పుంగనూరులో ఉపాధి కుంట (ఇన్‌సెట్) చిన్నారులను కాపాడిన రూప
తిరుపతిలో ఉంటే కరోనా సోకుతుందని కుమారుడిని తీసుకుని పుంగనూరులోనిపుట్టింటికి వచ్చిన ఓ తల్లి కళ్ల ఎదుటే కుమారుడు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. స్నేహితుడితో ఈత కొట్టేందుకు వచ్చిన మరో బాలుడు నీటిమునిగి మృత్యువాత పడిన విషాదకర సంఘటన సోమవారం జరిగింది. వివరాలు..
చిత్తూరు ,పుంగనూరు: తిరుపతికి చెందిన పెయింటర్ శ్రీనివాసులు, రాజేశ్వరి దంపతుల కుమారుడు రాఖేష్ నాయక్ (13), ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతుండంతో రాజేశ్వరి కుమారుడితో కలసి పుట్టినిల్లు పట్రపల్లెతాండాకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన శ్రీరాములు నాయక్ కుమారుడు లక్ష్మీతేజ (9) నాలుగవ తరగతి చదువుతున్నాడు. సోమవారం బంధువులు రూప, రత్నమ్మలతో కలసి రాజేశ్వరి గ్రామ సమీపంలోని చిట్టెంవారిపల్లె క్వారీ గుంతల్లో దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. ఈ సమయంలో లక్ష్మీతేజ, రాఖేష్‌నాయక్, లోకేష్, భవదీప్, హేమసాయి ఐదుగురు కలసి సమీపంలోని ఉపాధికుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు.
నీటిలో మునిగిపోతూ కేకలు వేయడంతో రాజేశ్వరి, రూప, రత్నమ్మ పిల్లలను కాపాడేందుకు వెళ్లారు. రూప నీటిలోకి దూకి లోకేష్ (10), భవదీప్(11), హేమసాయి (9)లను కాపాడింది. రాఖేష్, లక్ష్మీతేజలను కాపాడే ప్రయత్నంలో రూప కూడ నీటిలో మునిగిపోతుండగా అక్కడే పశువులు మేపుతున్న హరీష్ అనే యువకుడు ఆమెను కాపాడాడు. అప్పటికే నీట మునిగిన రాఖేష్, లక్ష్మీతేజలు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో పట్రపల్లెతాండలో విషాదచాయలు అలుముకున్నాయి. ఇద్దరు చిన్నారులు మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment