ప్రసాదం కౌంటర్‌లో ధ్వంసం చేసిన బీరువా
చిలప్‌చెడ్(నర్సాపూర్): చాముండేశ్వరీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతానానికి పాల్పడిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఆలయ తలుపులు తెరిచేందుకు మోతీలాల్ శర్మ వెళ్లగా గేట్ తాళం పగులగొట్టి ఉందని, ఈ విషయం ఆలయ నిర్వహకుడు శోభన్‌కు తెలియజేయగా, అతను పోలీసులకు సమాచారం అందించారు.
అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా దుండగులు ఆలయ మెయిన్ గేటు తాళం పగులగొట్టి, ప్రసాదం కౌంటర్ గ్రిల్స్ తొలగించి కౌంటర్‌లోని సుమారు రూ.6వేలు దొంగలించి, బీరువాలోని రికార్డులు చిందరవందర చేసినట్టు గ్రహించారు. అక్కడే ఉన్న కంప్యూటర్ మానిటర్, ఎంప్లిఫైర్ తో పాటు హోమగుండం వద్ద ఉన్న చిన్న హుండీ దొంగలించారని వారు గుర్తించారు. ఆ హుండీని ఆలయం వెనుకల పడేశారని వెల్లడించారు. అనంతరం గుడిలోని సీసీ పుటేజీలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వ్యక్తి హుండీని ఎత్తుకెళ్లినట్లు రికార్డు అయినప్పటికీ ఫుటేజ్ క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు.
నిర్లక్ష్యమే కారణమా..?
ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే దొంగతనం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో నిద్రించాల్సిన సిబ్బంది, వాచ్‌మెన్‌లే ఆలయంలో లేరని, మొత్తం 8 సీసీ కెమెరాలు ఉన్న ఆలయంలో కేవలం ఐదు మాత్రమే ఎందుకు పనిచేస్తున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే పనిచేస్తున్న వాటినలో రెండు మాత్రమే క్లారిటీ ఉన్నాయని. ఆలయ నిర్వహకులు సీసీ కెమెరాల నిర్వహణ కూడ సక్రమంగా నిర్వహించకపోవడం గమనార్హం. కాగా త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment