వాహనాన్ని నడుపుతున్న బాలుడు
మైనర్లు అతివేగంతో ఇసుక, మట్టి వాహనాలు నడుపుతూ నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. ఎస్పీ ఆదేశాలతో కొందరు పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నా మరికొందరు మామూళ్ల మత్తులో వాహన యజమానులకు సహకరిస్తున్నారు. ఫలితంగా మైనర్లు, లైసెన్స్‌లు లేని డ్రైవర్ల చేతిలో అమాయకుల జీవితాలు చితికిపోతున్నాయి. కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): జిల్లాలో మట్టి, గ్రావెల్, ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. వీరిలో కొందరు ప్రభుత్వ అనుమతితో తరలిస్తున్నా, మరికొందరు తహసీల్దార్, ఎస్సైల అండదండలతో రవాణా చేస్తున్నారు. కావలి నుంచి సూళ్లూరుపేట వరకు, ఉదయగిరి నుంచి నెల్లూరు వరకు నిత్యం రవాణా జరుగుతూనే ఉంది. మొత్తం 2,800 టిప్పర్లు, నాలుగువేలకు పైగా ట్రాక్టర్లు రవాణా చేస్తున్నట్లు ఓ అంచనా. ఈ క్రమంలో వాహనాలు నడుపుతున్న వారిలో అధిక శాతం మందికి లైసెన్సులు ఉండటంలేదు. పలువురు యజమానులు మైనర్లకు వాహనాలు అప్పగించేశారు. వీరు అతివేగంతో ఇష్టానుసారంగా నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఆర్టీఏ, పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి.
కనిగిరి రిజర్వాయర్ నుంచి..
బుచ్చిరెడ్డిపాళెం కనిగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు సుమారు 50 టిప్పర్లు, 200 ట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్నాయి. వీరిలో 70 శాతం మందికి లైసెన్స్‌లు లైవు. ఇదిలాఉండగా వారిలో మైనర్ డ్రైవర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ముంబై జాతీయ రహదారిపై వీరు ట్రాక్టర్లతో దూసుకెళుతున్న తీరు ప్రయాణికులను, ప్రజలను భయపెడుతోంది.
ఏడాదికి 100 మందికిపైనే
ఏడాదికి సుమారు వంద మంది మట్టి, ఇసుక, గ్రావె ల్ టిప్పర్లు, ట్రాక్టర్ల కింద పడి మృతిచెందుతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ట్రాక్టర్ యజమానులు మైనర్లనే డ్రైవర్లుగా ఉపయోగిస్తున్నా రు. మైనర్ల ప్రమాదాలు కొందరు పోలీసులకు కాసు ల వర్షం కురిపిస్తోంది. అలాగే లైసెన్స్ లే కుండా ప్రమాదం చేసినా ఆదాయం తెచ్చిపెడుతోంది.
దృష్టి సారిస్తే చెక్ పడినట్లే
జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్నో చర్యలు చేపట్టారు. అయితే మళ్లీ షరామామూలే అయింది. కొందరు పోలీసులు తనిఖీలు చేసి జరిమానా విధిస్తుంటే, మరికొందరు ఆ వాహనాలు తిరిగే సమయాల్లో అటువైపే వెళ్లడంలేదు. ఇసుక, మట్టి, గ్రావెల్ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడితే మైనర్ డ్రైవర్లు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారికి చెక్ పడుతుంది. ఎస్పీ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఎస్పీ దృష్టి సారించాలి
ఎస్పీ ఆదేశాలను కొందరు పట్టించుకోవడంలేదు. పోలీసులు లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపే మట్టి, ఇసుక, గ్రావెల్ ట్రాక్టర్ల డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి. మైనర్లను డ్రైవర్లుగా పెట్టుకునే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – పచ్చా మధుసూదన్‌రావు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్
లైసెన్స్ లేకుంటే చర్యలు తప్పవు
వాహనాలు నడిపే వారికి లైసెన్స్‌లు తప్పనిసరి. మైనర్లతో వాహనాలు నడిపిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే ఎంతోమందికి జరిమానా విధించాం. కనిగిరి రిజర్వాయర్ నుంచి వెళ్లే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – సుబ్బారావు, సీఐ, బుచ్చిరెడ్డిపాళెం
Comments
Please login to add a commentAdd a comment