potu ranga rao
-
‘బొటనవేలు దెబ్బకు ప్రతికారం తీర్చుకుంటాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపే క్రమంలో తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, అరెస్టు సందర్భంగా దాడిని ఖండిస్తున్నామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ జేఏసీ సమావేశం నిర్వహించారు. అఖిల పక్ష నాయకులుంతా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి దుర్మార్గానికి నిన్నటి ప్రెస్‌మీట్ పరాకాష్ట అని దుయ్యబట్టారు. ప్రశ్నలు అడిగే వారిపై ముఖ్యమంత్రి దబాయించారు కానీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో అన్ని అసత్యాలు, అర్ధ సత్యాలే మాట్లాడారని, వీధి నాయకుడి తరహాలో కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. ఆర్టీసీకి చట్ట ప్రకారం ఇచ్చే దాని కంటే చాలా తక్కువ ఇచ్చారని, సంస్థ నష్టాలకు కారణం కార్మికులే కారణం అనడం దురదృష్టకరమన్నారు. పేదవారి రవాణాకు ఆర్టీసీ తప్ప వేరే మార్గం లేదని, ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమం వదిలి కేసీఆర్ ప్రైవేటు సంస్థ యజమానిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో అందరినీ ఏకం చేసేలా మాట్లాడారని, అన్ని పక్షాలు ఏకతాటిపైకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బోటన వేలు గురుదక్షిణ తీసుకున్నట్టు..కుట్రపూరితంగా దొర కేసీఆర్... దక్షిణగా రంగారావు వేలు తీసుకున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ ఎంఎల్(న్యూ డెమోక్రసీ) కేసీఆర్‌తో కలిసి పోరాటం చేసిన పార్టీ అని, ఉద్యమ సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో కేసీఆర్‌కు అండగా ఉన్నది పోటు రంగారావేనని గుర్తు చేశారు. బొటనవేలు దెబ్బకు ప్రతీకారం తీర్చుకుంటామని, సమ్మెను ముందుకు తీసుకెళ్తామన్న కార్మికులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అలాగే ‘ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా, కోర్టు మాటలు పట్టించుకునే అవసరం లేనట్టు మాట్లాడారు. యూనియన్లను సహించం..దరఖాస్తులు చేసుకుంటే ఉద్యోగులను చేర్చుకోవడంపై ఆలోచిస్తా అని అంటున్నారు. మోటారు వాహన చట్టం అమలు చేస్తామనడం విజ్ఞత గల ముఖ్యమంత్రికి తగదు. హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంతోనే ఇలా గర్వంతో మాట్లాడుతున్నారు. ఆర్టీసీనే కాదు టీఎన్జీవో, టీజీవోలు భ్రమలో ఉన్నారు. యూనియన్లు నన్నేమీ చేయడం లేదన్నట్టుగా మాట్లాడారు’ అని కేసీఆర్ మాట్లాడిన తీరుపై తమ్మినేని మండిపడ్డారు. పోలీసులు చర్యను చరిత్ర క్షమించదు పోటు రంగారావు వేలు పోయేలా చేసిన కేసీఆర్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమై ఆర్టీసీ పోరాటంలోకి దిగామని, కార్మికుల పట్ల పోలీసుల చర్యలను చరిత్ర క్షమించబోదని పేర్కొన్నారు. ఉద్యమకారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, రేపటి నుంచి నిరవదిక దిక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరు తెలంగాణ వచ్చాక హిట్లర్, నిజాం వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని సీపీఐ ఎంఎల్ సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. హుజూర్నగర్ గెలుపు ధీమాతో మాట్లాడిన మాటలు రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టిపారేశారు. కార్మికుల ఉధ్యమాన్ని చెడగొట్టేందుకే ఈ వ్యాఖ్యలు చేసారని, ధన.. అధికార బలంతో హుజూర్నగర్ ఎన్నికలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను బానిసలుగా మర్చే ప్రమాదం ఉందని ఆరోపించారు. ప్రశ్నించే సమాజాన్ని కేసీఆర్ భరించలేక పోతున్నారని, ఆదే ఆయన పరిపాలించేందుకు అర్హుడు కాదన్నది తేలిందన్నారు. ఉడుత బెదిరింపులకు కార్మికులు భయపడరని ఎద్దేవా చేశారు. పశువులను తీసుకెళ్లే వ్యాన్‌లో ఉధ్యమకారులను తరలిస్తున్నారని మండిపడ్డారు. నరహంతక విధానాలను ఎదిరించి పోరాటం కొనసాగిస్తామని, యూనియన్ లకు వ్యతిరేకంగా మాడుతున్న కేసీఆర్ తీరును ప్రతిగటించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ సమ్మె : తెగిపడ్డ బొటనవేలు
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో వామపక్షాలు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐఎంఎల్ నేత పోటు రంగారావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, విమలక్కలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు వాహనంలో ఎక్కించే క్రమంలో పోటు రంగారావు చేతి బొటనవేలు తెగిపోయింది. రెండు తలుపుల మధ్య వేలు పెట్టి కట్ చేశారని రంగారావు ఆరోపించారు. కేసీఆర్ నన్ను చంపమన్నాడా? అని పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు, ఇప్పుడు కార్మికుల పక్షాన నిలబడి పోరాడినందుకు ఇది నాకు బహుమానమా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు బస్ భవన్‌ను ముట్టండించేదుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి నేతలను కూడా అరెస్ట్ చేశారు. -
కోస్టల్ కారిడార్ కోసమే ‘పోలవరం’
భద్రాచలం టౌన్: కోస్టల్ కారిడార్ నిర్మాణం కోసమే సీమాంధ్ర నాయకులు పోలవరం ప్రాజెక్టును తలకెత్తుకున్నారని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ముంపు మండలాల విలీన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా భద్రాచలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు బుధవారం ఆరోరోజుకు చేరాయి. దీక్ష శిబిరాన్ని పోటు రంగారావు బుధవారం సందర్శించి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... బడా పారిశ్రామికవేత్తల ఒత్తిడితోనే మోడీ సర్కారు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిం దన్నారు. ముంపుకు గురికాని 480 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రమైన సీలేరు ప్రాజెక్టును సీమాంధ్రకు కట్టబెట్టేందుకు మోడీ, వెంకయ్య నాయుడు ఆరాటపడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఆర్డినెన్స్‌తో సుమారు 200 కిలోమీటర్ల వరకు గోదావరి నీటిపై హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మహోద్యమంతో తెలంగాణను సాధిం చుకున్నట్టుగానే.. ముంపు మండలాలను కూడా రక్షించుకుందాం’’ అని అన్నారు. అనంతరం, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.రాజశేఖర్ మాట్లాడు తూ... ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని, ఇక్కడి ఉపాధ్యాయులకు ఆప్షన్ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం నాటి దీక్షలలో రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగులు జలసూత్రం సోమశేఖర్, దామల్ల రాజు, జె.సోమయ్య, జక్కం సుధీర్, ఎఎస్ఆర్.హనుమాన్, ఆర్.రమేష్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు రాధాకృష్ణ, బి.రాంబాబు, డి.రామకృష్ణ, ఎ.నాగరాజు, పి.నాగేశ్వరరావు, పి.వెంకటయ్య, వి.శ్రీను, ఎం.సత్యనారాయణ, ఎస్‌వివి.సత్యనారాయణ, డి.రామచంద్రప్రభు, ఎం.వెంకటేశ్వర్లు, ఐ.రాజాభాస్కర్, ఈశ్వరరావు తదితరులు కూర్చున్నారు. పలువురి సంఘీభావం దీక్ష శిబిరాన్ని డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారిణి కె.ఇందిర, పీఏసీఎస్ ఛైర్మన్ సంకా వెంకట నగేష్, నాయకులు షేక్ గౌసుద్దీన్, వెక్కిరాల రామకృష్ణ, బి.రామకృష్ణ, జి.బాలకృష్ణ, రేగలగడ్డ ముత్తయ్య, పరుచూరి (టీజేఏసీ), ఎంబి.నర్సారెడ్డి (సీపీఎం), ఎం.రామాచారి (టీఫీటీఎఫ్), బి.రాజు, ఎ.వెంకటేశ్వర్లు, టీవీస్, రాజా శ్రీను (యూటీఎఫ్), జపాన్‌రావు, తులసీదాసు (ఎస్టీఎఫ్), వట్టం నారాయణ దొర, గుండు శరత్, సోందె వీరయ్య (ఆదివాసీ సంఘాలు) తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. 48 గంటల బంద్‌కు అఖిలపక్షం పిలుపు ఆర్డినెన్స్ రద్దు డిమాండుతో గురు, శుక్రవారాల్లో 48 గంటల బందుకు బుధవారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కన్వీనర్ వట్టం నారాయణ, కో-కన్వీనర్ గుండు శరత్, నాయకులు కెచ్చెల రంగారెడ్డి (న్యూడెమోక్రసీ), బొలిశెట్టి రంగారావు (కాంగ్రెస్), మంత్రిప్రగడ నర్సింహారావు (వైఎస్ఆర్ సీపీ), కొమరం ఫణీశ్వరమ్మ (టీడీపీ), ఎంబి.నర్సారెడ్డి (సీపీఎం), తాళ్ల రవికుమార్ (టీఆర్ఎస్), ఎవి.రావు (బీఎస్పీ), ఆవుల సుబ్బారావు (బీజేపీ), ఇతర సంఘాల నాయకులు బాదం జగదీష్, దాగం ఆదినారాయణ, దాసరి శేఖర్, మడివి నెహ్రూ, కారం వెంకటేశ్వర్లు, పడిసిరి శ్రీనివాస్, వెక్కిరాల శ్రీనివాస్, బాలకృష్ణ, పూసం రవికుమారి, షేక్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ బయ్యారంలోనే స్థాపించాలి
ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్ : బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపించాలని సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఆందోళన నేపథ్యంలో బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ మేరకే ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. బయ్యారంలో లక్ష ఎకరాలకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు, దీనికి కావాల్సిన మరో ముడి ఇంధనం డోలమైట్ 20 కిలోమీటర్ల దూరంలో మాదారంలో ఉందని తెలిపారు. బయ్యారం చెరువు, మున్నేరు ద్వారా కావాల్సిన నీరు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. బయ్యారానికి ప్రధాన రైల్వేమార్గం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు 20, 30 కిలోమీటర్ల దూరంలోనే లభిస్తుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమను బయ్యారంలో వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సెయిల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన పేరుతో రాజకీయ వత్తిడిల మాటున బయ్యారం ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే ఆలోచన సమంజసం కాదన్నారు. పాల్వంచలో గతంలో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి తప్ప బయ్యారంలో ప్రతిపాదించిన ఫ్యాక్టరీని అక్కడకు తరలించడం సరి కాదన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కెచ్చెల రంగయ్య, అరుణోదయ నాగన్న, గోకినేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తరలిస్తే సహించం : టీఆర్ఎస్ ఇల్లెందు : బయ్యారంలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమను జిల్లాలోని ఇతర ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నియోజకవర్గ కన్వీనర్ ఊకె అబ్బయ్య అన్నారు. ఇల్లెందులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లుగా నిర్వహించిన పోరాటం ఫలితంగాా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, పలు కారణాలు సాకుగా చూపి ఈ పరిశ్రమను కొత్తగూడెం మండలానికి తరలించే యత్నం చేయడం సరికాదని అన్నారు. ఇదే జరిగితే ఇక్కడి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కొత్తగూడెం మండలం రేగళ్ల ప్రాంతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, పాల్వంచలో రేణుకా చౌద రి భూములు ఉన్నాయని తెలిపారు. పీవీ కుటుంబంతోపాటు రేణుకా చౌదరికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమను అక్కడ స్థాపించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టే నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఈ అంశాన్ని పరిశీలించి ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి మండలాల సరిహద్దులో స్టీల్ పరిశ్రమను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పులిగండ్ల మాదవరావు, లాకావత్ దేవీలాల్ నాయక్, కౌన్సిలర్ జానీపాషా, కంభంపాటి కోటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలోనే ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కోరం బయ్యారం : ఉక్కు పరిశ్రమను బయ్యారంలోనే స్థాపించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇనుపరాయి గనులున్న బయ్యారం మండలంలో అన్ని వనరులున్నప్పటికీ కొందరు ఇతర ప్రాంతంలో పరిశ్రమను నిర్మించే ప్రయత్నాలు చేయటం తగదన్నారు. విలేకరుల సమావేశంలో మూల మదుకర్‌రెడ్డి, ఎనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.