
కాలి బూడిదైన సామగ్రి, ఇంట్లో నుంచివస్తున్న పొగలు
ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా టీవీ పేలిన సంఘటనలో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో వీధిలోని ప్రజలు సాయం చేసేందుకు గుమిగూడారు. అదే సమయంలో పెద్ద శబ్ధంతో టీవీ పేలడంతో శకలాలు బయటికి దూసుకొని వచ్చి మీద పడ్డాయి. నిప్పు కనికల్లా ఉన్న శకలాలు మీద పడటంతో శరీరం కాలి ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని వసంతపేటలో గురువారం జరి గింది. వీఆర్‌ఏ జయరాజ్ వసంతపేటలో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య మరియమ్మ రెండు రోజుల క్రితం అనంతపురం వెళ్లి గురువారం మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. జయరాజ్ విధులకు వెళ్లడంతో ఆమె ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత విద్యుత్ వైర్లలో నుంచి పొగలు వ్యాపించడంతో ఇళ్లంతా పొగ కమ్ముకుంది. పొగ నిండుకొని ఊపిరాడకపోవడంతో ఆమె సొమ్మ సిల్లి పడిపోయింది. ఇంటి నుంచి పొగ రావడంతో వీధిలోని యువకులు ఇంట్లోకి వెళ్లిఆమెను బయటికి ఎత్తుకొని రాగా, ఇంకొందరు గ్యాస్ సిలిండర్‌ను తీసుకొని వచ్చారు. అప్పటికే పొగ ఎక్కువ కావడంతో లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు.
పెద్ద శబ్ధంతో పేలిన టీవీ
ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని తెలుసుకున్న స్థానికులు ద్ద ఎత్తున జయరాజ్ ఇంటి వద్దకు వచ్చారు. మహిళలు, చిన్న పిల్లలతో ఇంటి పరిసరాలు నిండిపోయాయి. కొద్ది సేపటి తర్వాత టీవీ పెద్ద శబ్ధంతో పేలిపోయింది. పేలిన టీవీ భాగాలు బయటికి వచ్చి పడటంతో స్మైలీ (7), షాహిరా (6), ముబారక్ (10) అనే చిన్నారులతో పాటు పవన్‌కుమార్, రాధిక, మహబూబ్‌చాన్, గాంధీ, సందీప్‌లు గాయపడ్డారు. గాయడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి, పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. పవన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనికి జిల్లా ఆస్పత్రిలోని బర్నింగ్ వార్డులో చికిత్సను అందిస్తున్నారు. ఊటుకూరు వీరయ్య బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పవన్‌కుమార్ భోజనానికి ఇంటికి వస్తున్న సమమంలో ఈ ప్రమాదం జరిగింది.
పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా..తల్లీ ఇద్దరు కుమార్తెలకు గాయాలు
వసంతపేటలో నివస్తున్న మహబూబ్‌చాన్ కుమార్తెలు ముబారక్, షాహిరాలు సమీపంలోని మున్సిపల్ పాఠశాలలో 1, 5వ తరగతి చదువుతున్నారు. భోజన విరామ సమయంలో ఆమె కుమార్తెలను ఇద్దరిని ఇంటికి పిలుచుకొని వస్తూ దారిలో అగ్నిప్రమాదం జరిగిన జయరాజ్ ఇంటి వద్ద ఆగారు. అదే సమయంలో టీవీ పేలిన సంఘటనలో ఆమెతో పాటు పిల్లలిద్దరికి గాయాలు అయ్యాయి. తల్లీ, కుమార్తెలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయరాజ్ ఉన్న ఇంటిపై రాధిక కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో నుంచి పొగ రావడంతో మొదటి అంతస్తులో ఉన్న రాధిక, కుమార్తె స్మైలీని తీసుకొని కిందికి వెళ్లారు. ఆమె కిందికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఈ సంఘటన జరిగింది. తల్లీ కూతుళ్లకు గాయాలు కావడంతో హోమస్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నారు. శరీరం కాలడంతో చిన్నారి స్మైలీ విలపించసాగింది.
బుగ్గిపాలైన సామగ్రి: అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంట్లోసామగ్రి పూర్తిగా కాలిపోయింది. టీవీతో పాటు ఫ్రిజ్, స్టీల్ సామగ్రి, బట్టలు, బీరువాలో ఉన్న రూ. 30 వేలు నగదు కాలి బూడిదయ్యాయి. ఏ ఒక్క వస్తువు మిగల్లేదు. కుటుంబ సభ్యులంతా కట్టుబట్టలతో మిగిలారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈశ్వరరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment