Bayyaram
-
బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇక లేనట్లేనా? : MLC కవిత
-
Mahabubabad: ప్రభుత్వం రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యం?
బయ్యారం (మహబూబాబాద్): ప్రభుత్వ చౌకదుకాణం నుంచి సరఫరా అయిన బియ్యంలో ప్లాస్టిక్బియ్యం ఉండడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది. వివరాలు.. బయ్యారంలోని పీహెచ్సీ ఏరియాలో నివాసం ఉండే నాసరబోయిన పద్మ తన అత్త రామక్క పేరున వచ్చే బియ్యం పది కేజీలు మార్చి నెలలో తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ బియ్యాన్ని మంగళవారం వండేందుకు నానబెట్టిన సమయంలో ప్లాస్టిక్‌తో కూడిన బియ్యం నీళ్లలో పైకి తేలాయి. దీంతో ఆ బియ్యాన్ని పూర్తిగా గమనించగా ప్లాస్టిక్ బియ్యంగా కనపడటంతో పద్మ ఈ విషయాన్ని విలేకరులకు తెలిపింది. ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఎలా వచ్చాయి అనే ప్రశ్న పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా చౌకదుకాణాల ద్వారా సరఫరా అవుతున్న బియ్యం నాణ్యతపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. (చదవండి: ఫోన్లో అతిగా మాట్లాడుతున్నావని మందలించినందుకు... ) -
విఫల ప్రేమకు ఏటా కల్యాణం.. 18 ఏళ్లుగా ఇదే తంతు!
సాక్షి, బయ్యారం: బలవన్మరణం పొందిన బిడ్డ జ్ఞాపకంగా గుడి కట్టి ఏటా శ్రీరామనవమి రోజు కుమారుడి విగ్రహానికి కల్యాణం చేయిస్తున్నారు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌పోడు తండాకు చెందిన భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు. వారికి కుమారుడు, కుమార్తె సంతానం కాగా కొడుకు రాంకోటి ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతో 2003లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కొడుకు రాంకోటి కలలోకి వచ్చి తనకు గుడి కట్టించి, వివాహం జరిపించాలని కోరినట్టు తల్లి సుక్కమ్మ కథనం. ఈ నేపథ్యంలో ఇంటి ఆవరణలోనే గుడి కట్టించి.. అందులో కొడుకు విగ్రహంతోపాటు పెళ్లి కుమార్తె విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఆ విగ్రహాలకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భూక్య లాలు, సుక్కమ్మ దంపతులు వివాహం జరిపించారు. 18 ఏళ్లుగా వారీ విధంగా చేస్తుండటం విశేషం. -
‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు'
‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్ముల్ని ఎవరు చూస్తారు అంటూ చిన్నారులు శ్యామల, బిందు విలపించిన తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. కరెంట్ రూపంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు కుండ చేత పట్టి అంతిమయాత్ర ముగిసే వరకు అమ్మనాన్నలను తలచుకుంటూ శోకసంద్రంలో మునిగారు. అన్నీ తామై తల్లిదండ్రులకు తలకొరివి పెట్టారు. తమకు దిక్కెవరు అని గుండెలు బాదుకుంటుండగా బంధువులు, గ్రామస్తులు వారిని ఓదార్చుతూనే కన్నీటి పర్యంతమయ్యారు’. సాక్షి, బయ్యారం: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూసేందుకు వచ్చిన కొడుకుతో పాటు కోడలును కరెంట్ కబలించింది. మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధి సింగారం కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్ తన భార్య తిరుపతమ్మతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు శ్యామల, బిందు ఉన్నారు. ఇటీవల ఉపేందర్ తండ్రి వెంకులు కాలు విరిగింది. అతడిని చూసేందుకు వచ్చిన ఉపేందర్ దంపతులను కరెంట్ ప్రవహిస్తున్న దండెం బలి తీసుకుంది. కాగా వారి అంతిమ యాత్రలో కుమార్తెలు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. చదవండి: (పాము విషం విక్రయం గుట్టురట్టు.. ఒక కిలో పాము విషం కోటిన్నర..?!) నాడు ప్రేమలో.. నేడు చావులో.. కాలనీకి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ ఇద్దరు ఒకే సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ ప్రేమతో పెళ్లికి సిద్ధపడగా ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నాడు ప్రేమలో ఒకటైన వారు నేడు ఒకటిగా మృతి చెందారని అంటూ స్థానికులు కంటతడి పెట్టారు. తల కొరివిపెట్టిన చిన్నారులు.. విద్యుదాఘాతంతో మృతి చెందిన తల్లికి చిన్నకుమార్తె బిందు, తండ్రికి పెద్దకుమార్తె శ్యామల తలకొరివి పెట్టారు. చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన చిన్నారులు పెద్ద బాధ్యతను మోయడం చూసిన పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: (నెల రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి.. కాబోయే భర్తను కలిసేందుకు వెళ్తుండగా..) ప్రభుత్వపరంగా ఆదుకుంటాం.. విద్యుదాఘాతంతో మృతి చెందిన ఉపేందర్, తిరుపతమ్మ పిల్లలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎంపీ కవిత, అదనపు కలెక్టర్ కొమరయ్య అన్నారు. అదనపు కలెక్టర్ సింగారం కాలనీకి వెళ్లి పిల్లలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఇందులో తహసీల్దార్ నాగభవాని పాల్గొన్నారు. -
చదువు కోసం సమాధిపైకి.. అక్కడైతేనే ఆన్‌లైన్‌కు ఓకే
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోయగూడెం గ్రామంలో సెల్ నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా రావు. ఊరిబయట పంట చేల వద్ద ఉన్న సమాధుల వద్ద మాత్రం నెట్వర్క్ బాగుంటుంది. దీంతో విద్యార్థులు సమాధుల వద్ద కూర్చుని ఆన్లైన్ పాఠాలు వినాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థినులు గురువారం సమాధిపై కూర్చొని ఆన్లైన్ పాఠాలు వింటున్న దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – బయ్యారం ఈ ఏడాది పాతవే! సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభం రోజునే అందజేసే ఉచిత రెండు జతల స్కూల్ యూనిఫామ్స్ ఈ ఏడాది విద్యార్థులకు ఇంకా ఇవ్వలేదు. నిరుపేదల విద్యార్థులు ఈ బట్టలనే వేసుకొని సంతోషంగా ఉండేవారు. అయితే గత ఏడాది కరోనా భయంతో పాఠశాలలు మూసి వేసినా యూనిఫామ్స్ మాత్రం ఇవ్వడం ఆపలేదు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బట్టలను ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా క్లాత్ కూడా కొనుగోలు చేయలేదని, ఈ ఏడాది బట్టలు రావడం ఇబ్బందే అని అధికారులు చెబుతున్నారు. అసలే కరోనా కష్టకాలంలో కుటుంబాలు పోషించుకోవడమే ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో పిల్లలకు బట్టలు కొనలేని దుస్థితిలో తల్లిదండ్రులు ఉండటంతో పేద పిల్లలు పాత బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. గత ఏడాది ముందుగానే.. ప్రతీ సంవత్సరం మాదిరిగానే గత ఏడాది కూడా పిల్లలకు కొత్త బట్టలు కుట్టించారు. కరోనాతో పాఠశాలలు తెరుచుకోక పోవడంతో, ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించారు. అయినా యూనిఫామ్స్ మాత్రం ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ పంపిణీ చేశారు. గత ఏడాది జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతో పాటు, మోడల్ స్కూల్స్, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో మొత్తంగా 50,474 మంది విద్యార్థులు, విద్యార్థినులు చదివారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 600 విలువ చేసే క్లాత్, మగవారికి షర్ట్, ప్యాయింట్, నెక్కర్, ఆడ పిల్లలకు చిన్న వారికి షర్ట్, పర్కిన్ క్లాత్, పెద్దవారికి పంజాబీ డ్రస్ క్లాత్ చున్నీల క్లాత్ ఇచ్చారు. అదే విధంగా జతకు రూ. 50 చొప్పున రెండు జతలకు రూ. 100 ఖర్చుతో యూనిఫామ్స్ కొనుగోలు చేసి అందజేశారు. ఇలా సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచి రూ. 354.683 లక్షలు విడుదల చేశారు. ఈ నిధులతో కొనుగోలు చేసిన క్లాత్ జిల్లా విద్యాశాఖ అధికారికి, అక్కడి నుంచి ఎమ్మార్సీకి అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఈ ప్రక్రియ అంతా గత ఏడాది ఏప్రిల్ నెల చివరలోనే పూర్తి చేయగా జూన్ మొదటి వారంలో కుట్టించి విద్యార్థుల ఇంటికి వెళ్లి బట్టలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఊసే లేదు... గత ఏడాది మాదిరిగా ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ చేసి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విద్యాశాఖ పిల్లలకు అందజేసే యూనిఫామ్ మాత్రం ఇవ్వడం లేదు. వేసవి కాలంలోనే పాఠశాలలకు రావాల్సిన క్లాత్ రాలేదు. అసలు ఈ ఏడాది యూనిఫామ్స్‌కు బడ్జెట్ కేటాయించకపోవడం గమనార్హం. కరోనాతో ప్రైవేట్ పాఠశాలలు వదిలి ప్రభుత్వ పాఠశాలల బాటపడుతున్న విద్యార్థులకు ఉచిత బట్టలు ఇవ్వడం లేదని తెలియడంతో నిరుత్సాహ పడుతున్నారు. ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫామ్స్‌తో పిల్లలకు బట్టలు కుట్టించే భారం తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కష్టకాలంలో అప్పులు చేసి బట్టలు కుట్టించాల్సి వస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు. పాతబట్టలే వేసుకుంటున్నా.. ప్రతీ సంవత్సరం బడి తెరవగానే రెండు జతల కొత్త బట్టలు ఇచ్చేవారు. ఈ బట్టలు వేసుకొని బడికి పోయేదాన్ని.. బతుకమ్మ పండుగకు అమ్మానాన్నలు కొత్త బట్టలు కుట్టిస్తారు.. ఇప్పుడు సార్లు బట్టలు ఇవ్వలేదు. ఇటు అమ్మానాన్న కొత్త బట్టలు కుట్టివ్వలేదు. దీంతో పాత బట్టలే వేసుకుంటున్నా.. నేనే కాదు.. అందరూ ఇలాగే చేస్తున్నారు. చినిగినవి కుట్టుకుంటూ వేసుకుంటున్నాం. – గద్దల పూజిత, పదో తరగతి విద్యార్థిని,జెడ్పీహెచ్ఎస్ పెద్దవంగర కష్టకాలంలో బట్టలు ఇవ్వలేదు ఒక వైపు కరోనా కష్టకాలంలో బతకటమే ఇబ్బందికరంగా మారింది. అంతకముందు ప్రతీ సంవత్సరం పిల్లలకు రెండు జతల యూనిఫామ్స్ ఇచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది యూనిఫామ్ ఇవ్వటం మరిచిపోయింది. పోయిన సంవత్సరం కరోనా ఎఫెక్ట్‌తో పాఠశాల ప్రారంభం అయిన సమయంలోనే పుస్తకాలతో పాటు యూనిఫామ్ ఇచ్చారు. ఈ సంవత్సరం యూనిఫామ్ ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉంది. – మేర్గు సంధ్య(బయ్యారం) ఈ ఏడాది బడ్జెట్ రాలేదు.. ఈ ఏడాది బడ్జెట్లో యూనిఫామ్‌కు డబ్బులు కేటాయించలేదు. దీంతో ప్రతీ ఏడాది మాదిరిగా జిల్లాకు క్లాత్ రాలేదు. దీంతో పిల్లలకు యూనిఫామ్స్ ఇవ్వలేదు. ప్రతీ విద్యార్థి ఆన్లైన్ క్లాసులు వినేలా చర్యలు తీసుకుంటున్నాం.. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే యూనిఫామ్ కుట్టించి ఇస్తాం. – సోమశేఖర శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి -
నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. మా బతుకెట్ల బిడ్డో..
బయ్యారం: ‘బిడ్డా నిన్ను నమ్ముకొని బతుకుతున్నాం.. నీవు ఇట్లా ఎళ్లిపోతే మేము బతికేదెట్టా..’అంటూ రైతు దంపతులు విద్యుదాఘాతంతో మరణించిన తమ కాడెద్దు వద్ద విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇసుకమేది గ్రామానికి చెందిన సోలం నర్సింహారావు, కృష్ణవేణి దంపతులకు రెండెకరాల భూమి ఉంది. ఈ భూమిని తమ రెండు కాడెడ్లతో సాగు చేస్తారు. అయితే, ఆ రెండు కాడెడ్లలో ఒకటి సోమవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా, ఇదేచోట మరో నలుగురు రైతులకు చెందిన ఎద్దులు కూడా మృతి చెందాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండ్రోజు లు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియర్ వరకు ఉపరితల ఆవర్త నం వ్యాపించి ఉందని, ఎత్తుకెళ్లే కొద్దీ అల్పపీడ నం నైరుతిదిశగా తెలంగాణ వైపునకు ఉన్నట్లు తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అంచనా వేసింది. చదవండి: పోస్ట్ కోవిడ్‌లో కొత్తరకం సమస్య.. ‘వైరల్ ఆర్థ్రాల్జియా’ -
పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న వీరిద్దరు మహిళలు. కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది. బుచ్చమ్మ సోమవారం కరోనాతో ఇంట్లోనే చనిపోయింది. ఇది తెలిసి ఆమె రెండో కుమారుడు భయంతో పారిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నా.. కరోనాతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితి.. దీంతో సునీత.. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగావత్ శిరీషతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అత్త మృతదేహాన్ని జేసీబీతో గ్రామ శివారుకు తరలించి.. అంత్యక్రియలు పూర్తిచేసింది. – బయ్యారం -
నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి
సాక్షి, బయ్యారం: ‘ప్రేమించిన పాపానికి నాపై లైంగిక దాడికి యత్నించారు. కిడ్నాప్ కూడా చేయబోయారు. పోలీసులకు ఫిర్యాదు చేద్దామని వెళ్తున్న మా నాన్నను అన్యాయంగా జైలుకు పంపారు. నాతో పాటు నా కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. నా చావుతోనైనా కుటుంబానికి రక్షణ కల్పించండి సారూ. అమ్మా.. నాన్నా మీరు క్షేమంగా ఉండటం కోసం నేను వెళ్లిపోతున్నా’.. అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పత్యాతండాలో చోటుచేసుకుంది. సూసైడ్‌నోట్‌లో మృతురాలు పేర్కొన్న వివరాలు ప్రకారం... పత్యాతండాకు చెందిన ధర్మసోత్ సునీత (20), అదే తండాకు చెందిన మాళోత్ శివ ప్రేమించుకున్నారు. ఈ విషయం శివ తల్లిదండ్రులకు తెలియడంతో వారు సునీత బంధువులతో అసభ్యకరంగా మాట్లాడారు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో శివ సైతం సునీతపై లైంగిక దాడికి యత్నించాడు. కుదరకపోవడంతో సునీతను కిడ్నాప్ చేయడానికి చూశాడు. విషయం సునీత తన తండ్రి బిచ్చకి, సర్పంచ్ కి తెలిపింది. దీంతో సునీత తండ్రి .. శివతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గత నెల 24న పోలీస్ స్టేషన్ కు బయలుదేరాడు. అయితే పథకం ప్రకారం శివ అతని బంధువులు సునీత తండ్రిని అడ్డుకున్నారు. పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి బిచ్చనే జైలుకు పంపించారు. ఆధారాలు లేవన్న కారణంతో శివకు సంబంధించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. బిచ్చ జైలుకు వెళ్లడంతో సునీత కుటుంబానికి రక్షణ లేకుండా పోయింది. దీంతో మానసికంగా కుంగిపోయిన సునీత ‘శివతో పాటు అతని బంధువులు తన కుటుంబ సభ్యులను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు’అంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుతోనైనా వారిని జైలుకు పంపాలని సూసైడ్ నోట్ లో పేర్కొంది. చదవండి: (భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..) న్యాయం చేయాలని ఆందోళన.. కాగా, సునీత కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె బంధువులు బయ్యారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ యోగేష్ గౌతమ్ మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 8 మందిపై కేసు నమోదు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మాళోత్ శివతో పాటు 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మృతురాలు సూసైడ్ నోట్లో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని ఆరోపించటంపై ఎస్సైను వివరణ కోరగా, తమకు వచ్చిన ఫిర్యాదుపై తండాలో విచారణ నిర్వహించామని, కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. -
ఈ గ్రామంలో మందు ముట్టరు.. స్టేషన్ మెట్లెక్కరు!
పచ్చని అడవి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఎన్నో ఆదర్శాలకు మారుపేరు. ఆ ఊళ్లోని వారెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది లేదు. చిన్నా చితకా తగాదాలొచ్చినా.. కూర్చుని మాట్లాడుకుంటారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం గ్రామ ప్రత్యేకతలివీ.. సాక్షి, బయ్యారం: పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవçహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది లేదు. తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పునకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు. గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. పదేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల మాదిరిగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిన్నల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. ఈ గ్రామస్తులు అన్నింటా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. అంగన్వాడీ, ఏఎన్ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు. అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అందరికీ మరుగుదొడ్లు మైదాన ప్రాంతంలోనే పూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం జరగని పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న మొట్లతిమ్మాపురంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పల్లె బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఐకమత్యంగా ఉండే ఆ గ్రామంలో అన్ని రాజకీయపార్టీల సానుభూతిపరులు ఉన్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటున్నా.. రాజకీయపరమైన విభేదాలు, పోటీల జోలికి వెళ్లరు. ఎన్నికలప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చే పార్టీ అభ్యర్థికే సమష్టిగా ఓట్లు వేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఒకచోట కూర్చొని సమస్యలను చర్చించుకుంటున్న గ్రామస్తులు పోటీలేదు.. ఇతర పంచాయతీల్లో అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడి డబ్బు ఖర్చుపెట్టి పదవులు కొనుక్కొంటున్న పరిస్థితి.. అందుకు భిన్నంగా నాపై నమ్మకంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నా. – బిజ్జ స్వరూప, సర్పంచ్ గ్రామస్తులు కలసికట్టుగా ఉంటారు కొత్తగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన నాకు మొట్లతిమ్మాపురంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. వివాదాల జోలికి వెళ్లరు. సమస్య వస్తే ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటారు. ఊరిలో మద్యం అమ్మకాల్లేవు. – బానోత్ నరేష్, పంచాయతీ కార్యదర్శి, మొట్ల తిమ్మాపురం రాజకీయాలతో సంబంధం లేదు మా ఊర్లో అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. అయితే ఆ జెండాలు మా మధ్య ఏనాడూ గొడవలు సృష్టించలేదు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నాం. అందుకే మా ఊరి వాసులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి ఎదురుకాలేదు. – బూర్క పాపయ్య, గ్రామ వాసి చెప్పినట్లు వింటారు చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు పెద్దమనుషులు చెప్పినట్లు వింటారు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఒక అభిప్రాయంతో పరిష్కరించుకుంటాం. సారా, మద్యం లేకపోవటంతో ఊరు ప్రశాంతంగా ఉంది. – బిజ్జ విశ్వనాథం, గ్రామ వాసి -
శవాన్ని బూటుకాళ్లతో తొక్కిన పోలీస్
బయ్యారం : ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న యువకుడి శవాన్ని ఓ పోలీస్ తన బూటుకాళ్లతో తొక్కిన అమానవీయ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. బయ్యారం బస్టాండ్ సెంటర్లో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కానిస్టేబుల్ ఏకంగా బూటుకాళ్లను వినియోగించటం స్థానికంగా విస్మయానికి గురి చేసింది. యువకుడి అకాల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తుంటే కనీసం జాలి లేకుండా ఆ కానిస్టేబుల్ చేసిన చర్యను చూసి అందరూ ఆవేదన చెందారు. -
ఇల్లు అమ్మనివ్వడంలేదని.. ఫ్యానుకు ఉరి!
సాక్షి బయ్యారం : ఇల్లు అమ్మనివ్వడం లేదని ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్ సత్తమ్మ బయ్యారం జూనియర్ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ బయ్యారంలో ఓ ఇంటిని కిరాయికి తీసుకుని ఉంటోంది. లాక్‌డౌన్‌కు ముందు హైదరాబాద్‌లో భార్యతో కలసి నివాసం ఉండే కుమారుడు ప్రశాంత్(30) తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. చదవండి: ఫీజు చెల్లించలేక తనువు చాలించింది అయితే వీరికి మహబూబాబాద్‌లో ఓ ఇల్లు ఉండగా దానిని అమ్మేసి హైదరాబాద్‌కు వెళ్లిపోదామని ఇటీవల ప్రశాంత్ తన తల్లితో వాదన పెట్టుకున్నాడు. ఇందుకు అంగీకరించకపోవటంతో ప్రశాంత్ సోమవారం..తల్లి లేని సమయం చూసి భార్యను వేరే గదిలో ఉంచి గడియపెట్టాడు. ఆ తరువాత సెల్ఫీ తీసుకుంటూ ఫ్యానుకు ఉరివేసుకుంటున్న దృశ్యాలను బంధువులకు పంపించి..ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంత్ భార్య ఆరునెలల గర్భవతి కాగా.. కుటుంబసభ్యులు మంగళవారం శ్రీమంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఇలా జరగడం అందరిలోనూ విషాదం నింపింది. -
మహబూబాబాద్: కళ్లముందే నీట మునిగిన కూతురు
-
కళ్లముందే నీటిలో కొట్టుకుపోయిన కూతురు
సాక్షి, మహబూబాబాద్: జలపాతాన్ని చూసి ఉల్లాసంగా గడుపుదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లముందే నీట మునిగింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్, శ్రీవిధ్య దంపతులు, కూతురు శివాని, కుమారుడు శివాజీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఫోటోలు దిగి సరదాగా గడిపారు. (చదవండి: శ్రీనివాస్ చనిపోయాడు.. ) తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శివానీ ఆచూకీ లభించకపోవడం రెండు జేసీబీల సహాయంతో ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. దాంతో విగత జీవిగా మారిన శివానీ కనిపించింది. ఆమె యానిమల్ హజ్బెండరీలో డిప్లమా చేస్తున్నట్టు తెలిసింది. కళ్లముందే తమ బిడ్డ జల సమాధి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ సమయంలో వాటిని సందర్శించడం మంచిది కాదని పోలీసులు ప్రజలకు సూచించారు. (చదవండి: ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ... ) -
సీతమ్మ శీతకన్ను..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈసారి కేంద్ర బడ్జెట్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండిచెయ్యే ఎదురైంది. ఏ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయింపు జరగకపోగా.. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడారం జాతరకు జాతీయ హోదా కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఈసారి కూడా పచ్చజెండా ఊగలేదు. కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు దక్కలేదు. రైల్వే డివిజన్ ఏర్పాటు అంశానికైతే బడ్జెట్లో స్థానమే లభించలేదు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో 1,200 ఎకరాల్లో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీకి మోక్షం కలగలేదు. ఈ మేరకు పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కథనం. దక్కని జాతీయ హోదా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కొన్నేళ్లుగా కేంద్రాన్ని కోరుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. భారీ వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తుందనే ప్రభుత్వం నమ్మకంతో ఉన్నా నిరాశే ఎదురైంది. ఇక గిరిజన కుంభమేళాగా ములుగు జిల్లాలోని మేడారం జాతరకు కూడా జాతీయ హోదా కలగానే మిగిలిపోతోంది. కొన్నేళ్లుగా జాతరకు జాతీయ హోదా కోసం కోరుతున్నా మోక్షం కలగడం లేదు. గిరిజన యూనివర్సిటీ రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి ములుగు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో అక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతయేడు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.4కోట్లను మాత్రమే కేటాయించారు. ఇక యూనివర్సిటీకి అవసరమైన 500 ఎకరాల్లో 497 ఎకరాలకు పైగా గుర్తించారు. కానీ ఈసారి బడ్జెట్లో ని«ధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగేలాల లేవు. బయ్యారం ఊసేది? ఇనుపరాయి గనులు విస్తారంగా ఉన్న బయ్యారంలో ఉక్కుపరిశ్రమ నిర్మాణం కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మానుకోట జిల్లావాసులకు ఈ బడ్జెట్లో కూడా నిరాశే ఎదురైంది. రెండోసారి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏన్డీయే ప్రభుత్వం బయ్యారం పరిశ్రమపై ఏదైనా ప్రకటన చేస్తుందనుకున్న వారికి ఎదురుచూపులే మిగిలాయి. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన ఖనిజ నిక్షేపాలు 200 టన్నులకు పైగా ఉన్నట్లు అధికారులు గతంలో సర్వే ద్వారా గుర్తించారు. పరిశ్రమకు బయ్యారం చెరువు ద్వారా నీటి సదుపాయం, రైల్వే రవాణ సౌకర్యాలు ఉన్నా కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే, జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. అలాగే, ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లాల్సి ఇబ్బందులు తప్పేవి. టెక్స్టైల్ పార్కు పరిస్థితీ అంతే... వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ – సంగెం మండల్లో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం 22 అక్టోబర్ 2017లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. పార్కు నిర్మాణం కోసం 1200 ఎకరాల భూమి సేకరించారు. పార్కులో అంతర్గత రోడ్ల నిర్మానం ఇప్పటికే జరుగుతుండగా.. పలు కంపెనీలు ఎంఓయూ కూడా చేసుకున్నాయి. ఈ పార్కు నిర్మాణం పూర్తయితే లక్ష మందికి పైగా ఉపాధి లభించే అవకాశముంది. టెక్స్టైల్ పార్కు అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్.. హైదారాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండ్రస్టీయల్ కారిడార్ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కో రింది. కానీ ఈసారి బడ్జెట్లో స్థానం దక్కలేదు. రైల్వే డివిజన్, వ్యాగన్ షెడ్ దశాబ్దకాలానికి పైగా పెండింగ్‌లో ఉన్న కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటుపై బడ్జెట్లో ప్రకటన వస్తుందనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. అదేవిధంగా రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా కాజీపేటకు మంజూరైన వ్యాగన్ పీరియాడిక్ల్ ఓవర్ హాలింగ్(పీఓహెచ్) షెడ్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో జిల్లా వాసులతో పాటు రైల్వే కార్మికులు నిరాశ చెందారు. అంతేకాకుండా బల్లార్షా – విజయవాడకు కాజీపేట మీదుగా వెళ్లే మూడో లైన్‌కు కూడా కేటాయింపు చేయలేదు. ఫిట్‌లైన్ ప్రస్తావన, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్ల ఊసు ఎత్తలేదు. కాజీపేట సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి కేటాయింపులు, రైల్వే కార్మికులు, వారి పిల్లల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన ఆర్థిక మంత్రి చేయలేదు. అయితే, రైల్వే ఉద్యోగులకు ఆదాయపు పన్నును కొద్దిమేర తగ్గించనున్నట్లు చెప్పడం, రైతుల కోసం కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి ప్రకటించడం కొంత ఆశాజనకంగా కనిపించింది. తెలంగాణపై కేంద్రం వివక్ష తెలంగాణపై ఈ బడ్జెట్లోనూ కేంద్రప్రభుత్వం వివక్ష చూపింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రానికే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సైతం అన్యాయం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. ఇతర కేటాయింపుల్లోను ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రానికి రావాలి్సన ప్రాజెక్టులకు కేటాయింపులు చేయలేదు. రైల్వే పరంగా మొండిచేయి చూపారు. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ -
అరరే ! ప్లాన్ బెడిసి కొట్టిందే..
బయ్యారం : హాస్టల్ నుంచి తప్పించుకోవటమే గాకుండా తన మాటలతో పలువురిని బురిడి కొట్టిద్దామనుకున్న ఓ విద్యార్థిని చివరకు తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకుల చెంతకు చేరింది. ఈ ఘటన శనివారం బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఏకలవ్య రెసిడెన్షీయల్ పాఠశాలలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంకు చెందిన మానపాటి మల్లయ్య తన కుమార్తె భానును ఐదవతరగతిలో ఇటీవల జాయిన్ చేశారు. అయితే తల్లిదండ్రులను వదిలి పాఠశాలలో ఉండేందుకు ఇబ్బంది పడిన భాను ఉదయం పాఠశాల గేటు నుంచి టీచర్ల కండ్లుగప్పి బయటకు వచ్చి పరుగున గాంధీసెంటర్‌కు చేరుకుంది. ఇంతలో అటు వైపు నుంచి బస్టాండ్ సెంటర్‌కు వెళ్తున్న ఆటోను ఆపిన భాను అబ్బాయిపాలెం వెళ్లాలని డ్రైవర్‌కు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ బస్టాండ్ సెంటర్లో ఆటో నుంచి దింపాడు. తనను శుక్రవారం నలుగురు వ్యక్తులు కారులో బయ్యారం తీసుకొచ్చారని, తాను వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు బురిడి కొట్టించడానికి ప్రయత్నించింది. దీంతో ఆ బాలిక చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన స్థానిక ఆటోడ్రైవర్లు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో బాలికకు ఎస్సై మురళీధర్ కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడుగగా తాను పాఠశాలలో ఉండేందుకు ఇష్టం లేక ఇంటికి వెళ్లేందుకు వచ్చానని అసలు విషయం తెలిపింది. దీంతో ఎస్సై బాలిక తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. మొత్తానికి సినీ ఫక్కిలో చిన్నారి చెప్పిన కథ స్థానికులను ఆందోళనకు గురిచేసినా ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. -
ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు
సాక్షి, మహబూబాబాద్: నేను బతికే ఉన్నాను.. ఆస్తి కోసం నా కుమారుడు చనిపోయినట్లుగా మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి ఆస్తిని కబ్జా చేశాడు. న్యాయం చేయాలంటూ ఓ తల్లి సోమవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యకు వినతిపత్రం అందజేసింది. బాధితురాలు బయ్యారం మండల కేంద్రానికి చెందిన కొండ్రెడ్డి భద్రమ్మ సోమవారం అధికారులు, విలేకరుల ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. వివరాలు ఆమె మాటాల్లోనే.. నాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉంది. అందరికి వివాహం చేసి ఆస్తి సమానంగా పంచి ఇచ్చాను. కొన్నేళ్ల క్రితం నా భర్త చేదరయ్య, ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కుమారుడు మాత్రమే ఉన్నాడు. నా పేరున ఉన్న 2.06 ఎకరాల భూమిని కౌలు ఇచ్చి దాని ద్వారా వచ్చే డబ్బుతోనే జీవనం గడుపుతున్నాను. ‘రైతుబంధు’డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా ఆభూమి పెద్ద కొడుకు సోమిరెడ్డి పేరున ఉందని తెలిసింది. నేను చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించి దాంతో నా భూమిని తన పేరున పట్టా చేయించుకున్నాడని భద్రమ్మ వాపోయింది. నేను బతికే ఉన్నా.. అధికారులు కూడా ఎలాంటి విచారణ చేయకుండానే కొడుకు పేరున పట్టాచేయడం ఎంతవరకు సమంజమని ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో విచారణ చేసి నా భూమి నాకు ఇప్పించాలని, సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని భద్రమ్మ అధికారులను కోరింది. -
ఈ తండాకు ఏమైంది?
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తీత్రీ తండావాసులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లుగా పెళ్లయిన దంపతులకు సంతానం కలగడంలేదు. దీంతో వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తండా నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి వెంటనే సంతానం కలుగుతోంది. దీంతో తండాకు ఏమైందని స్థానికులు అయోమయం చెందుతున్నారు. తండాకు చెందిన ఆడపడుచులు వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా, వారికి ఏడాది తిరిగే సరికి సంతానం కలుగుతుండగా.. పురుషులకు మాత్రం కావడం లేదు. సుమారు 70 ఏళ్ల క్రితం భర్మావత్ తీత్రీ అనే మహిళ బయ్యారం పెద్దగుట్ట పక్కన తండాను ఏర్పాటు చేయగా ఈ తండాలో ప్రస్తుతం 42 కుటుంబాలు నివసిస్తుండగా, 170 మంది జనాభా ఉంది. ఆరేళ్లుగా.. తండాకు చెందిన బోడ చిరంజీవి, గుగులోత్ సురేష్, గుగులోత్ సుమన్, బానోత్ రమేష్, భర్మావత్ చందకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం వీరు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్మావత్ చంద తమ బంధువుల అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటుండగా, మిగతా వారు సంతానం కోసం ఎదురుచూస్తున్నారు. వలస వెళ్లిన వ్యక్తికి సంతానం ఇదే తండాకు చెందిన బానోత్ సురేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇతను బతుకుదెరువు కోసం భార్య జ్యోతితో కలసి హైదరాబాద్‌కు వలస వెళ్లగా అక్కడ వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం సురేష్ దంపతులు తండాలో నివసిస్తుండగా తండాలోని మినీ అంగన్వాడీ కేంద్రంలో సురేష్‌కు చెందిన ముగ్గురు పిల్లలు మాత్రమే ప్రీస్కూల్ విద్యార్థులుగా నమోదయ్యారు. పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలలో రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. తండాలో ఆరేళ్లుగా పిల్లలు పుట్టకపోవటంతో కొత్త పిల్లల నమోదు నిలిచిపోయింది. ఎన్ని ఆస్పత్రుల్లో తిరిగినా.. నా పెద్ద కొడుక్కి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశా. ఇప్పటి వరకు సంతా నం కలగలే. మహబూ బాబా ద్, ఖమ్మంలోని పలు ఆస్పత్రులకు వె ళ్లాం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. – బోడ సరోజ, చిరంజీవి తల్లి ఇలా ఎప్పుడూ జరగలే.. తండా ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. తండాకు చెందిన వారికి కొన్నేళ్లుగా ఎందుకు సంతానం కలగటం లేదో అర్థం కావటం లేదు. – వాంకుడోత్ రాంచంద్, తండావాసి కారణాలు అనేకం ఉంటాయి దంపతులకు పిల్లలకు కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో పలు సమస్యలు ఉంటాయి. సంతానం లేని వారు ఒక్కసారే ట్రీట్మెంట్ చేసుకొని ఆ తర్వాత వైద్యుల సలహాలను పాటించకపోవటం, పరీక్షించిన వైద్యులు ఇతర వైద్యులకు రెఫర్ చేస్తే అక్కడికి వెళ్లకపోవటం వల్ల సంతానం కలగకపోయే అవకాశాలున్నాయి. – డాక్టర్ బి.వీరన్న, డీజీఓ, మానుకోట ఏరియా ఆస్పత్రి ఇద్దరం ఉన్నప్పటికీ పిల్లలు లేరు పాఠశాలలో ఇద్దరం ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ మా బడిలో తగిన సంఖ్యలో పిల్లలు లేరు. ఆరేళ్లుగా తండాకు చెందిన పలువురికి సంతానం కలగకపోవటంతో చిన్నక్లాసులో అడ్మిషన్లు జరగటం లేదు. – మోహన్, పాఠశాల హెచ్ఎం -
అందరూ వాగులో నాణేలు వేస్తుంటే..ఆమె బిడ్డని విసిరేసింది
బయ్యారం(ఇల్లందు): ఓ దేవుడా ఎంత పనిచేశావయ్యా.. కొడుకుకు ఇద్దరు బిడ్డలే పుట్టారు.. మగబిడ్డ కోసం ఆపరేషన్ చేయించలే.. మూడో కాన్పులో మగబిడ్డ పుట్టాడనే తృప్తి లేకుండా చేశావు.. మేమేం చేశాం.. ఈ శిక్ష మాకెందుకు అంటూ తల్లి చేతిలో మృతి చెందిన రెండు నెలల చిన్నారి నానమ్మ లచ్చమ్మ విలపించిన తీరు పలువురి హృదయాలను కలిచివేశాయి. మతిస్థిమితం లేని తల్లి రెండు నెలల కుమారుడిని వాగులో విసిరేసి.. ఆ చిన్నారి మృతికి కారణమైంది. దీంతో మంగిమడుగు బంజార, ఎల్లంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు బంజారకు చెందిన గంగరబోయిన సురేష్‌కు మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన సరితతో వివాహమైంది. వీరికి హర్షిత, ప్రవళిక సంతానం ఉన్నారు. మరో కాన్పు కోసం ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సరిత మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటు ంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైంది. సరిత మతిస్థిమితం లేకుండా వ్యవహరించింది. వైద్యం చేయించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.ఏం జరిగింది..? మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్న సరితను బాగు చేయాలని ఆమె అత్త లచ్చమ్మ, తల్లి పద్మ, ఆడపడుచు పద్మ ఆటోలో సరితతోపాటు ఆమె పిల్లలను తీసుకుని మండలంలోని కట్టుగూడెం లోని దేవుని శివసత్తి (దేవుని పూనకం వచ్చే మహిళ) వద్దకు గురువారం తీసుకొచ్చారు. శివసత్తి వద్ద పూజలు చేసిన తర్వాత తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో బయ్యారంలోని పాకాలేటి బ్రిడ్జి వద్ద రూపాయి నాణెంతోపాటు నిమ్మకాయను ఏటిలో వేసేందుకు ఆటోను నిలిపారు. సరిత ఆటో దిగి కుమారుడిని వాగులో విసిరేసింది. ఆ తర్వాత ఆమె సైతం దూకేందుకు ప్రయత్నించగా తల్లి, అత్త, ఆడపడుచు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా అభం శుభం తెలియని చిన్నారి కానరాని లోకాలకు వెళ్లాడు. ఓ వైపు మనవడు..మరో వైపు కన్నబిడ్డ.. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సరిత తల్లి పద్మ నోటివెంట మాటరాని పరిస్థితి. ఓ వైపు మతిస్థిమితం లేని బిడ్డ తన కొడుకును చే తులారా ఏటిలో పడేయడం, ఆ తర్వాత త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కన్నబిడ్డ షాక్‌కు గురై స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆమె రోదించింది. -
స్టీల్ప్లాంట్ల నిర్మాణం పరిశీలనలో ఉంది : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ల నిర్మాణం సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టులో కేంద్రం అఫడవిట్ దాఖలు చేయడంపై ఉభయ తెలుగురాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తం అయింది. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా కడప, బయ్యారంలలో స్టీల్ ప్లాంట్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్టీల్ ప్లాంట్ల నిర్మాణంపై 2016లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులను టాస్క్ ఫోర్స్‌గా నియమించారు. ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పలుమార్లు సమావేశం అయింది. ఈ నెల 12 తేదీన కూడా మరోసారి సమావేశం జరిగింది. స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై మెకాన్‌తో కలిసి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఫిజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయాలని కోరినట్లు ఉక్కు మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్థిక సమస్యలను చక్కదిద్దేందుకు యత్నిస్తున్నట్లు తెలిపింది. -
‘సెల్ఫీ’ కోసం వెళ్లి..
బయ్యారం(ఇల్లెందు): దీపావళి పండుగ సెలవుల్లో సరదాగా చెరువు అందాలు చూసేందుకు వచ్చారు... అలుగు వద్ద సెల్ఫీ దిగేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఒకరు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోగా.. అతడిని కాపాడేందుకు మరొకరు నీటిలో దూకారు. అయితే, ఇద్దరూ నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్ద చెరువు వద్ద బుధవారం జరిగింది. మహబూబాబాద్‌కు చెందిన ఏరుపుకొండ జయరాజు(18) తన సోదరి శ్రావణి.. నాగెళ్ల ప్రేమ్‌భరత్(17) తన సోదరి భావనతో పాటు వారి స్నేహితులు జయంత్, సందీప్‌లు పెద్ద చెరువు అందాలను చూసేందుకు బుధవారం వచ్చారు. వారంతా మొదటి అలుగు వద్ద సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ్‌భరత్ ప్రమాదవశాత్తు నీటిలో జారి పడ్డాడు. అతడిని రక్షించేందుకు జయరాజు తనవద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను మరో స్నేహితుడు జయంత్‌కు ఇచ్చి వెంటనే నీళ్లలో దూకాడు. ఈ సమయంలో ప్రేమ్‌భరత్ జయరాజును గట్టిగా పట్టుకోవడంతో ఇరువురు నీళ్లలో గల్లంతయ్యారు. తమ్ముళ్లు నీటిలో మునిగిపోవడం చూసిన పైన ఉన్న వారు కేకలు వేసినప్పటికీ సమీపంలో ఎవరూ లేకపోవడంతో రక్షించలేకపోయారు. -
మద్యం కాటన్లు స్వాధీనం
బయ్యారం:అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఓ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున సోదాలు నిర్వహించిన పోలీసులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలను స్వాధీనం చేసున్నారు. ఇందుకు బాద్యులైన ఇద్దరిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. -
బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లా బయ్యారంలో సాధారణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ఉక్కు శాఖ సూత్రప్రాయ అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఛత్తీస్‌గఢ్ తరహాలో పీపీపీ విధానంలో ప్లాంటు ఏర్పాటు చేయవచ్చన్నారు. బయ్యారంలో లభించే ఇనుప ఖనిజం (ముడి సరుకు)లో నాణ్యత లేనందున విశాఖ తరహా భారీ స్టీలు ప్లాంటు సాధ్యం కాదన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌తో ఈ అంశంపై దత్తాత్రేయ సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తగిన సర్వే చేసి ఈ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. జాతీయ రూర్బన్ మిషన్ కింద రంగారెడ్డి జిల్లాలోని అల్లాపూర్, మెదక్ జిల్లాలోని రాయికల్, నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, ఆదిలాబాద్ జిల్లాలోని సారంగపల్లి ప్రాంతాలను మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపిక చేశారని దత్తాత్రేయ వివరించారు. -
బయ్యారంలో మారిన సరిహద్దులు
బయ్యారం : నూతన జిల్లాల ఏర్పాటులో బయ్యారం ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్నప్పుడు బయ్యారం మండలానికి దక్షిణం వైపున వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, కొత్తగూడ మండలాలు సరిహద్దుగా ఉండేవి. ప్రస్తుతం బయ్యారం మండలం దక్షిణాన ఉన్న మహబూబాబాద్ జిల్లాలో కలువగా తూర్పున ఉన్న ఇల్లెందు మండలం భద్రాద్రి జిల్లాలో కలిసింది. దీంతో రెండు ప్రాంతాలు వేర్వురు జిల్లాల్లోకి వెళ్లాయి. మండలంలోని నామాలపాడు సమీపంతో పాటు పాఖాలకొత్తగూడ సరిహద్దులో ఉన్న మిర్యాలపెంట గ్రామం భద్రాద్రి జిల్లాకు హద్దుగా మారింది. గతంలో ఉప్పలపాడు పంచాయతీలోని లకీ‡్ష్మనర్సింహపురం గ్రామంలో రహదారికి తూర్పు వైపున ఉన్న ఇళ్లు ఖమ్మం జిల్లాలో ఉండగా దక్షిణం వైపున ఉన్న ఇళ్లు వరంగల్ జిల్లాలో ఉండేవి. ప్రస్తుతం ఆ గ్రామానికి జిల్లా సరిహద్దులు మారగా మండల హద్దులు మాత్రం అలానే ఉన్నాయి. బయ్యారం మండలం నూతన జిల్లాలోకి మారినప్పటికీ పాత సంప్రదాయం ప్రకారం ఇతర జిల్లాకు హద్దుగా మారడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు -
ఊరిస్తున్న ‘ఉక్కు’!
పట్టాలెక్కని పరిశ్రమ అధ్యయనానికి మరో కమిటీ తొలుత రెండు బృందాల సర్వే రూ.30వేల కోట్ల ప్రాజెక్టుకు ముహూర్తమెప్పుడో..? సాక్షిప్రతినిధి, ఖమ్మం : బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఊరిస్తోంది. కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా.. పరిశ్రమ నిర్మాణం మాత్రం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెరుుల్) బృందం రెండున్నరేళ్ల క్రితం కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి ప్రభుత్వాలకు నివేదిక అందజేసింది. దీనిపై స్పందించని కేంద్రం.. తాజాగా మళ్లీ అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎప్పుడు పునాదులు పడతాయోనని ఆ ప్రాంతవాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆధారమైన ముడి ఇనుప ఖనిజం జిల్లాలో పుష్కలంగా ఉంది. నిక్షేపాలు నిక్షిప్తమైన ఉన్న ప్రాంతంలోనే కర్మాగారం ఏర్పాటు చేయాలని జిల్లావాసులతోపాటు రాజకీయ పక్షాలు కొన్నేళ్లుగా నినదిస్తున్నారుు. అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీలు గుప్పిస్తున్నారుు. ఉమ్మడి రాష్ట్రంలో 2014, మే 21, 22 తేదీల్లో ఎనిమిది మంది సభ్యులతో కూడిన సెరుుల్ బృందం గార్ల, బయ్యారంలో పర్యటించి.. ఇనుప ఖనిజాలున్న భూములను పరిశీలించింది. బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో ముడి ఇనుప ఖనిజంతోపాటు సంబంధిత ఖనిజాలు అపారంగా నిక్షిప్తమై ఉన్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సెరుుల్ బృందం నివేదిక అందజేసింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వాలకు నివేదికను పంపింది. బయ్యారంలో 25,700 హెక్టార్లు, గార్లలో 18,330 హెక్టార్లు, నేలకొండపల్లిలో 12,660 హెక్టార్లలో ముడి ఇనుప ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. అలాగే కారేపల్లి మండలం మాదారంలో 20 కిలోమీటర్ల మేరకు డోలమైట్ విస్తరించి ఉంది. నల్లగొండ జిల్లాలో సున్నపురారుు(లైమ్‌స్టోన్) అందుబాటులో ఉందని.. బయ్యారం నుంచి ఇక్కడి గనులకు 90 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు జిల్లా అధికారులు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. బయ్యారం నుంచి ఇటు సికింద్రాబాద్, అటు విజయవాడ వెళ్లేందుకు రైలు మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించారు. స్టీల్ ప్లాంట్‌లో ముడి ఇనుమును శుద్ధి చేసేందుకు ప్రధానంగా నీరు అవసరం. అరుుతే బయ్యారం మండలానికి సమీపంలో ఎక్కడెక్కడ నీటి వనరులున్నాయో అధికారులు నివేదించారు. హైదరాబాద్‌లోని హైడ్రాలజీ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదికలో ప్రతిరోజు ప్లాంట్‌కు 5,000 క్యూబిక్ మీటర్ల(49 క్యూసెక్కులు) నీటి అవసరం ఉంటుందని, దీని ప్రకారం కొన్ని నీటి వనరులను జిల్లా అధికారులు ప్రతిపాదించారు. పామర్ కంపెనీ పరిశీలన ఏడాదిన్నర క్రితం గార్ల, బయ్యారంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పామర్ కంపెనీ ప్రతినిధుల బృందం ఇనుప ఖనిజం నిల్వలున్న భూములు, అధికారులు స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన భూములను పరిశీలించింది. గార్ల మండలం శేరిపురం, బయ్యారం మండలం ధర్మాపురంలో బృందం పర్యటించింది. ప్రభుత్వం పరిశ్రమ నిర్మాణం కోసం తమకు భూములు కేటారుుస్తే ఉక్కు కర్మాగారంతోపాటు థర్మల్ ప్రాజెక్టును నిర్మిస్తామని కంపెనీ బృందం ప్రకటించింది. దీంతో అసలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ సెరుుల్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతుందా.. లేక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తుందా..? అనేది అప్పట్లో చర్చ జరిగింది. కేంద్రం.. రాష్ట్రానికి చేయూతనివ్వకపోతే భారీ ఎత్తున నిధుల సమీకరణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేసుకుంటుందనేది ప్రశ్నార్థకంగా మారింది. పునాది పడేదెప్పుడు..? ఏళ్లతరబడి ఊరిస్తున్న బయ్యారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. అరుుతే ఇటు సెరుుల్ అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్రానికి అందజేసినా.. కేంద్రం మాత్రం చూస్తాం.. చేస్తాం అంటూ కాలయాపన చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణంపై చురుకుగా ముందుకెళ్లకపోవడంతో.. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నారుు. మంగళవారం ఉక్కు మంత్రిత్వ శాఖ ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇంకెన్నాళ్లు సర్వేలు, అధ్యయనాలతో కాలయాపన చేస్తారని ఇక్కడి ప్రాంతవాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
బయ్యారం ఉక్కు.. ఖమ్మం హక్కు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు గార్ల: బయ్యారం ఉక్కు ఖమ్మం జిల్లా హక్కు అయినందున గార్ల, బయ్యారం మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోద్బలంతోనే ఇల్లెందు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ మూడు ముక్కలు చేశారని విమర్శించారు. ఖమ్మానికి 80 కిలోమీటర్ల దూరంలోగల సత్తుపల్లిని, దగ్గరలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కలపకుండా ఖమ్మం జిల్లాలో కలపడం వెనుక మంత్రి తుమ్మల స్వార్థం ఉందన్నారు. ఖమ్మానికి కేవలం 29 కిలోమీటర్ల దూరంలోగల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఇనుపరాయి, బైరైటీస్ ఖనిజాలు గల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలిపితే అక్కడి సంపదను ఖమ్మం జిల్లా కోల్పోయినట్టవుతుందని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు 60వేల ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు. అందుకే, ఆ రెండు మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, నాయకులు ధరావత్ సక్రు, గుగులోత్ హరి, బి.ఈర్య, టి.రవి తదితరులు పాల్గొన్నారు.