![TN Woman Injured In Accident While Avoiding Falling AIADMK Flag Pole Lost Leg - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/16/tamilnadu.jpg.webp?itok=MCXNbavF)
చెన్నై : తమిళనాడులో అధికార పార్టీ శ్రేణుల అత్యుత్సాహం కారణంగా ప్రమాదం బారిన పడిన మహిళ తన కాలును కోల్పోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి ఎడమ కాలు మోకాలు కింది భాగం మొత్తాన్ని తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమె కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారింది. అధికార పార్టీ జెండా స్తంభం కారణంగా అనురాధ రాజేశ్వరి అనే మహిళ కాళ్లపై నుంచి లారీ దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఆఫీసుకు స్కూటీపై వెళ్తున్న క్రమంలో కోయంబత్తూరు హైవే మీదకు చేరుకున్న అనురాధ.. అన్నాడీఎంకే పార్టీ జెండా కట్టేందుకు ఉపయోగించిన స్తంభం మీద పడటం గమనించింది. దానిని తప్పించబోయి కిందపడిపోయింది. అప్పుడే ఎదురుగా వస్తున్న లారీ ఆమె కాళ్ల మీద నుంచి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లకు గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆమె ఎడమ కాలిని తొలగించినట్లు ఆస్పత్రి వైద్యులు శనివారం తెలిపారు. దీంతో తమ ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ అనురాధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న కూతురి దుస్థితికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.(చదవండి : యువతి కాళ్లపై నుంచి దూసుకెళ్లిన లారీ..)
కాగా అనురాధ ఉదంతంతో తమిళనాట బ్యానర్లు, ఫ్లెక్సీల వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఇదే తరహాలో శుభశ్రీ అనే టెకీ ప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆమె తీవ్రగాయాలపాలై మరణించడంతో అన్నాడీఎంకేపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక తాజా ఘటనకు లారీ డ్రైవర్ అతి వేగమే కారణమని పోలీసులు చెబుతుండగా.. అనురాధ కుటుంబ సభ్యులు మాత్రం ముఖ్యమంత్రి పళనిసామికి స్వాగతం పలికేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు ఏర్పాటు చేసిన జెండానే కారణమని ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు బనాయించి అధికార పార్టీ నాయకులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment