప్తునకు ఉపక్రమించింది. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఫ్యాకల్టీ మెంబర్‌గా ఆయన వైదొలిగారు. నాటక ప్రదర్శనలో సహకరిస్తానంటూ ఛటర్జీ తన ఇంటికి పిలిచి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తనను అభ్యంతరకరంగా తాకారని బాధిత యువతి ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన లాగే పలువురు యువతులను ఆయన లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పారు. తాను ఛటర్జీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఇనిస్టిట్యూట్ నియమించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణకు సహకరిస్తానని, మహిళా కమిషన్ దృష్టికీ ఈ విషయం తీసుకువెళతానని తెలిపారు.
బాధితురాలు తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అనంతరం మరికొందరు సైతం ఛటర్జీ చేష్టలను బహిర్గతం చేశారు. వాయిస్ ఎక్సర్‌సైజ్‌ల పేరుతో ఛటర్జీ తనను ఆయన ఇంటికి పిలిపించారని, అక్కడ ఆయన తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని ఆరోపించారు. శారీరకంగా తాకడం ఈ ప్రక్రియలో భాగమని ఆయన మెసేజ్ చేశారని చెప్పారు. ఇక ఛటర్జీ వేధింపులు భరించలేక తాను బెంగాలీ థియేటర్‌లో పనిచేయడం మానేశానని మరో మహిళ పేర్కొన్నారు. మరోవైపు తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఛటర్జీ తోసిపుచ్చారు. తాను అమాయకుడినని వాస్తవాలను వక్రీకరించేలా ఈ ఆరోపణలున్నాయని చెప్పుకొచ్చారు. శిక్షణలో భాగంగా నాటకంలో ఆమె పాత్రను రక్తికట్టించేలా చేసే క్రమంలో వారు తప్పుగా అర్ధం చేసుకున్నారని అన్నారు. నాటక రంగ శిక్షణలో ప్రముఖుడిగా పేరొందిన ఛటర్జీ ఢిల్లీ జేఎన్‌యూ, కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లోనూ ఫ్యాకల్టీ సేవలు అందించడం గమనార్హం. టఫ్ట్ యూనివర్సిటీ, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోనూ ఆయన బోధనలు సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment