Sri Gowthami
-
శ్రీగౌతమి హత్య కేసులో వీఆర్‌కు సీఐ
పశ్చిమగోదావరి , నరసాపురం: సంచలనం కలిగించిన శ్రీగౌతమి హత్యకేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును రెండో దఫా దర్యాప్తు సాగిస్తున్న పాలకొల్లు రూరల్ సీఐ కె.రజనీకుమార్‌ను వీఆర్‌కు పంపుతూ శుక్రవారం రాత్రి ఏలూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులిచ్చారు. శ్రీగౌతమి కేసును సీబీసీఐడీ దర్యాప్తు అనంతరం హత్యకేసుగా మార్పుచేసి రజనీకుమార్ చురుగ్గా వ్యవహరించారు. కేసులో నిందితులను వారం రోజుల్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. కేసులో ఇంకా అనేకమంది వ్యక్తులు, అనేక కోణాలు దాగి ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ దశలో రజనీకుమార్ బదిలీ చర్చనీయాంశమైంది. సాధారణ బదిలీల్లో భాగంగానే ఇది జరిగిందని పోలీస్ శాఖ సమర్థించుకుంటున్నా.. కీలక కేసు దర్యాప్తు సాగిస్తున్న అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్‌కు పంపడం పనిష్మెంటేననే భావన పోలీస్‌వర్గాల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ నేతల అరెస్ట్కేనా ఈ శిక్ష శ్రీగౌతమి హత్యకేసులో టీడీపీ నేతలు ముగ్గురు అరెస్ట్ జరిగింది. ప్రధాన నిందితుడు సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌లతో పాటు ఏకంగా నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌ను కూడా రజనీకుమార్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అరెస్ట్‌తోనే రజనీకుమార్‌ను వీఆర్‌కు పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ కేసులో మొదట దర్యాప్తు సాగించిన పోలీసు అధికారులపై శాఖా పరంగా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసులో ప్రధాన నిందితులు టీడీపీ నాయకులే కాకుండా స్వయంగా సీఎం సామాజిక వర్గానికి చెందినవారు కావడం, అప్పుడు దర్యాప్తు సాగించిన పోలీస్ అధికారులు కూడా ఇదే సామాజికవర్గానికి వారు కావడంతో కేసు నీరుగారుతుందనే ప్రచారం సాగింది. కేసును తప్పుదారి పట్టించడంలో సీఎం తనయుడు లోకేష్ పాత్రపైనా ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పటి పోలీస్ అధికారులు మాత్రం కేవలం 15 రోజుల్లోనే శ్రీగౌతమిది యాక్సిడెంట్ అని తేల్చి ఫైల్ క్లోజ్ చేశారు. శ్రీగౌతమి సోదరి పావని ఎంత పోరాటం చేసినా దర్యాప్తులో అప్పటి పోలీసులు ఎలాంటి ముందడుగు వేయలేదు. చివరకు సీబీసీఐడీ దర్యాప్తులో హత్యగా తేలడం తరువాత రజనీకుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగడం, నిందితులు జైలుకెళ్లారు. -
‘పోలీసులైనా, ప్రజలైనా చర్యలు తప్పవు’
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో పూర్తి స్థాయి విచారణ చేయిస్తామని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. అదే సమయంలో చింతలపూడి వసతి గృహం బాలిక అత్యాచారం కేసులో కూడా విచారణ చేపడతామన్నారు. ఈ కేసుల్లో పోలీసుల తప్పు ఉందని తేలితే ఎలాంటివారినైనా ఉపేక్షించమని ఠాకూర్ తెలిపారు. అసలు పోలీసులు పని చేసేది ప్రజల కోసమేనని, రౌడీయిజం, రోడ్డు ప్రమాదాలు, నేర నిరోధకంపై జిల్లా యంత్రాంగానికి సూచనలిచ్చామన్నారు. శుక్రవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ.. పశ్చిమలో జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ పనితీరు బాగానే ఉందని కితాబిచ్చారు. నూతన టెక్నాలజీతో మరింత వేగంగా ప్రజలకు సేవలందించాలని ఆయన సూచించారు. అమరావతిలో ఫోరెన్సిక్ ల్యాబ్, ఫోరెన్సిక్ యూనివర్శిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లాల వారీగా ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుపై ఆలోచిస్తున్నామన్న డీజీపీ.. పెరుగుతున్న సైబర్ క్రైమ్‌లు నిరోధించేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ నివారణకు ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బంది సంతృప్తిగా ఉంటేనే పోలీసు శాఖలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లా రావూరుపాడు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటన చాలా విచారకరమన్న డీజీపీ ఠాకూర్.. తప్పు ఎవరిదైనా లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని, అది ప్రజలైనా, పోలీసులైనా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
శ్రీగౌతమి హత్య కేసు.. ఇప్పటివరకు ఏడుగురు అరెస్ట్
-
శ్రీగౌతమి హత్య కేసు.. ప్రధాన నిందితులు అరెస్టు
సాక్షి, పాలకొల్లు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీ గౌతమి హత్య కేసులో అసలు రహస్యం బట్టబయలైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దరిని పాలకొల్లు పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితులైన సందీప్, దుర్గాప్రసాద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని పట్టుకున్నారు. వీరిద్దరిని విశాఖపట్నంలో అరెస్టు చేసినట్లు పాలకొల్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొదట ఎనిమిది మంది నిందితులకు సంబందమున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో బెయిల్‌పై బయట తిరుగుతున్న నిందితులు సందీప్, దుర్గాప్రసాద్‌లు టాటా సఫారీతో శ్రీగౌతమిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చిన విదితమే. దీంతో వారిద్దరి బెయిల్ రద్దు చేసి అరెస్ట్‌కు అవకాశం ఇవ్వాలని పాలకొల్లు పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో రోడ్డు ప్రమాదంగా చూపి ఈ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సీఐడీ దర్యాప్తుతో గౌతమి హత్యకేసు వెలుగులోకి రావడవంతో కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. 302, 307 సెక్షన్లుగా కేసు మార్పు చేసిన విషయం తెలిసిందే. -
శ్రీగౌతమి హత్యకు డీల్ రూ.లక్షల్లో..?
నరసాపురం : శ్రీగౌతమి మృతి ప్రమాదవశాత్తు జరిగింది కాదని తేలిపోయింది. పథకం పన్ని కిరాయి హత్య చేయించారని సీఐసీఐడీ నిగ్గుతేల్చింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు కీలక నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. పైగా వారు టీడీపీకి చెందిన బడా వ్యక్తులు. సాక్షాత్తు జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ కూడా ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ హత్యలో అనేక అంశాలపై చర్చసాగుతోంది. సీబీసీఐడీ చొరవతో మత్తు వదిలిన జిల్లా పోలీసులు కేసును పునఃప్రారంభించి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయిందని చెప్పారు. పోలీసులు చెప్పినట్టుగానే ఇంకా అనేక అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హత్యకు కిరాయి ఎంతకు మాట్లాడుకున్నారనేది ఇంకా వెలుగులోకి రాలేదు. పోలీసులు కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే సీఐడీ అధికారుల వద్ద కొంత సమాచారం ఉన్నప్పటికీ, ఎంత కిరాయి అనే అంశంపై పూర్తి వివరాలు లభ్యంకాలేదని తెలిసింది. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లను హత్యకు పురమాయించారు. వారికి యాక్సిడెంట్ చేసే నిమిత్తం ముందుగా రూ 1.70 లక్షలు ఇచ్చారు. మళ్లీ వారు యాక్సిడెంట్ చేసే సమయానికి రూ 50 వేలకు కారు తాకట్టుపెడితే, మళ్లీ జడ్పీటీసీ బాలం ప్రతాప్, అతని సోదరుడు ఆండ్రూలు వైజాగ్ వెళ్లి కారును విడిపించారు. దీనికి కూడా సజ్జా బుజ్జి బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము ముట్టచెప్పాడు. ఇది ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా పోలీసులు చెప్పిన విషయం. అసలు ఈ హత్య చేయడానికి ఎంత మేరకు బేరం కుదుర్చుకున్నారనేది తెలియాల్సి ఉంది. ముందు యాక్సిడెంట్ కేసులో అరెస్టై తరువాత బెయిల్‌పై వచ్చిన కిరాయి హంతకులు పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు కేసు తిరగతోడిన తరువాత పరారీలో ఉన్నారు. వారు దొరికితేనే కానీ అసలు ఈ హత్యకు బేరం ఎన్ని లక్షల్లో కుదిరిందనేది తెలియదు. అయితే రూ 50 లక్షలు వరకూ బేరం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెర వెనుక సూత్రధారులు బయటకు వస్తారా? శ్రీగౌతమి హత్య అనంతరం సజ్జా బుజ్జి అండ్‌కోను తప్పించడానికి శతవిధాలా ప్రయత్నించి, తొలి ప్రయత్నంలో కేసును యాక్సిడెంట్‌గా 15 రోజుల్లోనే మాఫీ చేయించి సత్తా చూపించిన తెర వెనుక సూత్రధారులు ఇప్పుడైనా బయటకు వస్తారా? అనే అంశంలో జోరుగా చర్చసాగుతోంది. బుజ్జి సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు బడా వ్యక్తులు స్థానికంగా ఉంటూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతూ ఉంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు పైరవీలు ఏ కోణంలో చేస్తున్నారనే దానిపై కూడా చర్చసాగుతోంది. అసలు సీబీసీఐడీనే కేసును పూర్తిగా చివరి వరకూ దర్యాప్తు చేస్తేనే తెరవెనుక సూత్రధారులు బయటకు వస్తారనే చర్చ సాగుతోంది. ఇంకో వైపు కేసును నీరుగార్చిన పోలీసులపై ఆశాఖ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. నిందితులకు ఇంకా అందలం ఇస్తున్న టీడీపీ ఇదిలా ఉంటే కేసులో ఉన్న నిందితులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన టీడీపీ వెనుక మాత్రం వారికి ఇంకా సహకారం ఇస్తోంది. సజ్జా బుజ్జి అండ్‌కో ప్రస్తుతం నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్నారు. అయితే వారిని పరామర్శించడానికి టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. పరామర్శలకు వెళ్లే వారిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉండటం విశేషం. ఇక హత్యకేసులో ఏ–3 నిందితుడుగా ఉన్న నరసాపురం జడ్పీటీసీ సభ్యుడుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసింది. జూలై 2వ తేదీన జరగనున్న నరసాపురం అగ్రికల్చర్ మార్కెట్‌యార్డ్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో గౌరవ అతిథిగా స్థానం కల్పించింది. ఆయనను గౌరవ అతిథిగా ఉన్న ఆహ్వాన పత్రికలను శుక్రవారం పార్టీ నేతలు పంచారు. ఏకంగా ఓ యువతి కిరాయి హత్యకేసులో ఉన్న రిమాండ్ ఖైదీకి పార్టీలో పెద్దపీట వేయడం చర్చనీయాంశమయ్యింది. పోనీ ముందుగా ఆహ్వాన పత్రికలు ముద్రించి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూడా వీలులేదు. ఎందుకంటే ఇప్పటికే వారు రిమాండ్‌కు వెళ్లి 5 రోజులు అవుతుంది. ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసి పంచడానికి కూడా సమయం ఉన్నందున అలా చేయలేదంటే పార్టీ అండ నిందితులకు ఉందని స్పష్టమవుతోంది. టీడీపీ అధికార అండ చూసుకునే అసాంఘిక వాదులు పేట్రేగిపోతున్నారనే విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతదానికి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు బిల్డప్ రాజకీయాలు చేయడం ఏమిటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి కేసును నీరుగార్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వారు నన్ను దారుణంగా మాట్లాడేవారు. నాపైనే కేసులు కడతామని అనేవారు. కానీ నేను నా పోరాటాన్ని ఆపలేదు. సీబీసీఐడీ వల్ల నాకు న్యాయం జరిగింది. అప్పుడు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటే మాకు నమ్మకం కలుగుతుంది. – దంగేటి పావని, గౌతమి చెల్లి -
శ్రీగౌతమిది రోడ్డు ప్రమాదమే, కాదు.. హత్యే
నరసాపురం : ‘మా అక్కది ముమ్మాటికీ హత్యే. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని కుటుంబ సభ్యులు పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నేను ఎంత చెప్పినా.. పట్టించుకోకుండా పోలీసులు రోడ్డు ప్రమాదమని కేసు మూసేశారు’ అని శ్రీ గౌతమి చెల్లెలు దంగేటి పావని ఆరోపించింది. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలకు రక్షణలేకుండా పోయిందని ఆక్రోశించింది. (శ్రీ గౌతమిది రోడ్డు ప్రమాదమే) తన అక్క కేసులో అన్ని వివరాలూ పోలీసులకు చెప్పానని, తన అక్క హత్యలో టీడీపీ నేత సజ్జాబుజ్జి, అతని భార్య శిరీష, అతని అనుచరుడు బొల్లంపల్లి రమేష్, కారు డ్రైవర్ రాంబాబు పాత్ర ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా అధికారపార్టీకి దాసోహమయ్యారని తీవ్రంగా విమర్శించింది. ఎఫ్ఐఆర్లో తన స్టేట్మెంట్ కాపీని కూడా మార్చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. స్టేట్మెంట్ కాపీపై తన సోదరుడు పెట్టిన సాక్షి సంతకం లేదని, అసలు తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆరోపించింది. నా ఇంటి చుట్టూ పోలీసుల నిఘా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఘటన తర్వాత ఘాతుకానికి పాల్పడిన బుజ్జి కుటుంబం హాయిగా ఉందని, అధికార పార్టీ నాయకుడు, డబ్బున్నవాడు కావడం వల్లే అతని పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పావని మండిపడింది. అదే సామాన్యుడైతే ఈ పాటికే అరెస్ట్ చేసేవారు కాదా? అని ప్రశ్నించింది. ఎవర్నో తీసుకొచ్చి ఈ కేసులో నిందితులుగా చూపించారని, వారిపై ఈవ్‌టీజింగ్ కేసు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మరోమారు పాలకొల్లు రూరల్ స్టేషన్లో కేసు పెట్టామని పేర్కొంది. శనివారం తన తల్లి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు తీసుకోలేదని, తర్వాత విలేకరుల సాయం అడిగితే అప్పుడు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేసింది. లేకుంటే పాలకొల్లు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించింది. పోరాటంలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనని స్పష్టం చేసింది. నీచ ప్రచారంపై ఆగ్రహం కొందరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, రూ.30 లక్షలకు కేసు రాజీ అయిపోయిందంటూ నీచ ప్రచారం చేస్తున్నారని పావని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళన సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్ మాట్లాడుతూ శ్రీగౌతమి కేసుపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ మాట్లాడుతూ మన దేశంలో బహుభార్యత్వం లేదు కదా, మరి బుజ్జి శ్రీగౌతమిని మభ్యపెట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటే, ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారపార్టీ వారికి ఏమైనా వెలుసుబాటు ఇచ్చారేమో అని ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్ మాట్లాడుతూ ఇంత ఘోరం జరిగినా జిల్లాలో మంత్రులు నోరు మెదపకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. తల్లి తల్లడిల్లింది విలేకరుల సమావేశంలో శ్రీగౌతమి తల్లి అనంతలక్ష్మి కన్నీరుమున్నీరైంది. కర్కోటకంగా తన కూతురి ప్రాణాలు తీశారని తల్లడిల్లింది. సమాజంలో ఆడపిల్లకు రక్షణ లేదని, అందుకే కాబోలు కొందరు ఆడపిల్లలను పురిటిలోనే చంపేసుకుంటున్నారని విలపించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. పెద్ద కూతురు పోయింది. రెండో కూతరు భవిష్యత్ ఏమిటో అర్ధంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. -
శ్రీగౌతమిది ముమ్మాటికీ హత్యే
మృతురాలి తల్లి అనంతలక్ష్మి ∙దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు పాలకొల్లు టౌన్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు సమీపంలో ఈ నెల 18న మరణించిన శ్రీగౌతమిది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి దంగేటి అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని శనివారం రాత్రి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు యథాతథంగా.. నా రెండో కుమార్తె పావని నరసాపురంలోని దత్తగణపతి ఫీడ్స్ షాపులో పనిచేస్తున్న సమయంలో నరసాపురానికి చెందిన సజ్జా బుజ్జి రొయ్యల మేత కొనుగోలుకు తరచూ అక్కడకు వచ్చేవాడు. పావనితో పరిచయం ఉన్న అతను తర్వాత నా పెద్ద కూతురు శ్రీగౌతమిని పరిచయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమి వాళ్ల నాన్న మరణించడంతో బుజ్జి ఆమెను ఓదారుస్తున్నట్టు నటించి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. ఇంతకు ముందే బుజ్జికి పెళ్లి కావడంతో గౌతమి దీనికి నిరాకరించింది. దీంతో బుజ్జి తన భార్య శిరీషకు, తనకు గొడవలు ఉన్నాయని, ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నట్టు నమ్మించాడు. ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బుజ్జి మొదటి భార్య శిరీష, బుజ్జి కారు డ్రైవర్ రాంబాబు, అతని అనుచరుడు బొల్లెంపల్లి రమేష్‌తో తరచూ బెదిరింపులకు పాల్పడేవారు. ఆ తర్వాత గౌతమి సివిల్ కోచింగ్‌కు విశాఖకు వెళ్లింది. దీంతో బుజ్జి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెతో సరిగ్గా మాట్లాడకపోవడం, ముఖం చాటేయడం చేశాడు. సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన గౌతమి కదలికలను శిరీష, రాంబాబు, రమేష్ గమనించారు. ఈ నెల 17న గౌతమి ఆరోగ్యం బాగోకపోవడంతో చెల్లెలు పావనీతో కలిసి నరసాపురం రాయపేటలో ఉన్న బుజ్జి వద్దకు వెళ్లి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరింది. అయితే బుజ్జి అతనితోపాటు అక్కడే ఉన్న అతని అనుచరుడు రమేష్ ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దీంతో గౌతమి, పావని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత రమేష్ తరచూ గౌతమికి ఫోన్ చేసి ఆస్పత్రికి వెళ్లారా.. ఎన్నిగంటలకు వెళ్తున్నారని ఆరా తీసేవాడు. ఈ నేపథ్యంలోనే 18న గౌతమి, పావని ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రమాదానికి గురయ్యారు. గౌతమి అక్కడికక్కడే మరణించింది. గౌతమిని పథకం ప్రకారమే బుజ్జి భార్య శిరీష, అతని అనుచరుడు రమేష్, కారు డ్రైవర్ రాంబాబు కలిసి హత్య చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలి. అందుబాటులో లేని సీఐ, ఎస్సై ఫిర్యాదు చేసేందుకు గౌతమి తల్లి అనంతలక్ష్మి వచ్చిన సమయంలో సీఐ ఎ.చంద్రశేఖర్, ఎస్సై ఆదిప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో ఆమె హెడ్ కానిస్టేబుల్ కె.యెహెజ్కెలుకు ఫిర్యాదు అందజేసి రశీదు తీసుకున్నారు. ఆమె వెంట ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, పాలకొల్లు డివిజన్ ఉపాధ్యక్షుడు జి.యుగంధర్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే దీనిపై మానవహక్కుల కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు. ఈ కేసును తక్షణం ప్రభుత్వం సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.