రాజకీయ ఆధిపత్యంలో భాగంగానే ఆ పార్టీ నేత శ్రీనివాసులు హత్య
కేసులో ప్రధాన నిందితుడు నరసింహులు హోసూర్‌లో అదే పార్టీ నేత
ఆధిపత్యం కోసం సహచర నేతను హత్యచేసిన మరో నేత
వైఎస్సార్‌సీపీపై బురద జల్లాలనుకున్న లోకేశ్ ఇప్పుడేమంటావ్?
సాక్షి ప్రతినిధి కర్నూలు: పత్తికొండ నియోజకవర్గం హోసూర్‌లో ఇటీవల హత్యకు గురైన టీడీపీ నేత వాకిటి శ్రీనివాసులు కేసును పోలీసులు ఛేదించారు. శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత గుడిసె నరసింహులు హత్య చేయించాడని తేల్చారు. పత్తికొండ టీడీపీలో ఆధిపత్య పోరులో భాగంగానే టీడీపీ నేతను, అదే పార్టీకి చెందిన మరో నేత హత్య చేయించినట్లు తేలింది.
ఈ హత్య జరిగిన రోజు వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్సార్‌సీపీ హత్య చేయించిందనేలా పార్టీపె, మాజీ సీఎం వైఎస్ జగన్‌పైనా మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు వాస్తవాలు బట్టబయలు కావడంతో లోకేశ్ నవ్వులు పాలుకావడంతో పాటు వైఎస్సార్‌సీపీపై ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడతారని.. వైఎస్సార్‌సీపీ, జగన్‌పై అదేపనిగా బురదజల్లుతున్నారని స్పష్టమైంది.
అడ్డు తొలగించుకునేందుకే స్కెచ్..
హోసూర్‌లో వాకిటి శ్రీనివాసులు టీడీపీ నేత. గుడిసె నరసింహులు సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరైన తర్వాత టీడీపీలో చేరి నాయకునిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాసులును పత్తికొండ సహకార సంఘం అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే శ్యాంబాబు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో రాజకీయంగా తన భవిష్యత్తు ఏంటో చెప్పాలని శ్యాంబాబును నరసింహులు అడిగినట్లు తెలుస్తోంది. హోసూర్‌లోనే ఇద్దరూ ఉంటే భవిష్యత్‌లో గొడవలు ఉంటాయని, పత్తికొండలో కాపురం పెడితే అక్కడ ఓ వార్డు బాధ్యతలు అప్పగిస్తానని నరసింహులుకు శ్యాంబాబు చెప్పినట్లు తెలిసింది.
దీంతో.. రాజకీయంగా శ్రీనివాసులు ఎదగడంతో పాటు తాను ఊరు వదిలే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించిన నరసింహులు.. ఈనెల 14న శ్రీనివాసులును హత్య చేయించారు. ఇక శ్రీనివాసులును వడ్డే కాశీనాథ్, ఎరుకల వంశీ అనే ఇద్దరు బాలనేరస్తులు హత్యచేసినట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు. వీరితో పాటు రామాంజనేయులు, హరికృష్ణ, వడ్డే నరసింహులును కూడా కేసులో చేర్చారు.
ఇప్పుడేమంటావ్ లోకేశ్?
హత్య జరిగిన ఉదయం ‘పచ్చ’ ఛానెళ్లు వైఎస్సార్‌సీపీ నేతలే టీడీపీ నేతను హత్యచేశారని ఊదరగొట్టాయి. వైఎస్సార్‌సీపీపై కావాలనే లోకేశ్ దుష్ప్రచారంతో ట్వీట్ కూడా చేసేశారు. ‘ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా! ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా దురాగతాలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ చూసి హోంమంత్రి అనిత, మరో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి కూడా వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేశారు. ఈ హత్యకు రాజకీయరంగు పులిమి వైఎస్సార్‌సీపీపై మోపే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసు విచారణలో వాస్తవాలు బయటపడడంతో ఈ హత్య విషయంలో వైఎస్సార్‌సీపీ, జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు మంత్రి లోకేశ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో!?
Comments
Please login to add a commentAdd a comment