సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలోని ఓ బంగారు ఆభరణాల తయారీ కార్ఖానా నుంచి 5 కేజీల బంగారం ఎత్తుకుపోయిన బందిపోటు దొంగల కేసు దర్యాప్తును నగర పోలీసులు ముమ్మరం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. బుధవారం రాత్రి నాటికీ సరైన క్లూ లభించలేదు. ఈ దొంగతనంలో ఎంత మంది పాల్గొన్నారనేది పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కనిష్టంగా 8 మంది, గరిష్టంగా 12 మంది పాల్గొని ఉండొచ్చని మాత్రం చెప్తున్నారు.
ఈ నేరం చేసిన దొంగలు పక్కా ప్రొఫెషనల్స్‌గా పని పూర్తి చేశారు. సీసీ కెమెరాలకు, సాంకేతిక దర్యాప్తునకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ దొంగతనానికి దుండగులు ఎలాంటి వ్యక్తిగత వాహనాలూ వాడలేదని దాదాపు నిర్ధారణైంది. కేవలం సర్వీసు ఆటోల్లో, అదీ అంతా కలసి వస్తే ఎవరైనా గమనించే ఆస్కారం ఉందనే ఉద్దేశంతో వేర్వేరు మార్గాల్లో ఎవరికి వారుగా పేట్లబురుజు చౌరస్తాకు చేరుకున్నారని తెలిసింది.
అక్కడి మామా పాన్ షాప్ వద్ద కొందరు అనుమానితులు ఆటో దిగడం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీన్ని బట్టి ముందుకు వెళ్తున్న దర్యాప్తు అధికారులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 350 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను సేకరించారు. దీన్ని విశ్లేషించడానికి 12 బృందాలను ఏర్పాటు చేశారు.
సైగలతోనే సంభాషణ..
కార్ఖానా వద్దకు చేరుకోవడానికి, చేరుకున్న తర్వాత దాడికి ఆదేశాలు జారీ చేసుకోవడానికి వీరు ఎలాంటి ఫోన్లు వాడలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో చిక్కిన విజువల్స్‌ను బట్టి వీరంతా విడివిడిగా ఉన్నప్పటికీ కంటి సైగలతో సంభాషించుకుంటూ పని పూర్తి చేసినట్లు గుర్తించారని సమాచారం. దొంగతనం తర్వాత దుండగులు కార్ఖానాలోని డిజిటల్ వీడియో రికార్డర్‌ను పట్టుకువెళ్లడాన్ని పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు పక్కా ప్రొఫెషనల్స్ పనిగా అనుమానిస్తున్నారు.
అయితే వీరికి ఆ మారుమూల ఉన్న కార్ఖానా విషయం ఎలా తెలిసిందనేది కీలకంగా మారింది. దీంతో పాటు కార్ఖానా లోపల ఉన్న కొన్ని అంశాలు దుండగులు క్షుణ్ణంగా తెలిసినట్లు వ్యవహరించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఆ సంస్థలో ప్రస్తుతం పని చేస్తున్న, గతంలో పని చేసి మానేసిన వారి పాత్రను అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు.
సీసీ కెమెరాలే ఆధారం..
దొంగతనం విషయం తెలుసుకుని ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన కార్ఖానా యజమాని నిత్యాదాస్ ఆరుగురు అనుమానితుల పేర్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రత్యేక బృందాలు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. నేరం జరిగిన షేర్ అలీ తబేలా ప్రాంతంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు అవసరమైన సంఖ్యలో లేకపోవడం దర్యాప్తునకు అడ్డంకిగా మారింది. ఎక్కువగా ప్రైవేట్ కెమెరాలపై ఆధారపడి పోలీసులు ముందుకెళ్తున్నారు. అయితే ఈ కెమెరాల్లో అత్యధికం ఆయా ఇళ్లు, దుకాణాలను ఫేస్ చేసి ఉండటం, రోడ్డుపై ఫోకస్ చేసినవి తక్కువగా ఉండటంతో సరైన ఆధారాలు లభించట్లేదని పోలీసులు అంటున్నారు.
ఆటోను గుర్తించిన పోలీసులు..
పాన్ షాప్ వద్ద దుండగులు దిగిన ఆటోను దక్షిణ మండల పోలీసులు గుర్తించారు. దాని డ్రైవర్‌ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అఫ్జల్‌గంజ్–ఎంజీబీఎస్ మధ్యలో ఆ దుండగులు తన ఆటో ఎక్కారని సదరు డ్రైవర్ చెప్పినట్లు తెలిసింది. ఆటోలో వారు హిందీలో చర్చించుకున్నారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడని సమాచారం. మరోవైపు దొంగతనం సమయంలో దుండుగులు హిందీలో అదీ ఉత్తరాదికి చెందిన యాసలో మాట్లాడారంటూ బాధితులు పోలీసులకు వివరించారు.
దీంతో ముంబై, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్స్ ప్రమేయాన్నీ అనుమానిస్తున్న అధికారులు అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ తరహాలో నేరాలు చేసే పాత నేరగాళ్ల వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్ తదితర ప్రాంతాల్లోని లాడ్జిలు, హోటళ్లలో వారం రోజులుగా బస చేసి, మంగళవారం ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాలు ఆరా తీస్తున్నారు. అక్కడి సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment