Wedding engagement
-
మధ్యాహ్నం నిశ్చితార్థం.. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం!!
పెద్దల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ శుభ క్షణాలను తలచుకుంటూ ఆమె ఎన్నో కలలు కనింది. పెళ్లి..ఆ తర్వాత గడిపే నూరేళ్ల జీవితం ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించింది. అలా కలగంటూనే నిద్రలోకి జారుకుంది. అదే శాశ్వత నిద్ర అవుతుందని కలలోనూ ఊహించలేదు. ఓర్వకల్లు రాక్‌గార్డెన్ ఎదుట శుక్రవారం అర్ధరాత్రి ఆగివున్న ట్రాక్టర్‌ను టవేరా వాహనం ఢీకొనడంతో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గోథ్నవి (22) దుర్మరణం పాలైంది. ఆమెతో పాటు మరో ఇద్దరు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. సాక్షి, ఓర్వకల్లు/ప్రొద్దుటూరు క్రైం : పెళ్లి మంత్రాలకు బదులు ఆ ఇంటిలో మృత్యు ఘంటికలు మోగాయి. నిశ్చితార్థం చేసుకుని వస్తున్న వారిని మార్గమధ్యంలోనే మృత్యువు కాటేసింది. అర్ధరాత్రి కాస్త వారి పాలిట కాళరాత్రిగా మారింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ద్వారకానగర్‌కు చెందిన ఈదుల మల్లికార్జునరెడ్డి తిరుపతిలో వాచ్‌మన్‌గా పని చేస్తుండేవారు. ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయన కుమార్తె గోథ్నవి ప్రొద్దుటూరు ఆచార్ల కాలనీలోని సరస్వతీ విద్యామందిరంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడితో గోథ్నవికి పెళ్లి నిశ్చయమైంది. ఇందులో భాగంగా రెండు కుటుంబాలు నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. శుక్రవారం వేకువజామున 4 గంటల సమయంలో గోథ్నవితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు టవేరా (ఏపీ 07 ఏఎం 5999) వాహనంలో ప్రొద్దుటూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిశ్చితార్థమయ్యింది. తిరిగి ప్రొద్దుటూరుకు బయలుదేరారు. కాగా.. నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను గ్రామానికి చెందిన ఎల్లప్ప.. మద్దిలేటయ్య స్వామి దర్శనం కోసం 20 మంది బంధువులతో ట్రాక్టర్ (ఏపీ 22ఏసీ 7033)లో శుక్రవారం రాత్రి బయలు దేరారు. ట్రాక్టర్ ముందు భాగం లైట్లు సరిగా పనిచేయడం లేదని ఓర్వకల్లు రాక్‌గార్డెన్ వద్ద రోడ్డు పక్కన నిలిపారు. టవేరా వాహనం ఢీకొట్టింది ఈ ట్రాక్టర్‌నే.. అదే సమయంలో వేగంగా వచ్చిన టవేరా వాహనం ట్రాక్టర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టవేరా వాహనంలో డ్రైవర్ పక్కన కూర్చున్న మార్తల కొండారెడ్డి (65) అనే వ్యక్తి, బి.కోడూరు మండలం పాయలకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి (60) వాహనంలోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న గోథ్నవి తీవ్రగాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ఇందిర, పెద్దమ్మ సక్కుబాయి, సన్నిహితురాలు లత తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇందిర, లత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తండ్రి మల్లికార్జునరెడ్డి, డ్రైవర్ మహబూబ్బాషాలకు రక్తగాయాలయ్యాయి. చిన్నాన్న శివనాగిరెడ్డి మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే ట్రాక్టర్లో ఉన్న బోయ శ్రీనివాసులు(నాగటూరు), బోయ నరసింహులు(కల్లూరు), డ్రైవర్ పరశురాముడు(వడ్డెమాను), తెలుగు సుబ్బన్న(వడ్డెమాను), బోయ సవారి(మల్యాల), బోయ పవన్‌కుమార్(నాగటూరు) కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిశ్చితార్థానికి పెద్ద మనిషి వెళ్లి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మిట్టమడి వీధికి చెందిన మార్తల కొండారెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతను కొన్ని రోజుల క్రితం నుంచి ద్వారకానగర్‌లో ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. కుమార్తె నీరజకు వివాహం కాగా.. అమెరికాలోని టీసీఎల్ కంపెనీలో పని చేస్తోంది. మల్లికార్జునరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నందున నిశ్చితార్థంలో పెద్ద మనిషిగా మాట్లాడేందుకు రావాలని గోథ్నవి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ప్రమాదంలో కొండారెడ్డి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని ప్రొద్దుటూరుకు తీసుకువచ్చారు. భార్య లక్ష్మీదేవి, కుమారులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా నుంచి కుమార్తె వచ్చిన తర్వాత సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్న గోథ్నవి గోథ్నవి బీటెక్ చదివింది. ప్రొద్దుటూరులోని సరస్వతీ విద్యామందిరంలో 1, 4,5 తరగతులకు బోధించేది. గత నెల 22న పుట్టిన రోజు వేడుకలను స్కూల్లో ఉపాధ్యాయులతో కలిసి సంతోషంగా జరుపుకుంది. గురువారం పాఠశాలకు వచ్చిన ఆమె శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టింది. శనివారం స్కూల్‌కు తిరిగి వస్తానని వెళ్లిందని ఉపాధ్యాయులు తెలిపారు. మూడేళ్ల క్రితం కుమారుడు మృతి మల్లికార్జునరెడ్డి, ఇందిర దంపతులకు శివ, గోథ్నవి సంతానం. మూడేళ్ల క్రితం శివ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మరువక ముందే కుమార్తె కూడా అకాల మరణం చెందింది. ఇద్దరు పిల్లలను కోల్పోయి..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ దంపతులను చూసి స్థానికులు చలించిపోయారు. -
అనుష్కకు నిశ్చితార్ధమా ?
తమిళసినిమా: అందాల అపరంజి బొమ్మ నటి అనుష్క పెళ్లికి సిద్ధమవుతోంది. వివాహ నిశ్చితార్థానికి ముహూర్తం కుదిరింది లాంటి ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నా, తాజాగా ఇంకాస్త బలంగా వినిపిస్తోంది. బాహుబలి–2 చిత్రం తరువాత అనుష్క ఒక్క కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు.ఆ చిత్ర సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రాన్నే ఇటీవల పూర్తి చేసింది. ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాహుబలి పార్టు–1, పార్టు–2 చిత్రాల్లో ప్రభాస్‌కు జంటగా నటించింది. ఈ రెండు చిత్రాల చిత్రీకరణే దాదాపు నాలుగైదేళ్లు పట్టింది. అయితే మధ్యలో ఇంజి ఇడుప్పళగి (తెలుగులో సైజ్ జీరో) చిత్రం కోసం తన బరువును భారీగా పెంచి నటించిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి నానా తంటాలు పడక తప్పలేదు. బాహుబలి–2 చిత్రంలో కూడా ఆ ఎఫెక్ట్ పడింది.అనుష్కను ఆ చిత్రంలో స్లిమ్‌గా చూపించడానికి ఆ చిత్ర వర్గాలు పెట్టిన ఖర్చు కోట్లలోనేనని ప్రచారం జరిగింది. ఏదైతేనేమి ఎక్సర్సైజ్, జిమ్, యోగా వంటి కసరత్తులతో ఇప్పటికి అనుష్క తిరిగి అందగత్తెగా తయారైంది. వదంతుల హోరు బహుబలి చిత్ర హీరో ప్రభాస్‌తో అనుష్క సన్నిహితం, చెట్టా పట్టాలు, ప్రేమ అంటూ రకరకాల వదంతులు చాలా కాలంగానే హోరెత్తుతున్నాయి. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం హల్చల్ చేసింది. ఇలాంటి ప్రచారాలపై అనుష్క మౌనం వహించినా, ప్రభాస్ మాత్రం ఖండించారు. ప్రభాస్‌కు ఆయన కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్రాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్, అనుష్కల పెళ్లి చేసుకోవడం ఖాయం అని పెళ్లి నిశ్చితార్థం డిసెంబర్లో జరగనుందనే ప్రచారం మళ్లీ మొదలైంది. అంతే కాదు అనుష్క బరువు తగ్గి స్లిమ్‌గా మారడానికి కారణం సినిమాల్లో నటించడానికి కాదని, పెళ్లి కోసమేనని టాక్ వినిపిస్తోంది. అనుష్క నటించాలంటే ఆమెకున్న క్రేజ్‌కు అవకాశాలు వరుస కట్టేవని, వస్తున్న అవకాశాలను తను నిరాకరిస్తుందనే మాట వినిపిస్తోంది. ఈ విషయం గురించి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ చిర్రుబుర్రులాడుతున్నారట. పెళ్లి అనేది తన వ్యక్తిగతం అని, దాని గురించి అడిగితే తనకు చిరాకు పుడుతుందని, నిజంగా పెళ్లి కుదిరితే అందరికీ చెబుతానని అంటున్నారట. వీరి పెళ్లి గురించి అడిగితే చిరాకు పడుతున్నాడట. ఇంతకీ ప్రభాస్, అనుష్కలకు డిసెంబర్లో వివాహ నిశ్చితార్థం అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాంట్లో నిజం ఎంత? ఎప్పటిలానే ఇదీ ఫేకేనా? రియల్ ఏమిటన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అనుష్క చేతిలో సినిమాలు లేకపోయినా, ప్రభాస్ మాత్రం సాహో చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. -
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
-
రెజ్లర్ సాక్షి నిశ్చితార్థం
రోహ్తక్ (హరియాణా): రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజా మోగనుంది. సహచర రెజ్లర్ సత్యవర్త్ కడియన్‌తో ఆదివారం ఆమె వివాహ నిశ్చితార్థం జరిగింది. సాక్షి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సమీప బంధువులు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. రెజ్లర్ సత్యవర్త్ తన తండ్రికి చెందిన అఖాడాలో శిక్షణ పొందాడు. 97 కేజీల ఫ్రీస్టరుుల్ కేటగిరీలో బరిలోకి దిగిన అతను 2010 యూత్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గాడు. -
నటి అంకితకు నిశ్చితార్థం
నటి అంకిత ఇంట త్వరలో బాజాభజంత్రీలు మోగనున్నాయి. ప్రేమించిన వాడిని కొంగును ముడి వేసుకోనుంది. అంకిత వివాహ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. ఇంతకీ ఈ అంకిత ఎవరో గుర్తుందా? రస్నాబేబీగా పాపులర్ అయ్యి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించిన నటే అంకిత. అలా ప్రకటనల రంగం నుంచి చిత్ర రంగప్రవేశం చేసి హీరోయిన్గా ఎదిగిన అంకిత తమిళం, తెలుగు భాషలలో మంచి పేరు తెచ్చుకుంది. తమిళంలో లండన్, థకధిమితా, తిరుమురుగా, అంబుగురి తదితర చిత్రాలలో కథానాయకిగా నటించిన అంకిత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో సింహాద్రి, బాలక్రిష్ణ సరసన విజయేంద్రవర్మ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. లాహిరి లాహిరి లాహిరిలో, అందురూ దొంగలే దొరికితే వంటి చిత్రాలలో నటించిన అంకిత కొంత కాలం క్రితం నటనకు దూరం అయ్యి న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకితకు ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడంతో పెళ్లికి లైన్ క్లియర్ అయ్యింది. అంకిత, విశాల్‌ల వివాహ నిశ్చితార్ధం శనివారం ముంబాయిలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. వివాహం త్వరలో జరగనుందని సమాచారం. -
త్రిషకు దిల్ ఉందా?
సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరొందిన నటి రాయ్‌లక్ష్మి. ఈ భామకు దూకుడెక్కువ అని కోలీవుడ్ వర్గాలంటుంటాయి కూడా. చాలా కాలం తరువాత అరణ్మణై చిత్రంతో విజయాన్ని చూసిన రాయ్‌లక్ష్మి మరోసారి తన దూకుడును ప్రవర్తించారు. నటి త్రిష, నిర్మాత పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్ పెళ్లాడనున్నట్లు వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇటీవల త్రిష ఇంట్లో రహస్యంగా జరిగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే అది అసత్య ప్రచారం అంటూ త్రిష, ఆమె తల్లి ఉమా ఖండించడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై నటి రాయ్‌లక్ష్మి తన ట్విట్టర్లో కామెంట్ చేస్తూ త్రిషకు పరోక్షంగా చురకలు వేశారు. ఎవరికైనా నిజాన్ని అంగీకరించడానికి దిల్ ఉండాలన్నారు. అది లేని కొందరు జరిగిన నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ట్విట్టర్లో పోస్టు చేయడం కోలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. దీంతో త్రిష వివాహ నిశ్చితార్థం జరిగిన మాట వాస్తవమేననిపిస్తోంది. మరి రాయ్‌లక్ష్మి వ్యాఖ్యలకు త్రిష ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
21న బాలకృష్ణ కుమార్తె వివాహం
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ నెల 21వ తేదీన ఉదయం 8.52కు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మతుకుమిల్లి శ్రీభరత్‌తో జరగనుంది. ఆదివారం బాలకృష్ణ నివాసంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న హరికృష్ణ హాజరు కాలేదు.