
కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న కేసీఆర్. చిత్రంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకానుంది.
స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కమిటీ
కేంద్ర మంత్రి తోమర్‌తో సీఎం కేసీఆర్ భేటీలో నిర్ణయం
ప్రాజెక్టు ఏర్పాటుపై సంయుక్త అధికారులతో పరిశీలన
60 రోజుల్లో నివేదిక, అనంతరం తుది నిర్ణయం
లాభదాయకం కాదన్న గత నివేదికను ప్రస్తావించిన తోమర్
రాష్ర్టం చాలా ఆశలు పెట్టుకుందని ముఖ్యమంత్రి వివరణ
దామరచర్ల విద్యుత్ ప్లాంటుకు పర్యావరణ అనుమతులు
మంత్రి జవదేకర్ పచ్చజెండా, ప్రాణహితకూ సానుకూలం
ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మతోనూ భేటీ
నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ
వైద్య కళాశాలల ఏర్పాటుపై మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున అధికారులతో ఏర్పడే ఈ కమిటీ.. స్థానిక పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై 60 రోజుల్లో నివేదిక ఇస్తుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడి ఉద్యోగ్‌భవన్‌లో తోమర్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకుపైగా పలు అంశాలపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో గతంలో అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. అక్కడి ముడి ఖనిజంలో నాణ్యత లేదని, ప్లాంటు ఏర్పాటు లాభదాయకం కాదని ఆ కమిటీ తేల్చినట్లు చెప్పారు. నివేదికలోని ఇతర అంశాలను కూలంకషంగా వివరించారు. అయితే ప్లాంట్ ఏర్పాటు సాధ్యంకాదనడం సరికాదని, ఒక్క లాభదాయకతే చూడడం భావ్యం కాదని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నట్టు సమాచారం. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, ఇతర మౌలిక వసతులన్నీ రాష్ట్రం కల్పిస్తుందని, ప్లాంటు తప్పనిసరిగా ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం గట్టిగా కోరారు. దీంతో మరోసారి పరిశీలన కోసం టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నిర్ణయించారు. ఈ భేటీ అనంతరం తోమర్ మీడియాతో మాట్లాడారు. ‘దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉంది. బయ్యారం ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఆ నివేదిక వచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకుంటాయి. తెలంగాణ రాష్ట్రానికి, అక్కడి ప్రజలకు మంచి చేసేందుకు, అవసరమైన సహకారం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అయితే భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో చాలా అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి, 60 రోజుల్లోనే తుది నివేదిక వచ్చేలా చూడాలని మేం నిర్ణయించాం. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్టును చేపడతారా లేదా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం త రఫున కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. అవన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని 60 రోజుల్లో తేల్చుతామని చెప్పారు’ అని సీఎం తెలిపారు. టాస్క్‌ఫోర్స్ నివేదిక వచ్చిన వెంటనే బయ్యారం ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు మొదలవుతాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. వెనుకబడిన ప్రాంతమైన బయ్యారం ప్రజలకు మేలు చేసేందుకు తన వంతు కృషి చే స్తానన్నారు. అయితే వీలైనంత త్వరగా వేలం వేసేందుకు గనులను గుర్తించాలని కేసీఆర్‌ను తోమర్ కోరారు. గనుల వేలానికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలు రూపొందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో కేసీఆర్, దత్తాత్రేయతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు డా.వేణుగోపాలచారి, రామచంద్రు తేజావత్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి జవదేకర్‌తోనూ భేటీ
తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పర్యావరణ అనుమతులను వీలైనంత త్వరగా వచ్చేలా చూడాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను ముఖ్యమంత్రి కోరారు. పార్టీ ఎంపీలు, రాష్ట్ర మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో సహా పలువురు ముఖ్య అధికారులతో కలిసి కేంద్ర మంత్రిని కేసీఆర్ కలిశారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో ఏర్పాటు చేయనున్న 6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టునకు పర్యావరణ అనుమతులు కోరారు. ఈ ప్లాంటుకు రిజర్వ్ ఫారెస్టులో ఉన్న కొంత భూమి అవసరమవుతోందని, దానికి ప్రత్యామ్నాయంగా 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నమని కేసీఆర్ చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన జవదేకర్.. దామరచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తున్నట్టు మౌఖికంగా చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయాన్ని కూడా ప్రస్తావించగా.. 40 హెక్టార్ల భూమి వరకు అవసరమైన పర్యావరణ అనుమతులు రాష్ట్రస్థాయిలోనే వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీనిపై ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అన్ని అనుమతులు వీలైనంత తర్వగా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేకంగా వచ్చి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ హెచ్‌ఎస్ బ్రహ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గాల పునర్విభజన, ఇతర అంశాలపై గంటకుపైగా చర్చించారు. అనంతరం నిర్మాణ్‌భ వన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతోనూ కేసీఆర్ భేటీ అయ్యారు. దత్తాత్రేయతోపాటు రాష్ర్ట ఆరోగ్య మంత్రి లక్ష్మయ్య కూడా సీఎం వెంట ఉన్నారు.
బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులివ్వండి
హైదరాబాద్ శివారులోని బీబీనగర్‌లో స్థాపించే ఎయిమ్స్ ఏర్పాటుపై జేపీ నడ్డాతో కేసీఆర్ చర్చించారు. ఇదివరకే నిర్మించిన భవనాలు, దాదాపు 200 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని, ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని కోరారు. ఇక్కడే మరో 100 ఎకరాల్లో నర్సింగ్, డెంటల్ తదితర కళాశాలలను ఏర్పాటు చేస్తూ హెల్త్‌సిటీగా మార్చనున్నట్టు వివరించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మీడియాకు తెలిపారు. స్వైన్‌ఫ్లూపై అడిగిన వెంటనే స్పందించినందుకు కేంద్ర మంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో కేంద్రానికి సహకరించిన కేసీఆర్‌ను నడ్డా అభినందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ రూ. వెయ్యి కోట్లతో స్థాపించబోయే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫార్మస్యూటికల్ సెన్సైస్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు వంద ఎకరాల స్థలం ఇస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందుకు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు ఇచ్చేందుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అలాగే త్వరలో తెలంగాణను 26 జిల్లాలుగా చేస్తున్నందున జిల్లాకో ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలను నీతిఆయోగ్ సమావేశంలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని నడ్డా హామీ ఇచ్చారు.