
సినీ నటుడు శొంఠినేని శివాజీని అడ్డుపెట్టుకుని టీవీ9లో రవిప్రకాష్ సాగించిన కుట్ర బట్టబయలైంది.
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు శొంఠినేని శివాజీని అడ్డుపెట్టుకుని టీవీ9లో రవిప్రకాష్ సాగించిన కుట్ర బట్టబయలైంది. తాము బాధ్యతలు చేపట్టకుండా శివాజీని అడ్డుపెట్టుకుని రవిప్రకాష్ ఆడిన నాటకానికి కొత్త యాజమాన్యం ముగింపు పలికింది. తన పట్టు సడలిపోకూడదన్న దురుద్దేశంతో అడ్డదారులు తొక్కిన ఆయనను టీవీ9 నుంచి సాగనంపింది. ఇక టీవీ9తో రవిప్రకాష్‌కు ఎటువంటి సంబంధం లేదని, కైవలం మైనార్టీ షేర్‌హోల్డర్‌గా మాత్రమే కొనసాగుతారని అలందా గ్రూపు తేల్చిచెప్పింది. ఈ నెల 8న జరిగిన డైరెక్టర్ల సమావేశంలోనే రవిప్రకాష్‌ను తొలగిస్తూ నిర్ణయం జరిగిందని, ఈ రోజు షేర్‌హోల్డర్ల ఆమోదం కూడా తీసుకున్నామని వెల్లడించింది.
తనకు తల్లిదండ్రుల కంటే రవిప్రకాష్ ఎక్కువని ఓ సందర్భంలో శివాజీ చెప్పారు. చాలా ఏళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. శివాజీని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబుకు అనుకూలంగా రవిప్రకాష్ ‘ఆపరేషన్ గరుడ’కు రూపకల్పన చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. జర్నలిజం విలువలను తుంగలో తొక్కి తన వర్గానికి కొమ్ముకాసిన రవిప్రకాష్ తాజాగా శివాజీ పేరుతో ఆడిన నాటకం టీవీ9 కొత్త యాజమాన్యానికి తెలిసిపోవడంతో ఆయన కుతంత్రాలు వెలుగులోకి వచ్చాయి.
తన భక్తుడు శివాజీతో కలిసి రవిప్రకాష్ మొదట డ్రామాకు తెర తీశారు. టీవీ9 చానళ్లను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీఎల్) నుంచి 90.54 శాతం షేర్లను కొనుగోలు చేసిన అలందా గ్రూపుకు యాజమాన్య బాధ్యతలు అప్పగించకుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. శివాజీతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయించి కొత్త యాజమాన్యానికి అడ్డంకులు కల్పించారు. ఈ విషయాన్ని పసిగట్టిన అలందా గ్రూపు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మొత్తం డొంకా కదిలింది. మరోవైపు తాను రాజీనామా చేసినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని రవిప్రకాష్‌పై కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారంపై వ్యామోహంతో అడ్డదారులు తొక్కిన రవిప్రకాష్‌ను ఎట్టకేలకు కొత్త యాజమాన్యం సాగనంపింది. జర్నలిజం విలువలు పాటిస్తూ, ఉద్యోగులకు అన్నివిధాలుగా సహకారం అందిస్తూ ముందుకు సాగుతామని అలందా గ్రూపు ప్రకటించింది.
నోరు విప్పని శివాజీ
గత రెండు రోజులుగా టీవీ9 వ్యవహారంపై జరుగుతున్న పరిణామాలపై నటుడు శివాజీ ఇప్పటివరకు స్పందించలేదు. తమ ఎదుట హాజరుకావాలని సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆయన సమాధానం ఇవ్వలేదు. తాను ఎంతో ఇష్టపడే రవిప్రకాష్‌కు కష్టం వచ్చినా శివాజీ బయటకు రాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. తాను బయటకు వచ్చి మాట్లాడితే ఎక్కడ తమ కుట్ర బయటపడుతుందన్న భయంతోనే శివాజీ మౌనంగా ఉన్నాడన్న వాదనలు విన్పిస్తున్నాయి.