శ్రీగౌతమిది రోడ్డు ప్రమాదమే, కాదు.. హత్యే
గౌతమిది రోడ్డు ప్రమాదమే, కాదు.. ముమ్మాటికీ హత్యే
Published Mon, Jan 30 2017 9:11 AM | Last Updated on Tue, Nov 6 2018 4:10 PM
నరసాపురం : ‘మా అక్కది ముమ్మాటికీ హత్యే. టీడీపీ నేత సజ్జా బుజ్జి, అతని కుటుంబ సభ్యులు పథకం ప్రకారమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నేను ఎంత చెప్పినా.. పట్టించుకోకుండా పోలీసులు రోడ్డు ప్రమాదమని కేసు మూసేశారు’ అని శ్రీ గౌతమి చెల్లెలు దంగేటి పావని ఆరోపించింది. ఆదివారం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మాయిలకు రక్షణలేకుండా పోయిందని ఆక్రోశించింది.
తన అక్క కేసులో అన్ని వివరాలూ పోలీసులకు చెప్పానని, తన అక్క హత్యలో టీడీపీ నేత సజ్జాబుజ్జి, అతని భార్య శిరీష, అతని అనుచరుడు బొల్లంపల్లి రమేష్, కారు డ్రైవర్ రాంబాబు పాత్ర ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా అధికారపార్టీకి దాసోహమయ్యారని తీవ్రంగా విమర్శించింది. ఎఫ్‌ఐఆర్‌లో తన స్టేట్‌మెంట్ కాపీని కూడా మార్చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది. స్టేట్‌మెంట్ కాపీపై తన సోదరుడు పెట్టిన సాక్షి సంతకం లేదని, అసలు తన సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారని ఆరోపించింది. నా ఇంటి చుట్టూ పోలీసుల నిఘా ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. ఘటన తర్వాత ఘాతుకానికి పాల్పడిన బుజ్జి కుటుంబం హాయిగా ఉందని, అధికార పార్టీ నాయకుడు, డబ్బున్నవాడు కావడం వల్లే అతని పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పావని మండిపడింది. అదే సామాన్యుడైతే ఈ పాటికే అరెస్ట్ చేసేవారు కాదా? అని ప్రశ్నించింది.
ఎవర్నో తీసుకొచ్చి ఈ కేసులో నిందితులుగా చూపించారని, వారిపై ఈవ్‌టీజింగ్ కేసు కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే మరోమారు పాలకొల్లు రూరల్ స్టేషన్‌లో కేసు పెట్టామని పేర్కొంది. శనివారం తన తల్లి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే పోలీసులు తీసుకోలేదని, తర్వాత విలేకరుల సాయం అడిగితే అప్పుడు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులపై తమకు నమ్మకం పోయిందని, కేసును సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేసింది. లేకుంటే పాలకొల్లు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించింది. పోరాటంలో తన ప్రాణాలు పోయినా లెక్కచేయనని స్పష్టం చేసింది.
నీచ ప్రచారంపై ఆగ్రహం
కొందరు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్, రూ.30 లక్షలకు కేసు రాజీ అయిపోయిందంటూ నీచ ప్రచారం చేస్తున్నారని పావని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించింది.
రాష్ట్ర వ్యాప్త ఆందోళన
సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమర్జహాబేగ్ మాట్లాడుతూ శ్రీగౌతమి కేసుపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఐద్వా డివిజన్ కార్యదర్శి పి.పూర్ణ మాట్లాడుతూ మన దేశంలో బహుభార్యత్వం లేదు కదా, మరి బుజ్జి శ్రీగౌతమిని మభ్యపెట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటే, ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అధికారపార్టీ వారికి ఏమైనా వెలుసుబాటు ఇచ్చారేమో అని ఎద్దేవా చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్ మాట్లాడుతూ ఇంత ఘోరం జరిగినా జిల్లాలో మంత్రులు నోరు మెదపకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
తల్లి తల్లడిల్లింది
విలేకరుల సమావేశంలో శ్రీగౌతమి తల్లి అనంతలక్ష్మి కన్నీరుమున్నీరైంది. కర్కోటకంగా తన కూతురి ప్రాణాలు తీశారని తల్లడిల్లింది. సమాజంలో ఆడపిల్లకు రక్షణ లేదని, అందుకే కాబోలు కొందరు ఆడపిల్లలను పురిటిలోనే చంపేసుకుంటున్నారని విలపించింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. పెద్ద కూతురు పోయింది. రెండో కూతరు భవిష్యత్ ఏమిటో అర్ధంకావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement