విద్యార్థినితో మాట్లాడుతున్న ఎస్సై మురళీధర్
బయ్యారం : హాస్టల్ నుంచి తప్పించుకోవటమే గాకుండా తన మాటలతో పలువురిని బురిడి కొట్టిద్దామనుకున్న ఓ విద్యార్థిని చివరకు తల్లిదండ్రులు, పాఠశాల నిర్వాహకుల చెంతకు చేరింది. ఈ ఘటన శనివారం బయ్యారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బయ్యారంలోని ఏకలవ్య రెసిడెన్షీయల్ పాఠశాలలో మరిపెడ మండలం అబ్బాయిపాలెంకు చెందిన మానపాటి మల్లయ్య తన కుమార్తె భానును ఐదవతరగతిలో ఇటీవల జాయిన్ చేశారు.
అయితే తల్లిదండ్రులను వదిలి పాఠశాలలో ఉండేందుకు ఇబ్బంది పడిన భాను ఉదయం పాఠశాల గేటు నుంచి టీచర్ల కండ్లుగప్పి బయటకు వచ్చి పరుగున గాంధీసెంటర్‌కు చేరుకుంది. ఇంతలో అటు వైపు నుంచి బస్టాండ్ సెంటర్‌కు వెళ్తున్న ఆటోను ఆపిన భాను అబ్బాయిపాలెం వెళ్లాలని డ్రైవర్‌కు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన ఆటోడ్రైవర్ బస్టాండ్ సెంటర్‌లో ఆటో నుంచి దింపాడు. తనను శుక్రవారం నలుగురు వ్యక్తులు కారులో బయ్యారం తీసుకొచ్చారని, తాను వారి నుంచి తప్పించుకొని వచ్చినట్లు బురిడి కొట్టించడానికి ప్రయత్నించింది.
దీంతో ఆ బాలిక చెప్పిన మాటలు నిజమేనని నమ్మిన స్థానిక ఆటోడ్రైవర్లు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్‌స్టేషన్‌లో బాలికకు ఎస్సై మురళీధర్ కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు అడుగగా తాను పాఠశాలలో ఉండేందుకు ఇష్టం లేక ఇంటికి వెళ్లేందుకు వచ్చానని అసలు విషయం తెలిపింది. దీంతో ఎస్సై బాలిక తల్లిదండ్రులతో పాటు పాఠశాల నిర్వాహకులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. మొత్తానికి సినీ ఫక్కిలో చిన్నారి చెప్పిన కథ స్థానికులను ఆందోళనకు గురిచేసినా ఆ తరువాత అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు.
Comments
Please login to add a commentAdd a comment