
ప్రమాదంలో మృతిచెందిన మధు మృతులు పవన్‌కుమార్, మధు (ఫైల్)
‘మైనర్ డ్రైవింగ్’ మరో ఇద్దరిని చంపేసింది. పాతబస్తీలో ఓ బాలుడిని మింగిన ఉదంతాన్ని మరువక ముందే హుమాయున్‌నగర్‌లో శుక్రవారం ఇద్దరు మైనర్‌లు వేగంగా బైక్ నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ట్రిబుల్ రైడింగ్ చేస్తూ బస్సును క్రాస్ చేసేందుకు ప్రయత్నించగా..అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. పవన్ కుమార్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా...మధు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయాడు.
సాక్షి, సిటీబ్యూరో/మెహిదీపట్నం: ‘మైనర్ డ్రైవింగ్’ మరో ఇద్దరిని చంపేసింది. పాతబస్తీలో ఓ బాలుడిని మింగిన ఉదంతాన్ని మరువక ముందే హుమాయున్‌నగర్‌లో మరోటి వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని బాలుడు వాహనం నడపటానికి తోడు ఒకే వాహనంపై ముగ్గురు ప్రయాణించడంతో తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..గుడిమల్కాపూర్ అల్లూరి సీతారామరాజునగర్‌కు చెందిన కె.పవన్ కుమార్ (15) లంగర్‌హౌస్ పీటల్ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సాయినగర్‌కు చెందిన ఎన్.మధు(16) మెహిదీపట్నం పుల్లారెడ్డి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. హీరానగర్‌కు చెందిన భాగ్యచంద్(17) గౌతమ్ విద్యానికేతన్ స్కూల్‌లో చదువుకుంటున్నాడు. వీరి ముగ్గురు ఉషోదయనగర్ కాలనీలోని వివేకానంద స్కూల్‌లో ప్రతి రోజూ ఉదయం ట్యూషన్‌కు వెళ్తుంటారు. శుక్రవారం ఎవరికి వారు ట్యూషన్‌కు వెళ్లగా, మాస్టారు రాకపోవడంతో క్లాసు రద్దయింది. దీంతో ఈ ముగ్గురితో పాటు మరికొందరూ కలిసి మాసబ్‌ట్యాంక్‌లోని చాచానెహ్రూ పార్క్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు మూడు ద్విచక్ర వాహనాలపై బయలుదేరారు. పవన్ తన తండ్రి కె.కృష్ణ పేరిట ఉన్న హోండా యాక్టివా వాహనం (టీఎస్ 13 ఏడీ 6266) తీసుకురావడంతో మధు, భాగ్యచంద్ కూడా అదే వాహనం ఎక్కారు.
పవన్ వాహనం నడుపుతుండగా... మధు మధ్యలో, భాగ్యచంద్ వెనుక కూర్చున్నారు. ఎన్‌ఎండీసీ సమీపంలో పవన్ తమ ముందు వెళ్తున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును క్రాస్ చేయడానికి ప్రయత్నించాడు. అదుపు తప్పి బైక్‌కు బస్సు వెనుక భాగం తగలడంతో ముగ్గురూ రోడ్డుపై పడిపోయారు. తీవ్రంగా గాయపడిన పవన్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధు కన్నుమూశాడు. గాయపడిన భాగ్యచంద్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ఈ ఘటనతో గుడిమల్కాపూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అమలముకున్నాయి. ప్రాథమికంగా పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేని, మైనర్‌కు వాహనాన్ని ఇస్తే దాని యజమాని సైతం శిక్షార్హుడే. కేసు దర్యాప్తులో భాగంగా దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నాం..
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనర్లు వాహనాలు నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి చెక్ చెప్పడానికి ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నాం. ఇలాంటి కేసుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల కంటే చిన్న చిన్న పనుల కోసం వాహనాలపై వెళ్లే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఎవరైనా చిక్కితే వారికి జరిమానా విధించే విధానానికి స్వస్తి చెప్పాం. మైనర్, వారి తల్లిదండ్రులు/సంరక్షకుడు, వాహనం ఇచ్చిన వాహన యజమానులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆపై మైనర్‌పై జ్యువైనల్ కోర్టులో, ఇతరులపై ట్రాఫిక్ కోర్టులో చార్జ్‌షీట్లు దాఖలు చేస్తున్నాం. న్యాయస్థానాలు తొలిసారి చిక్కిన వారికి జరిమానా విధిస్తున్నాయి. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ
Comments
Please login to add a commentAdd a comment