వాహనాలను పక్కకు తీస్తున్న స్థానికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానకమ్మ
శ్రీకాకుళం, కాశీబుగ్గ: ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయడంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కొంతమంది వీరిని తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదం పలాస సమీపంలో బుధవారం జరిగింది. పలాస మండలం కొబ్బరి చెట్లూరు జాతీయ రహదారి కూడలి వద్ద హెచ్‌సీ సి.హెచ్. శ్రీనివాసరావు ఇన్‌చార్జ్‌గా, సిబ్బంది ఎస్.గాసయ్య, జి.శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం 12.15 నిమిషాల సమయంలో తనిఖీలు చేస్తున్నారు. మండలంలోని దానగొర గ్రామానికి చెందిన సవర డానియల్ అటుగా వస్తున్నారు.
ఇదే సమయంలో మందస మండలం కొత్తపురం గ్రామానికి చెందిన గుంట జానకీరావు, తన భార్య జానకమ్మతో పాటు మనమరాలు అవంతిక ద్విచక్రవాహనంపై వస్తున్నారు. డానియల్, జానకిరావు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో పెట్రోలింగ్ సిబ్బంది వీరిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే వీరు ఆగకుండా యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంట జానకిరావుకు తలకు, నుదుటికి తీవ్రగాయాలయ్యాయి. కుడిచేయి, కుడికాలు వద్ద విరిగిపోయింది. గుంట జానకిరావు భార్య జానకమ్మ తలకు తీవ్రగాయమైంది. మనవరాలు అవంతిక క్షేమంగా బయటపడింది. క్షత్రగాత్రులను హైవే పెట్రోలింగ్ సిబ్బంది, స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రకాష్ వర్మ వైద్యపరీక్షలు నిర్వహించి ప్రథమ చికిత్స అందజేశారు. కాగా సవర డానియల్‌కు గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment