The steel industry
-
ఉక్కు కర్మాగారం నిర్మించాలంటూ ర్యాలీ
వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువత సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగులు రాయచోటిపట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ..జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే పొందుపరిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరించి వైఎస్సార్ జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాయలసీమలో ఎర్రచందనం, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని వాటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కడపలో హైకోర్టు శాఖ ఏర్పాటు చేయడంతో పాటు, మూతపడిన నందలూరు ఆల్వీన్, చెన్నూరు చక్కెర, ప్రొద్దుటూరు పాల కర్మాగారాలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘ఉక్కు’ను ఆదుకుంటాం
విశాఖపట్నం: రాష్ట్రంలోనే ప్రధానమైన విశాఖ ఉక్కు పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుఫాన్ వల్ల స్టీల్‌ప్లాంట్‌కు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ఆయన శనివారం రాత్రి స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఈడీ (వర్క్స్) భవనంలో ఉక్కు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్‌ను కాపాడుకోవడం అత్యవసరమన్నారు. గతంలో ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా కాపాడామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విద్యుత్ కొరత ఉన్నప్పటికి ప్లాంట్‌కు ప్రాధాన్యత ఇచ్చి మొదట విద్యుత్ అందించామని సీఎం అన్నారు. ప్లాంట్‌ను డిజిన్వెస్ట్‌మెంట్ చేయకుండా చూడాలన్న కార్మిక సంఘాల విజప్తికి ఆయన సానుకూలంగా స్పంది స్తూ అలాంటివి ఉండవన్నారు. అంతకు ముందు అయన ప్లాంట్ కోక్ ఒవెన్స్‌కు చేరుకోని బ్యాటరీలను పరిశీలించారు. సీఎండీ పి.మధుసూదన్, డైరక్టర్(ఆపరేషన్స్) డి.ఎన్.రావు ఆయనకు బ్యాటరీల పనితీరు గురించి వివరించారు. మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌కు వెళ్ళి అక్కడి ఉద్యోగుల తో మాట్లాడారు. గాజువాక ఎమ్మెల్యే ప ల్లా శ్రీనివాసరావు, కార్మిక నాయకులు ఆదినారాయణ, ఎన్,రామారావు, మం త్రి రాజశేఖర్, గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, బొడ్డు పైడిరాజు, విల్లా రామ్మోహన్కుమార్ పాల్గొన్నారు. -
ఇక అభివృద్ధే ఆయుధం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో తొలి సద్దుల బతుకమ్మ నిమజ్జనం అయింది. పెత్రామావస్య రోజున తీరొక్కపూలతో కొలువుదీరిన తెలంగాణ ఆడబిడ్డ.. బతుకమ్మ తొమ్మిదిరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఆటలాడి సాగరంలో కలిసిపోయింది. ఇక... ‘శమీ శమయతే పాపం... శమీ శతృ వినాశనం...అర్జునస్య ధనుర్ధారి... రామస్య ప్రియదర్శనం...’ అనే శ్లోకంతో పాటు ప్రజలు తమ కోరికలను కూడా రాసి జమ్మిచెట్టుకు గుచ్చి పాలపిట్టను దర్శనం చేసుకునే కార్యమే మిగిలిపోయింది. విజయదశమి సందర్భంగా శుక్రవారం జిల్లా ప్రజానీకం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని దసరా పండుగ జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కోరికలు వ్యక్తిగతంగా ఏవైనా.. సామూహికంగా మాత్రం జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలని, కొత్త రాష్ట్రంలో కొత్త ఒరవడితో ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపడాలని ప్రజానీకం కోరుకుంటోంది. పాలనాపరంగా ఉండే బాలారిష్టాలతో పాటు ప్రకృతి సహకరించక అన్నదాతలు కొంత ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో నాడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని యుద్ధానికి బయలుదేరే ముందు జమ్మిచెట్టు వద్ద తమ ఆయుధాలకు పూజ చేసిన పాండవుల ఆచారాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి అనే ఆయుధాలను సంధించి విజయం సాధించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు, అధికారులు, పోలీస్ యంత్రాంగం, ప్రజలు అందరూ భాగస్వాములై జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం. ప్రణాళికాబద్ధంగా ముందుకు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో జిల్లాలోని అపారఖనిజ సంపద బంగారు భవిష్యత్తుపై కోటి ఆశలు రేకెత్తిస్తోంది. సహజసిద్ధమైన అటవీసంపదతో పాటు భూమాత గర్భం నుంచి వచ్చే సింగరేణి బొగ్గు, గలగల పారే గోదారి జలాలు, విస్తారమైన భూసంపద అన్నీ కలగలిపి జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాల్లో 50 శాతం విద్యుత్‌ను అందించే హబ్‌గా జిల్లాను రూపొందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమై యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో తొలిదశలో 2వేల మెగావాట్లు, మలిదశలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు బయ్యారం ప్రాంతంలో అపారంగా ఉన్న ముడి ఇనుము నిక్షేపాలను సద్వినియోగం చేసుకునే దిశలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా దాదాపు ఖాయమయింది. కేంద్రం ఇప్పటికే ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు తగిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది. వీటితో పాటు మన ఊరు - మన ప్రణాళికలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం శ్రమించి రూపొందించిన ఐదేళ్ల కార్యాచరణ కూడా జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మన ఊరు - మన ప్రణాళికలో భాగంగా జిల్లాలో రూ.6500 కోట్లతో ప్రయోగాత్మక ప్రతిపాదనలు చేసిన అధికారులు మౌలిక వసతుల కల్పన, సామూహిక ప్రయోజనాలపై దృష్టి పెట్టారు. రూ.50 కోట్లతో సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్, ప్రతి మండలంలోనూ ఇండస్ట్రియల్ ఎస్టేట్లకు రూ.150 కోట్లు, కొత్తగా 50వేల గృహాలు, కొత్త మెడికల్ కాలేజీ, 2 ఏరియా ఆస్పత్రుల ఉన్నతీకరణ, ఉద్యానవర్శిటీకి రూ.1000 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.700 కోట్లు, రూ.1072 కోట్లతో ఆర్అండ్బీ రోడ్లు, మండలానికో ధాన్యం గోడౌన్, నియోజకవర్గానికో వృద్ధాశ్రమం, ఖమ్మం నగరంలో కొత్త బస్టాండ్, ఇల్లెందులో బస్‌డిపో, రూ.1.5 కోట్లతో జిల్లా సైన్స్ మ్యూజియం... ఇలా అనేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో సగం పూర్తయినా జిల్లా అభివృద్ధి దిశలో ముందుకెళ్లనుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జిల్లాకు మంత్రి పదవి కూడా ఖాయమనే చర్చ జరుగుతోంది. త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం కల్పించనుండగా, ప్రభుత్వ పరంగా నామినేట్ చేసే పోస్టులపై కూడా జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల్లో ప్రాధాన్యం లభిస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. అయితే, ఈ అభివృద్ధి రైలు పట్టాలెక్కి దూసుకెళ్లాలంటే అన్ని వర్గాల్లోనూ చిత్తశుద్ధి అవసరం. అటు అధికార యంత్రాంగం, జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజలు సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉంది. కష్టమే అయినా... ఇక, వర్షాలు లేక జిల్లా రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనివార్య పరిస్థితుల్లో విధిస్తున్న విద్యుత్‌కోతలు రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. ప్రకృతి కరుణించక వర్షాల లేమితో పంటలను వేయలేకపోయిన రైతాంగం వేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో రైతన్నల పరిస్థితి కష్టంగానే ఉన్నా.. భవిష్యత్తు బాగుంటుందనే అశతో ముందుకెళుతున్నారు. వీరిపక్షాన నిలిచి ప్రభుత్వ పరంగా రావాల్సిన సౌకర్యాలను అందించేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా మంచి కృషే చేస్తున్నాయి. విజయదశమి స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాల ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండడం కూడా శుభపరిణామమే. ఇక, జిల్లా మహిళాలోకంలో కొత్త సందడి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చిత్తూ చిత్తూల గుమ్మ... శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల ఉత్సవాలు అంబరాన్నంటడంతో మహిళల్లో ఉత్సాహం నెలకొంది. బతుకమ్మ దీవెనలతో జిల్లా అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తుందని మహిళాలోకం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో విజయదశమి పర్వదినం జిల్లా వాసులకు సుఖసంతోషాలు పంచాలని, జిల్లా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. -
ఉక్కు పరిశ్రమ బయ్యారంలోనే స్థాపించాలి
ఖమ్మంసిటీ, న్యూస్‌లైన్ : బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపించాలని సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ఆందోళన నేపథ్యంలో బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామని గత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ మేరకే ఫ్యాక్టరీ నిర్మించాలన్నారు. బయ్యారంలో లక్ష ఎకరాలకు పైగా ఐరన్ ఓర్ నిల్వలు, దీనికి కావాల్సిన మరో ముడి ఇంధనం డోలమైట్ 20 కిలోమీటర్ల దూరంలో మాదారంలో ఉందని తెలిపారు. బయ్యారం చెరువు, మున్నేరు ద్వారా కావాల్సిన నీరు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. బయ్యారానికి ప్రధాన రైల్వేమార్గం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు 20, 30 కిలోమీటర్ల దూరంలోనే లభిస్తుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమను బయ్యారంలో వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. సెయిల్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన పేరుతో రాజకీయ వత్తిడిల మాటున బయ్యారం ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చే ఆలోచన సమంజసం కాదన్నారు. పాల్వంచలో గతంలో నిర్మించిన స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలి తప్ప బయ్యారంలో ప్రతిపాదించిన ఫ్యాక్టరీని అక్కడకు తరలించడం సరి కాదన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కెచ్చెల రంగయ్య, అరుణోదయ నాగన్న, గోకినేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తరలిస్తే సహించం : టీఆర్ఎస్ ఇల్లెందు : బయ్యారంలో నిర్మించాల్సిన ఉక్కు పరిశ్రమను జిల్లాలోని ఇతర ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, నియోజకవర్గ కన్వీనర్ ఊకె అబ్బయ్య అన్నారు. ఇల్లెందులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లుగా నిర్వహించిన పోరాటం ఫలితంగాా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, పలు కారణాలు సాకుగా చూపి ఈ పరిశ్రమను కొత్తగూడెం మండలానికి తరలించే యత్నం చేయడం సరికాదని అన్నారు. ఇదే జరిగితే ఇక్కడి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కొత్తగూడెం మండలం రేగళ్ల ప్రాంతంలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, పాల్వంచలో రేణుకా చౌద రి భూములు ఉన్నాయని తెలిపారు. పీవీ కుటుంబంతోపాటు రేణుకా చౌదరికి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమను అక్కడ స్థాపించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టే నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ఈ అంశాన్ని పరిశీలించి ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి మండలాల సరిహద్దులో స్టీల్ పరిశ్రమను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పులిగండ్ల మాదవరావు, లాకావత్ దేవీలాల్ నాయక్, కౌన్సిలర్ జానీపాషా, కంభంపాటి కోటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలోనే ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే కోరం బయ్యారం : ఉక్కు పరిశ్రమను బయ్యారంలోనే స్థాపించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్ చేశారు. బయ్యారం పెద్ద చెరువు వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇనుపరాయి గనులున్న బయ్యారం మండలంలో అన్ని వనరులున్నప్పటికీ కొందరు ఇతర ప్రాంతంలో పరిశ్రమను నిర్మించే ప్రయత్నాలు చేయటం తగదన్నారు. విలేకరుల సమావేశంలో మూల మదుకర్‌రెడ్డి, ఎనుగుల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.