ప్రమాదానికి గురైన టవేరా వాహనం, ఇన్‌సెట్‌లో గోథ్నవి(ఫైల్)
పెద్దల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ శుభ క్షణాలను తలచుకుంటూ ఆమె ఎన్నో కలలు కనింది. పెళ్లి..ఆ తర్వాత గడిపే నూరేళ్ల జీవితం ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించింది. అలా కలగంటూనే నిద్రలోకి జారుకుంది. అదే శాశ్వత నిద్ర అవుతుందని కలలోనూ ఊహించలేదు. ఓర్వకల్లు రాక్‌గార్డెన్ ఎదుట శుక్రవారం అర్ధరాత్రి ఆగివున్న ట్రాక్టర్‌ను టవేరా వాహనం ఢీకొనడంతో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోథ్నవి (22) దుర్మరణం పాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు.
సాక్షి, ఓర్వకల్లు/ప్రొద్దుటూరు క్రైం : పెళ్లి మంత్రాలకు బదులు ఆ ఇంటిలో మృత్యు ఘంటికలు మోగాయి. నిశ్చితార్థం చేసుకుని వస్తున్న వారిని మార్గమధ్యంలోనే మృత్యువు కాటేసింది. అర్ధరాత్రి కాస్త వారి పాలిట కాళరాత్రిగా మారింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన ఈదుల మల్లికార్జునరెడ్డి తిరుపతిలో వాచ్‌మన్‌గా పని చేస్తుండేవారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయన కుమార్తె గోథ్నవి ప్రొద్దుటూరు ఆచార్ల కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడితో గోథ్నవికి పెళ్లి నిశ్చయమైంది. ఇందులో భాగంగా రెండు కుటుంబాలు నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో గోథ్నవితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు టవేరా (ఏపీ 07 ఏఎం 5999) వాహనంలో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిశ్చితార్థమయ్యింది. తిరిగి ప్రొద్దుటూరుకు బయలుదేరారు. కాగా.. నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామానికి చెందిన ఎల్లప్ప.. మద్దిలేటయ్య స్వామి దర్శనం కోసం 20 మంది బంధువులతో ట్రాక్టర్ (ఏపీ 22ఏసీ 7033)లో శుక్రవారం రాత్రి బయలు దేరారు. ట్రాక్టర్ ముందు భాగం లైట్లు సరిగా పనిచేయడం లేదని ఓర్వకల్లు రాక్‌గార్డెన్ వద్ద రోడ్డు పక్కన నిలిపారు.
టవేరా వాహనం ఢీకొట్టింది ఈ ట్రాక్టర్‌నే..
అదే సమయంలో వేగంగా వచ్చిన టవేరా వాహనం ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మార్తల కొండారెడ్డి (65) అనే వ్యక్తి, బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (60) వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న గోథ్నవి తీవ్రగాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ఇందిర, పెద్దమ్మ సక్కుబాయి, సన్నిహితురాలు లత తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇందిర, లత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తండ్రి మల్లికార్జునరెడ్డి, డ్రైవర్ మహబూబ్‌బాషాలకు రక్తగాయాలయ్యాయి. చిన్నాన్న శివనాగిరెడ్డి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ట్రాక్టర్‌లో ఉన్న బోయ శ్రీనివాసులు(నాగటూరు), బోయ నరసింహులు(కల్లూరు), డ్రైవర్ పరశురాముడు(వడ్డెమాను), తెలుగు సుబ్బన్న(వడ్డెమాను), బోయ సవారి(మల్యాల), బోయ పవన్‌కుమార్(నాగటూరు) కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నిశ్చితార్థానికి పెద్ద మనిషి వెళ్లి..
ప్రొద్దుటూరు పట్టణంలోని మిట్టమడి వీధికి చెందిన మార్తల కొండారెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం నుంచి ద్వారకానగర్‌లో ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. కుమార్తె నీరజకు వివాహం కాగా.. అమెరికాలోని టీసీఎల్ కంపెనీలో పని చేస్తోంది. మల్లికార్జునరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నందున నిశ్చితార్థంలో పెద్ద మనిషిగా మాట్లాడేందుకు రావాలని గోథ్నవి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ప్రమాదంలో కొండారెడ్డి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకువచ్చారు. భార్య లక్ష్మీదేవి, కుమారులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా నుంచి కుమార్తె వచ్చిన తర్వాత సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్న గోథ్నవి
గోథ్నవి బీటెక్ చదివింది. ప్రొద్దుటూరులోని సరస్వతీ విద్యామందిరంలో 1, 4,5 తరగతులకు బోధించేది. గత నెల 22న పుట్టిన రోజు వేడుకలను స్కూల్‌లో ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా జరుపుకుంది. గురువారం పాఠశాలకు వచ్చిన ఆమె శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టింది. శనివారం స్కూల్‌కు తిరిగి వస్తానని వెళ్లిందని ఉపాధ్యాయులు తెలిపారు.
మూడేళ్ల క్రితం కుమారుడు మృతి
మల్లికార్జునరెడ్డి, ఇందిర దంపతులకు శివ, గోథ్నవి సంతానం. మూడేళ్ల క్రితం శివ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువక ముందే కుమార్తె కూడా అకాల మరణం చెందింది. ఇద్దరు పిల్లలను కోల్పోయి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ దంపతులను చూసి స్థానికులు చలించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment