ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్ : బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపించాలని సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఆందోళన నేపథ్యంలో బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ మేరకే ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. బయ్యారంలో లక్ష ఎకరాలకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు, దీనికి కావాల్సిన మరో ముడి ఇంధనం డోలమైట్ 20 కిలోమీటర్ల దూరంలో మాదారంలో ఉందని తెలిపారు.
బయ్యారం చెరువు, మున్నేరు ద్వారా కావాల్సిన నీరు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. బయ్యారానికి ప్రధాన రైల్వేమార్గం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు 20, 30 కిలోమీటర్ల దూరంలోనే లభిస్తుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమను బయ్యారంలో వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సెయిల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన పేరుతో రాజకీయ వత్తిడిల మాటున బయ్యారం ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే ఆలోచన సమంజసం కాదన్నారు. పాల్వంచలో గతంలో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి తప్ప బయ్యారంలో ప్రతిపాదించిన ఫ్యాక్టరీని అక్కడకు తరలించడం సరి కాదన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కెచ్చెల రంగయ్య, అరుణోదయ నాగన్న, గోకినేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
తరలిస్తే సహించం : టీఆర్‌ఎస్
ఇల్లెందు : బయ్యారంలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమను జిల్లాలోని ఇతర ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నియోజకవర్గ కన్వీనర్ ఊకె అబ్బయ్య అన్నారు. ఇల్లెందులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లుగా నిర్వహించిన పోరాటం ఫలితంగాా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, పలు కారణాలు సాకుగా చూపి ఈ పరిశ్రమను కొత్తగూడెం మండలానికి తరలించే యత్నం చేయడం సరికాదని అన్నారు. ఇదే జరిగితే ఇక్కడి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు.
కొత్తగూడెం మండలం రేగళ్ల ప్రాంతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, పాల్వంచలో రేణుకా చౌద రి భూములు ఉన్నాయని తెలిపారు. పీవీ కుటుంబంతోపాటు రేణుకా చౌదరికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమను అక్కడ స్థాపించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టే నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఈ అంశాన్ని పరిశీలించి ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి మండలాల సరిహద్దులో స్టీల్ పరిశ్రమను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు పులిగండ్ల మాదవరావు, లాకావత్ దేవీలాల్ నాయక్, కౌన్సిలర్ జానీపాషా, కంభంపాటి కోటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బయ్యారంలోనే ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కోరం
బయ్యారం : ఉక్కు పరిశ్రమను బయ్యారంలోనే స్థాపించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇనుపరాయి గనులున్న బయ్యారం మండలంలో అన్ని వనరులున్నప్పటికీ కొందరు ఇతర ప్రాంతంలో పరిశ్రమను నిర్మించే ప్రయత్నాలు చేయటం తగదన్నారు. విలేకరుల సమావేశంలో మూల మదుకర్‌రెడ్డి, ఎనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఉక్కు పరిశ్రమ బయ్యారంలోనే స్థాపించాలి
Published Fri, May 23 2014 2:38 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement