పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కాపీ అందిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): సోషల్ మీడియాలో తనను టీడీపీ కార్యకర్తలు బెదిరించడంతోపాటు, అసభ్యంగా పోస్టులు పెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆదివారం గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమన్నారు.
అయితే తనపై పోటీ చేసి లోకేశ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, చంపుతామంటూ బెదిరిస్తున్నారని చెప్పారు. నానీచౌదరి, ‘టీడీపీ టీం లోకేశ్ అన్న’ పేరుతో, చెన్నై టీడీపీ ఫోరం టీమ్ అనే ఐడీ నుంచి అసభ్యంగా పోస్టులు పెట్టారని పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసం వద్ద రోడ్డుపై నిలబడి కృష్ణానదిలో వరద ఉధృతిని పరిశీలిస్తే, ఆయన ఇంట్లోకి వెళ్లామంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు పెట్టారని, చంద్రబాబు ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే ఆయన ఇంట్లోకి వెళ్లినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.
ప్రతిపక్ష నేత వరదల్లో చిక్కుకొని ఉంటే ప్రభుత్వం ఆయన క్షేమం గురించి కూడా ఆలోచిస్తుందని, ఆ ఉద్దేశంతో ఆయన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించామే తప్ప ఇంట్లోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆర్కే వెంట నేతలు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, మల్లేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment