శ్రీగౌతమిది ముమ్మాటికీ హత్యే
మృతురాలి తల్లి అనంతలక్ష్మి ∙దర్యాప్తు చేయాలని పోలీసులకు ఫిర్యాదు
పాలకొల్లు టౌన్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో దిగమర్రు సమీపంలో ఈ నెల 18న మరణించిన శ్రీగౌతమిది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి దంగేటి అనంతలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని శనివారం రాత్రి పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాలు యథాతథంగా..
నా రెండో కుమార్తె పావని నరసాపురంలోని దత్తగణపతి ఫీడ్స్ షాపులో పనిచేస్తున్న సమయంలో నరసాపురానికి చెందిన సజ్జా బుజ్జి రొయ్యల మేత కొనుగోలుకు తరచూ అక్కడకు వచ్చేవాడు. పావనితో పరిచయం ఉన్న అతను తర్వాత నా పెద్ద కూతురు శ్రీగౌతమిని పరిచయం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమి వాళ్ల నాన్న మరణించడంతో బుజ్జి ఆమెను ఓదారుస్తున్నట్టు నటించి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. ఇంతకు ముందే బుజ్జికి పెళ్లి కావడంతో గౌతమి దీనికి నిరాకరించింది. దీంతో బుజ్జి తన భార్య శిరీషకు, తనకు గొడవలు ఉన్నాయని, ఆమెకు విడాకులు ఇచ్చేస్తున్నట్టు నమ్మించాడు.
ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బుజ్జి మొదటి భార్య శిరీష, బుజ్జి కారు డ్రైవర్ రాంబాబు, అతని అనుచరుడు బొల్లెంపల్లి రమేష్‌తో తరచూ బెదిరింపులకు పాల్పడేవారు. ఆ తర్వాత గౌతమి సివిల్ కోచింగ్‌కు విశాఖకు వెళ్లింది. దీంతో బుజ్జి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమెతో సరిగ్గా మాట్లాడకపోవడం, ముఖం చాటేయడం చేశాడు. సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన గౌతమి కదలికలను శిరీష, రాంబాబు, రమేష్ గమనించారు.
ఈ నెల 17న గౌతమి ఆరోగ్యం బాగోకపోవడంతో చెల్లెలు పావనీతో కలిసి నరసాపురం రాయపేటలో ఉన్న బుజ్జి వద్దకు వెళ్లి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరింది. అయితే బుజ్జి అతనితోపాటు అక్కడే ఉన్న అతని అనుచరుడు రమేష్ ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దీంతో గౌతమి, పావని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత రమేష్ తరచూ గౌతమికి ఫోన్ చేసి ఆస్పత్రికి వెళ్లారా.. ఎన్నిగంటలకు వెళ్తున్నారని ఆరా తీసేవాడు. ఈ నేపథ్యంలోనే 18న గౌతమి, పావని ఆసుపత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, ప్రమాదానికి గురయ్యారు. గౌతమి అక్కడికక్కడే మరణించింది. గౌతమిని పథకం ప్రకారమే బుజ్జి భార్య శిరీష, అతని అనుచరుడు రమేష్, కారు డ్రైవర్ రాంబాబు కలిసి హత్య చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలి.
అందుబాటులో లేని సీఐ, ఎస్సై
ఫిర్యాదు చేసేందుకు గౌతమి తల్లి అనంతలక్ష్మి వచ్చిన సమయంలో సీఐ ఎ.చంద్రశేఖర్, ఎస్సై ఆదిప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో ఆమె హెడ్ కానిస్టేబుల్ కె.యెహెజ్కెలుకు ఫిర్యాదు అందజేసి రశీదు తీసుకున్నారు. ఆమె వెంట ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వి.మహేష్, పాలకొల్లు డివిజన్ ఉపాధ్యక్షుడు జి.యుగంధర్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే దీనిపై మానవహక్కుల కమిషన్‌కు, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు. ఈ కేసును తక్షణం ప్రభుత్వం సీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.