చిత్తూరు (అర్బన్): పదేళ్ల క్రితం చిత్తూరులో అప్పటి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే బాబు వెళుతున్న కారును లక్ష్యంగా చేసుకుని పట్టపగలు నడిరోడ్డు పై మందుపాతర పేల్చారు. ఒక పోలీసు కానిస్టేబుల్ (గన్‌మెన్) చనిపోగా.. సీకే త్రుటిలో బయటపడ్డారు. ఈ కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనని చిత్తూరు వాసులు ఆసక్తిగా ఉన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల నుంచి నగరంలోని ప్రముఖులకు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు.
2007 డిసెంబరు 31న అప్పటి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే.బాబు కట్టమంచిలోని తన నివాసం నుంచి గన్‌మెన్లు, అనుచరులతో వెళుతుండగా సాయిబాబా ఆలయం సమీపంలోని కల్వర్టు వద్ద మందుపాతర పేలింది. సీకే.బాబు గన్‌మెన్‌గా ఉన్న సురేంద్ర మృతి చెందాడు. సీకే.బాబుతో పాటు ఆయన అనుచరులు సైతం గాయపడ్డారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుల్లో టీడీపీ నాయకులు కఠారి మోహన్ (చనిపోయాడు), చింటూ, కఠారి ప్రవీణ్ (చిత్తూరు మేయర్ భర్త), జలగం మురళి, కిశోర్, గోపి, జ్యోతి, పురుషోత్తం, గిరిధర్‌రెడ్డి, ఏకాంబరం, డీఏ శ్రీనివాస్ (చిత్తూరు ఎమ్మెల్యే కొడుకు), వెంకటస్వామి, అర్జున్, రాజేష్, ఏడుకొండల యాదవ్, శ్రీను, వై.శ్రీనివాసులు, రవి ఉన్నారు. సీకే బాబుతో సహా మొత్తం 81 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. వారిలో 51 మందిని న్యాయమూర్తి కపర్తి విచారించి తీర్పును సోమవారానికి రిజర్వు చేశారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతను వైఎస్సార్ కడప సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment