
బయ్యారం(ఇల్లెందు): దీపావళి పండుగ సెలవుల్లో సరదాగా చెరువు అందాలు చూసేందుకు వచ్చారు... అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోగా.. అతడిని కాపాడేందుకు మరొకరు నీటిలో దూకారు. అయితే, ఇద్దరూ నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు వద్ద బుధవారం జరిగింది. మహబూబాబాద్‌కు చెందిన ఏరుపుకొండ జయరాజు(18) తన సోదరి శ్రావణి.. నాగెళ్ల ప్రేమ్‌భరత్(17) తన సోదరి భావనతో పాటు వారి స్నేహితులు జయంత్, సందీప్‌లు పెద్ద చెరువు అందాలను చూసేందుకు బుధవారం వచ్చారు.
వారంతా మొదటి అలుగు వద్ద సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్‌భరత్ ప్రమాదవశాత్తు నీటిలో జారి పడ్డాడు. అతడిని రక్షించేందుకు జయరాజు తనవద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను మరో స్నేహితుడు జయంత్‌కు ఇచ్చి వెంటనే నీళ్లలో దూకాడు. ఈ సమయంలో ప్రేమ్‌భరత్ జయరాజును గట్టిగా పట్టుకోవడంతో ఇరువురు నీళ్లలో గల్లంతయ్యారు. తమ్ముళ్లు నీటిలో మునిగిపోవడం చూసిన పైన ఉన్న వారు కేకలు వేసినప్పటికీ సమీపంలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment