కిడ్నాప్‌కు యత్నించిన షేక్ న్యాయతుల్లా
పశ్చిమగోదావరి, పాలకోడేరు : పాలకోడేరు మండలంలో సినీ ఫక్కీలో ఒక ఉపాధ్యాయురాలు కిడ్నాప్ యత్నం మంగళవారం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్సై వి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. విస్సాకోడేరులో ఒక ప్రైవేట్ విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నాగళ్ల అనూషను ఇద్దరు యువకులు కారులో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. విస్సాకోడేరులో తన తల్లి అరుణకుమారితో కలిసి రోడ్డుపై వెళుతుండగా పూలపల్లి గ్రామానికి చెందిన షేక్ న్యాయతుల్లా తన స్నేహితుడు శేషపు సిరితో ఒక కారులో వచ్చి అనూషను కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. దీన్ని అడ్డుకోబోయిన తల్లిని యువకుడు బలవంతంగా నెట్టి వేసి వేగంగా వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లిపోయాడు. తన కూతురి కిడ్నాప్‌ను నిలువరించేందుకు అరుణకుమారి పెద్దపెద్ద కేకలు వేస్తూ కారు డోరు పట్టుకుని వేలాడినప్పటికీ వారు కనికరించకుండా ఈడ్చుకుపోయారు. దీంతో అనుష తల్లికి తీవ్రగాయాలయ్యాయి.
అరుణకుమారి సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం గొల్లగరువు. కాగా కొంతకాలంగా పూలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. పూలపల్లి గ్రామానికి చెందిన షేక్ న్యాయతుల్లా అనూష గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు, పాలకొల్లు పోలీసుల సమక్షంలో ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వివాహాలు చేసుకునే విధంగా నిర్ణయించారు. అప్పటినుంచి అనూష అతడికి దూరంగా ఉంటోంది. ఇదిలా ఉండగా అనూషకు కొద్ది రోజుల క్రితం విస్సాకోడేరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల క్రితం విస్సాకోడేరుకు మకాం మార్చారు. ఏమైందో ఏమోగానీ న్యాయతుల్లా తన స్నేహితుడు శేషపు సిరితో కలిసి మంగళవారం అనుషను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. వేగంగా వెళుతున్న కారులో యువతి కేకలను గమనించి భీమవరం శివారు తాడేరులో స్థానికులు అడ్డుకుని వారికి పోలీసులకు పట్టించారు. గాయాలపాలైన అరుణకుమారిని ఆసుపత్రిలో చేర్పించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ విషయం పాలకోడేరు, భీమవరం పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment