శ్రీగౌతమి హత్య కేసు నిందితులను కోర్టుకు తీసుకెళుతున్న సీఐ కె.రజనీకుమార్ (ఫైల్)
పశ్చిమగోదావరి , నరసాపురం: సంచలనం కలిగించిన శ్రీగౌతమి హత్యకేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును రెండో దఫా దర్యాప్తు సాగిస్తున్న పాలకొల్లు రూరల్ సీఐ కె.రజనీకుమార్‌ను వీఆర్‌కు పంపుతూ శుక్రవారం రాత్రి ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులిచ్చారు. శ్రీగౌతమి కేసును సీబీసీఐడీ దర్యాప్తు అనంతరం హత్యకేసుగా మార్పుచేసి రజనీకుమార్ చురుగ్గా వ్యవహరించారు. కేసులో నిందితులను వారం రోజుల్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులో ఇంకా అనేకమంది వ్యక్తులు, అనేక కోణాలు దాగి ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ దశలో రజనీకుమార్ బదిలీ చర్చనీయాంశమైంది. సాధారణ బదిలీల్లో భాగంగానే ఇది జరిగిందని పోలీస్ శాఖ సమర్థించుకుంటున్నా.. కీలక కేసు దర్యాప్తు సాగిస్తున్న అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌కు పంపడం పనిష్‌మెంటేననే భావన పోలీస్‌వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టీడీపీ నేతల అరెస్ట్‌కేనా ఈ శిక్ష
శ్రీగౌతమి హత్యకేసులో టీడీపీ నేతలు ముగ్గురు అరెస్ట్ జరిగింది. ప్రధాన నిందితుడు సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌లతో పాటు ఏకంగా నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌ను కూడా రజనీకుమార్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అరెస్ట్‌తోనే రజనీకుమార్‌ను వీఆర్‌కు పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కేసులో మొదట దర్యాప్తు సాగించిన పోలీసు అధికారులపై శాఖా పరంగా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసులో ప్రధాన నిందితులు టీడీపీ నాయకులే కాకుండా స్వయంగా సీఎం సామాజిక వర్గానికి చెందినవారు కావడం, అప్పుడు దర్యాప్తు సాగించిన పోలీస్ అధికారులు కూడా ఇదే సామాజికవర్గానికి వారు కావడంతో కేసు నీరుగారుతుందనే ప్రచారం సాగింది. కేసును తప్పుదారి పట్టించడంలో సీఎం తనయుడు లోకేష్ పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి పోలీస్ అధికారులు మాత్రం కేవలం 15 రోజుల్లోనే శ్రీగౌతమిది యాక్సిడెంట్ అని తేల్చి ఫైల్ క్లోజ్ చేశారు. శ్రీగౌతమి సోదరి పావని ఎంత పోరాటం చేసినా దర్యాప్తులో అప్పటి పోలీసులు ఎలాంటి ముందడుగు వేయలేదు. చివరకు సీబీసీఐడీ దర్యాప్తులో హత్యగా తేలడం తరువాత రజనీకుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగడం, నిందితులు జైలుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment