నరసాపురం : శ్రీగౌతమి మృతి ప్రమాదవశాత్తు జరిగింది కాదని తేలిపోయింది. పథకం పన్ని కిరాయి హత్య చేయించారని సీఐసీఐడీ నిగ్గుతేల్చింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు కీలక నిందితులు రిమాండ్‌లో ఉన్నారు. పైగా వారు టీడీపీకి చెందిన బడా వ్యక్తులు. సాక్షాత్తు జడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ కూడా ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ హత్యలో అనేక అంశాలపై చర్చసాగుతోంది. సీబీసీఐడీ చొరవతో మత్తు వదిలిన జిల్లా పోలీసులు కేసును పునఃప్రారంభించి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచే సమయంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయిందని చెప్పారు.
పోలీసులు చెప్పినట్టుగానే ఇంకా అనేక అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హత్యకు కిరాయి ఎంతకు మాట్లాడుకున్నారనేది ఇంకా వెలుగులోకి రాలేదు. పోలీసులు కూడా ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే సీఐడీ అధికారుల వద్ద కొంత సమాచారం ఉన్నప్పటికీ, ఎంత కిరాయి అనే అంశంపై పూర్తి వివరాలు లభ్యంకాలేదని తెలిసింది. విశాఖపట్టణంకు చెందిన పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లను హత్యకు పురమాయించారు. వారికి యాక్సిడెంట్ చేసే నిమిత్తం ముందుగా రూ 1.70 లక్షలు ఇచ్చారు. మళ్లీ వారు యాక్సిడెంట్ చేసే సమయానికి రూ 50 వేలకు కారు తాకట్టుపెడితే, మళ్లీ జడ్పీటీసీ బాలం ప్రతాప్, అతని సోదరుడు ఆండ్రూలు వైజాగ్ వెళ్లి కారును విడిపించారు. దీనికి కూడా సజ్జా బుజ్జి బ్యాంకు ఖాతా ద్వారా సొమ్ము ముట్టచెప్పాడు.
ఇది ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా పోలీసులు చెప్పిన విషయం. అసలు ఈ హత్య చేయడానికి ఎంత మేరకు బేరం కుదుర్చుకున్నారనేది తెలియాల్సి ఉంది. ముందు యాక్సిడెంట్ కేసులో అరెస్టై తరువాత బెయిల్‌పై వచ్చిన కిరాయి హంతకులు పాకాల సందీప్, కడియం దుర్గాప్రసాద్‌లు కేసు తిరగతోడిన తరువాత పరారీలో ఉన్నారు. వారు దొరికితేనే కానీ అసలు ఈ హత్యకు బేరం ఎన్ని లక్షల్లో కుదిరిందనేది తెలియదు. అయితే రూ 50 లక్షలు వరకూ బేరం కుదిరిందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెర వెనుక సూత్రధారులు బయటకు వస్తారా?
శ్రీగౌతమి హత్య అనంతరం సజ్జా బుజ్జి అండ్‌కోను తప్పించడానికి శతవిధాలా ప్రయత్నించి, తొలి ప్రయత్నంలో కేసును యాక్సిడెంట్‌గా 15 రోజుల్లోనే మాఫీ చేయించి సత్తా చూపించిన తెర వెనుక సూత్రధారులు ఇప్పుడైనా బయటకు వస్తారా? అనే అంశంలో జోరుగా చర్చసాగుతోంది. బుజ్జి సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు బడా వ్యక్తులు స్థానికంగా ఉంటూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పుతూ ఉంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు పైరవీలు ఏ కోణంలో చేస్తున్నారనే దానిపై కూడా చర్చసాగుతోంది. అసలు సీబీసీఐడీనే కేసును పూర్తిగా చివరి వరకూ దర్యాప్తు చేస్తేనే తెరవెనుక సూత్రధారులు బయటకు వస్తారనే చర్చ సాగుతోంది. ఇంకో వైపు కేసును నీరుగార్చిన పోలీసులపై ఆశాఖ ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది.
నిందితులకు ఇంకా అందలం ఇస్తున్న టీడీపీ
ఇదిలా ఉంటే కేసులో ఉన్న నిందితులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన టీడీపీ వెనుక మాత్రం వారికి ఇంకా సహకారం ఇస్తోంది. సజ్జా బుజ్జి అండ్‌కో ప్రస్తుతం నరసాపురం సబ్‌జైలులో రిమాండ్ అనుభవిస్తున్నారు. అయితే వారిని పరామర్శించడానికి టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. పరామర్శలకు వెళ్లే వారిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉండటం విశేషం. ఇక హత్యకేసులో ఏ–3 నిందితుడుగా ఉన్న నరసాపురం జడ్పీటీసీ సభ్యుడుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసింది.
జూలై 2వ తేదీన జరగనున్న నరసాపురం అగ్రికల్చర్ మార్కెట్‌యార్డ్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో గౌరవ అతిథిగా స్థానం కల్పించింది. ఆయనను గౌరవ అతిథిగా ఉన్న ఆహ్వాన పత్రికలను శుక్రవారం పార్టీ నేతలు పంచారు. ఏకంగా ఓ యువతి కిరాయి హత్యకేసులో ఉన్న రిమాండ్ ఖైదీకి పార్టీలో పెద్దపీట వేయడం చర్చనీయాంశమయ్యింది. పోనీ ముందుగా ఆహ్వాన పత్రికలు ముద్రించి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూడా వీలులేదు. ఎందుకంటే ఇప్పటికే వారు రిమాండ్‌కు వెళ్లి 5 రోజులు అవుతుంది.
ఆహ్వాన పత్రికల్లో మార్పులు చేసి పంచడానికి కూడా సమయం ఉన్నందున అలా చేయలేదంటే పార్టీ అండ నిందితులకు ఉందని స్పష్టమవుతోంది. టీడీపీ అధికార అండ చూసుకునే అసాంఘిక వాదులు పేట్రేగిపోతున్నారనే విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇంతదానికి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు బిల్డప్ రాజకీయాలు చేయడం ఏమిటని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
కేసును నీరుగార్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. వారు నన్ను దారుణంగా మాట్లాడేవారు. నాపైనే కేసులు కడతామని అనేవారు. కానీ నేను నా పోరాటాన్ని ఆపలేదు. సీబీసీఐడీ వల్ల నాకు న్యాయం జరిగింది. అప్పుడు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటే మాకు నమ్మకం కలుగుతుంది.
– దంగేటి పావని, గౌతమి చెల్లి
Comments
Please login to add a commentAdd a comment