వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగార నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలంటూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువత సమాఖ్య ఆధ్వర్యంలో నిరుద్యోగులు రాయచోటిపట్టణంలో ర్యాలీ నిర్వహించి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ..జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే పొందుపరిచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరించి వైఎస్సార్ జిల్లాపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాయలసీమలో ఎర్రచందనం, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని వాటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. కడపలో హైకోర్టు శాఖ ఏర్పాటు చేయడంతో పాటు, మూతపడిన నందలూరు ఆల్వీన్, చెన్నూరు చక్కెర, ప్రొద్దుటూరు పాల కర్మాగారాలు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.