మృతదేహాల వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు
బతుకమ్మ వెలుగులను చూడనున్న గంగమ్మ రెండు ఇళ్లలో చీకటిని నింపింది. పండగపూట కొత్తబట్టలు వేసుకుని మురిసిపోవాల్సిన పాపాయిలను పొట్టన పెట్టుకుంది. తల్లిదండ్రుల కంటిపాపలను కానరానిలోకాలకు తరలించింది. నవ్వుతూ తిరగాల్సిన ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యురూపంలో కబళించింది. బాధిత కుటుంబాలను అంతులేని శోకసంద్రంలో ముంచేసింది. చెరువులో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన హృదయవిదారక ఘటన బుధవారం వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో చోటు చేసుకుంది.
వరంగల్ రూరల్ ,చెన్నారావుపేట(నర్సంపేట) : పాపయ్యపేట ఊర చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గుండెల లావణ్య, ఐలయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు. రాజేష్, అఖిల(11) 6వ తరగతి, సాయి(8) 3వ తరగతి చదువుతున్నారు. వారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన పైరాల వీరయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అజయ్(7) 2వ తరగతి, చిన్నవాడు ప్రదీప్ 1వ తరగతి చదువుతున్నారు. మణెమ్మ కొంతకాలంగా పాపయ్యపేటలో తన తండ్రి ఇంటిలో పిల్లలతో కలిసి ఉంటోంది.
బట్టలు ఆరేయడానికి వెళ్లడంతో..
లావణ్య గ్రామ శివారులోని ఊర చెరువులోకి బుధవారం బట్టలు ఉతకడానికి వెళ్లింది. రాజేష్, అఖిల, సాయిలు తల్లి వెంట వెళ్లారు. ఆ చిన్నారులతో ఆడుకునే అజయ్ సైతం వారితో కలిసి చెరువుకు వెళ్లాడు. లావణ్య ఉతికిన బట్టలు ఆరవేయడానికి కట్టపైకి వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఈత కొట్టాలనే సరదాతో చెరవులోకి దిగారు. చెరువులోతుగా ఉండటంతో పోయారు. వారు మునిగిపోవడాన్ని గమనించిన లావణ్య కట్టపై నుంచే కేకలు వేస్తూ చెరువు వద్దకు చేరుకుంది. మునిగిపోతున్న పెద్ద కుమారుడు రాజేష్‌ను చేయిపట్టుకుని బయటకు లాగింది. మిగిలిన వారిని రక్షించడానికి ప్రయత్నం చేయగా వారు అప్పటికే నీటిలో మునిగిపోయారు. లావణ్య అరుపులు విన్న గ్రామస్తులు నీటిలో చిన్నారుల కోసం వెతికారు. అప్పటికే అఖిల, సాయి, అజయ్ మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్‌రావు, ఎస్సై కూచిపూడి జగదీష్ మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూచిపూడి జగదీష్ తెలిపారు. మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టించాయి. ముగ్గరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబాలకు ‘పెది’్ద ఆర్థిక సాయం
చెరువులో పడి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు సివిల్ సప్లై కార్పొషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి రూ.30వేలు ఆర్థిక సాయాన్ని టీæఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కంది కృష్ణారెడ్డి, పాపయ్యపేట ఎంపీటీసీ బిల్లా ఇంద్రసేనారెడ్డిలతో కలిసి అందించారు.
అమ్మ రాకపోతే..
బట్టలు కట్టపై ఆరేయడానికి అమ్మ వెళ్లింది. మేము స్నానం చేయడానికి నీళ్లలోకి దిగి బండను పట్టుకున్నాం. చేతులు జారి నీళ్లలో మునిగిపోయాం. మా అరుపులు విని అమ్మ వచ్చి నా చేయి పట్టుకుని లాగింది. చెల్లె అఖిల, తమ్ముడు సాయి, దోస్త్ అజయ్ నీళ్లలో మునిగిపోయారు. అమ్మ వెతికినా వాళ్లు దొరకలేదు. అమ్మ రాకపోతె నేను కూడా చనిపోదును.
– రాజేష్, లావణ్య దంపతుల పెద్ద కొడుకు
మృతదేహాల వద్ద రోదిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు
తెల్లవారితే సద్దుల బతుకమ్మ పండుగ. పల్లెలు, పట్టణాల్లో సందడి నెలకొనగా.. చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తన చెంతనే ఉన్న చిన్నారులు కొద్ది క్షణాల్లోనే చెరువు నీటలో మునిగిపోతుంటే.. కాపాడలేని స్థితిలో ఆ తల్లి గుండెలు పగిలేలా అరిచింది. పొరుగు ఉన్నవారు పరుగున వచ్చినా ఫలితం దక్కలేదు. లోతు తెలియక నీటిలోకి దిగిన ముగ్గురు చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. దుస్తులు ఉతుక్కోవడానికి చెరువు వద్దకు వెళ్లిన ఆ మాతృమూర్తి ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది. పిల్లల వెంట వెళ్లిన మరో బాలుడూ మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
– చెన్నారావుపేట(నర్సంపేట)