పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతోన్న టీవీ9 రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆ చానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్ ఎట్టకేలకు 27 రోజుల పరారీ తర్వాత పోలీసుల ఎదుటకు వచ్చాడు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పోర్షే కారులో(పీవీ05సీ 0055) రవిప్రకాశ్ సైబరాబాద్ సైబర్ క్రైం కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న విలేకరులను పలకరిస్తూ నేరుగా కార్యాలయంలోకి వెళ్లిపోయాడు. 5 గంటల పాటు విచారణ: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్‌ను ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్ ఏమాత్రం సహకరించలేదని, పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు అడ్డదిడ్డమైన సమాధానాలతో పాటు అప్పుడు తాను లేనని, తనకు గుర్తు లేదని, తన లాయర్లు సమాధానం చెబుతారంటూ దాటవేసే విధంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.
మరోసారి హాజరు కావాలని నోటీస్: బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌కు నోటీస్ ఇచ్చినట్టు సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. తాము అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్ సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. విచారణ అనంతరం రవిప్రకాశ్ మాట్లాడారు. ‘‘టీవీ9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుకున్నారు. నాపై దొంగ కేసులు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని నన్ను అక్రమంగా టీవీ9 నుంచి బయటికి పంపించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్న. ఇది మాఫియాకు, మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధం. ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుంది’’అని పేర్కొన్నారు.
నమోదైన కేసులివే: శొంఠినేని శివాజీతో కలిసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీ పత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్‌పై అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్ట్, 66, 72 ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. మరో కేసులో రవిప్రకాశ్‌తోపాటు ఎంకేవీఎన్ మూర్తిపైనా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మే 9వ తేదీన టీవీ9 కార్యాలయంతోపాటు, బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ నివాసం, హిమాయత్‌నగర్‌లోని శివాజీ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.
పలు కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సమాచారం చెరిపివేసినా.. పోలీసులు తిరిగి సంగ్రహించగలిగారు. ఇదే క్రమంలో రవిప్రకాశ్‌పై మే 16వ తేదీన టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్కులు 2018 మేలో మీడియా నెక్టŠస్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120(బీ)సెక్షన్ల కింద హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. తర్వాత ఆయా కేసుల్లో విచారణకు హాజరుకావాలని సీఆర్‌పీసీ 160 కింద పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. మరో రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ కింద అతని ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. రవిప్రకాశ్ దేశం దాటకుండా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో లుక్‌ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు.
గత్యంతరం లేకనే వచ్చాడు: పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా రవిప్రకాశ్ అందుబాటులోకి రాలేదు. అతను ఏపీలో తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. ఏపీలో అతడికి మద్దతిచ్చే రాజకీయ నాయకులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. దీనికితోడు రెండుసార్లు, హైకోర్టు లో.. ఆఖరుగా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌కు విశ్వప్రయత్నాలు చేశాడు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనట్లు తెలుస్తోంది. మరో నిందితుడైన శివాజీ రేపోమాపో బయటకు వస్తాడని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment