సాక్ష్యం దొరకకుండా ఇంటికి నిప్పు | Theft In Nizamabad | Sakshi
Sakshi News home page

సాక్ష్యం దొరకకుండా ఇంటికి నిప్పు

Published Mon, May 28 2018 1:46 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

Theft In Nizamabad - Sakshi

కాలిపోయిన బీరువాను పరిశీలిస్తున్న ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్‌రావు 

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌అర్బన్‌) : ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు ఆపై సాక్ష్యాధారం దొరకుండా ఆ ఇంటికి నిప్పుపెట్టారు. దారుణ ఘాతాకానికి పాల్పడిన దొంగల పనితో ఆ ఇంట్లో వారికి కట్టుబట్టలు మినహా మరేమీ మిగలలేదు. కూడబెట్టుకున్న డబ్బులు చోరీకి గురికాగా, కట్టుకునే బట్టలు కాలిబూడిదయ్యాయి. కనీసం తాము బతికి ఉన్నామనే సర్టిఫికెట్లు కూడా కాలిబూడిద కావటంతో ఆ ఇంట్లోవారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

రానున్న రంజాన్‌ పండుగ నేపథ్యంలో కొత్త బట్టలు కొనుక్కునే స్థోమతలేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ హబీబ్‌నగర్‌లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు..  

నగరంలోని హబీబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ గౌస్‌ శనివారం రాత్రి గౌతంనగర్‌లో ఉంటున్న తన అత్తగారింటికి వెళ్లాడు. అత్తకు ఆరోగ్యం బాగలేకపోవటంతో భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి ఆమెను పలుకరించేందుకు వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈదురు గాలులు విపరీతంగా వీయటంతో గాలులు తక్కువయ్యాక ఇంటికి వెళ్దామని అనుకుని అక్కడే ఉండిపోయాడు. రాత్రి ఒంటిగంట వరకు ఈదురు గాలులు తక్కువ కాకపోవటంతో అత్తగారింట్లోనే ఉండిపోయాడు.

ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో స్థానికుడు ఒకరు మీ ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని ఫోన్‌ చేసి చెప్పటంతో వెంటనే తన ఇంటికి బయలుదేరాడు. అప్పటికే ఇంట్లోనుంచి విపరీతమైన మంటలు వస్తుండటంతో వెంటనే ఫైరింజన్‌ కార్యాలయానికి ఫోన్‌ చేయగా వారు మంటలను ఆర్పివేశారు.

అనంతరం ఇంట్లోకెళ్లి చూడగా బీరువా పూర్తిగా కాలిపోయి ఉండటం, అందులో 15 తులాల బంగారు అభరణాలు, రూ.మూడున్నర లక్షలు చోరీకి గురి కావటం గమనించారు. దొంగలు బీరువాను పగలగొట్టి అందులో డబ్బులు, బంగారు అభరణాలు ఎత్తుకుపోయారని బాధితుడు తెలిపారు. 

కట్టుబట్టలే మిగిలాయి.. 

దొంగలు ఇంటిని దోచుకుని ఇంటికి నిప్పు పెట్టడంతో కట్టుబట్టలు మినహా ఏమీ మిగలలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బీరువాలో దాచిపెట్టిన విలువైన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు బుక్‌లు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, పిల్లల సర్టిపికెట్లు, ఖరీదైన బట్టలు పూర్తిగా కాలిబూదయ్యాయని బాధితుడు గౌస్‌ వాపోయారు.

తన వ్యాపారానికి సంబంధించి వచ్చిన డబ్బులు, భార్య దాచుకున్న డబ్బులు మొత్తం రూ.మూడున్నర లక్షలు చోరీకి గురైనట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement