బూర్గంపాడు: ఒకరిని కాపాడేందుకు ఒకరు చెరువులోకి దిగి వరుసగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంట తీరని శోకం మిగిలింది. కళ్లెదుటే కొడుకు, ఇద్దరు మనవళ్లు మునిగిపోతుంటే వారిని కాపాడేందుకు ఓ వృద్ధుడు నరకయాతన అనుభవించాడు. ఈ విషాద ఘటన బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లమోతు కృష్ణయ్య తన కుమారుడు అప్పారావు(40), మనవడు తేజశ్(20), మరో మనవడు(కూతురు కుమారుడు) జాగర్లమూడి వినయ్‌కుమార్(17)తో కలిసి పొలం పనులకు వెళ్లాడు. కాసేపు పని చేసిన తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరారు. ఒళ్లంతా చెమట పట్టడంతో కడుక్కునేందుకు వినయ్‌కుమార్ సమీపంలోని రేపాక చెరువులోకి దిగాడు. అక్కడ నీరు లోతుగా ఉండడంతో అందులోనే మునిగిపోయాడు.
గమనించిన అప్పారావు అల్లుడిని కాపాడేందుకు చెరువులోకి దిగి, అతడు కూడా అందులోకే జారిపోతూ కేకలు వేశాడు. ఇది విన్న తేజశ్.. తండ్రిని కాపాడేందుకు చెరువులోకి దిగి అతడు కూడా అందులోనే మునిగిపోయాడు. గమనించిన తాత కృష్ణయ్య చెరువులోకి వెళ్లి మనవడిని కాపాడేప్రయత్నం చేశాడు. అప్పటికే నీళ్లలో లోతుకు వెళ్లిన తేజశ్ కృష్ణయ్యను పట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కృష్ణయ్య కూడా లోపలికి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఇంతలో పొరుగు రైతులు వారిని గమనించి లుంగీ విసిరి కృష్ణయ్యను కాపాడారు. మిగతా ముగ్గురు అప్పటికే నీళ్లలో మునిగి విగతజీవులుగా మారారు. కళ్లెదుటే కొడుకు, ఇద్దరు మనవళ్లు నీళ్లలో మునిగిపోవటంతో కృష్ణయ్య అక్కడే కుప్పకూలాడు. పొరుగు రైతులు అతనిని చెరువుకట్ట వద్దకు తీసుకొచ్చి ఓదార్చారు. ఈ సమాచారం తెలిసిన గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకున్నారు. ఈతగాళ్లు చెరువులో గాలించి మృతదేహాలను వెలికితీశారు. పాల్వంచ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ నరేష్, ఎస్‌ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబంలో తీరని విషాదం..
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ ఇంట్లో తీరని విషాదం నెలకొంది. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. మృతుడు నల్లమోతు అప్పారావు ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తనకున్న మూడెకరాల భూమిని తండ్రి కృష్ణయ్యతో కలసి సాగు చేస్తున్నాడు. అప్పారావు కుమారుడు తేజశ్ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అప్పారావుకు భార్య కరుణ, తేజశ్‌తో పాటు కుమార్తె చందన ఉన్నారు. భర్త, కొడుకు ఒకేసారి ప్రాణాలు కొల్పోవడంతో కరుణను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. మరో మృతుడు వినయ్‌కుమార్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఏన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, ఉమారాణి దంపతుల కుమారుడైన వినయ్‌కుమార్.. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పరీక్షలు వాయిదా పడడంతో ఇటీవలే తాతయ్య, అమ్మమ్మను చూసేందుకు లక్ష్మీపురం వచ్చి ఇక్కడే మృత్యువాత పడ్డాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు లక్ష్మీపురం వచ్చి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాలను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీపీ కైపు రోశిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు తదితరులు సందర్శించి సంతాపాన్ని తెలిపారు. కుటుంబసభ్యులను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment