సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో తొలి సద్దుల బతుకమ్మ నిమజ్జనం అయింది. పెత్రామావస్య రోజున తీరొక్కపూలతో కొలువుదీరిన తెలంగాణ ఆడబిడ్డ.. బతుకమ్మ తొమ్మిదిరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఆటలాడి సాగరంలో కలిసిపోయింది. ఇక... ‘శమీ శమయతే పాపం... శమీ శతృ వినాశనం...అర్జునస్య ధనుర్ధారి... రామస్య ప్రియదర్శనం...’ అనే శ్లోకంతో పాటు ప్రజలు తమ కోరికలను కూడా రాసి జమ్మిచెట్టుకు గుచ్చి పాలపిట్టను దర్శనం చేసుకునే కార్యమే మిగిలిపోయింది.
విజయదశమి సందర్భంగా శుక్రవారం జిల్లా ప్రజానీకం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని దసరా పండుగ జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల కోరికలు వ్యక్తిగతంగా ఏవైనా.. సామూహికంగా మాత్రం జిల్లా సమగ్రాభివృద్ధి చెందాలని, కొత్త రాష్ట్రంలో కొత్త ఒరవడితో ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపడాలని ప్రజానీకం కోరుకుంటోంది.
పాలనాపరంగా ఉండే బాలారిష్టాలతో పాటు ప్రకృతి సహకరించక అన్నదాతలు కొంత ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో నాడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని యుద్ధానికి బయలుదేరే ముందు జమ్మిచెట్టు వద్ద తమ ఆయుధాలకు పూజ చేసిన పాండవుల ఆచారాన్ని కొనసాగిస్తూ అభివృద్ధి అనే ఆయుధాలను సంధించి విజయం సాధించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు, అధికారులు, పోలీస్ యంత్రాంగం, ప్రజలు అందరూ భాగస్వాములై జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడతారని ఆశిద్దాం.
ప్రణాళికాబద్ధంగా ముందుకు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో జిల్లాలోని అపారఖనిజ సంపద బంగారు భవిష్యత్తుపై కోటి ఆశలు రేకెత్తిస్తోంది. సహజసిద్ధమైన అటవీసంపదతో పాటు భూమాత గర్భం నుంచి వచ్చే సింగరేణి బొగ్గు, గలగల పారే గోదారి జలాలు, విస్తారమైన భూసంపద అన్నీ కలగలిపి జిల్లాను పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాల్లో 50 శాతం విద్యుత్‌ను అందించే హబ్‌గా జిల్లాను రూపొందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమై యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో తొలిదశలో 2వేల మెగావాట్లు, మలిదశలో 4వేల మెగావాట్ల సామర్థ్యం కల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
దీంతో పాటు బయ్యారం ప్రాంతంలో అపారంగా ఉన్న ముడి ఇనుము నిక్షేపాలను సద్వినియోగం చేసుకునే దిశలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కూడా దాదాపు ఖాయమయింది. కేంద్రం ఇప్పటికే ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు తగిన పనులు ప్రారంభం కావాల్సి ఉంది. వీటితో పాటు మన ఊరు - మన ప్రణాళికలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం శ్రమించి రూపొందించిన ఐదేళ్ల కార్యాచరణ కూడా జిల్లా వాసుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
మన ఊరు - మన ప్రణాళికలో భాగంగా జిల్లాలో రూ.6500 కోట్లతో ప్రయోగాత్మక ప్రతిపాదనలు చేసిన అధికారులు మౌలిక వసతుల కల్పన, సామూహిక ప్రయోజనాలపై దృష్టి పెట్టారు. రూ.50 కోట్లతో సాఫ్ట్‌వేర్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్, ప్రతి మండలంలోనూ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లకు రూ.150 కోట్లు, కొత్తగా 50వేల గృహాలు, కొత్త మెడికల్ కాలేజీ, 2 ఏరియా ఆస్పత్రుల ఉన్నతీకరణ, ఉద్యానవర్శిటీకి రూ.1000 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.700 కోట్లు, రూ.1072 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లు, మండలానికో ధాన్యం గోడౌన్, నియోజకవర్గానికో వృద్ధాశ్రమం, ఖమ్మం నగరంలో కొత్త బస్టాండ్, ఇల్లెందులో బస్‌డిపో, రూ.1.5 కోట్లతో జిల్లా సైన్స్ మ్యూజియం... ఇలా అనేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.
ఇందులో సగం పూర్తయినా జిల్లా అభివృద్ధి దిశలో ముందుకెళ్లనుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జిల్లాకు మంత్రి పదవి కూడా ఖాయమనే చర్చ జరుగుతోంది. త్వరలోనే జరగనున్న మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం కల్పించనుండగా, ప్రభుత్వ పరంగా నామినేట్ చేసే పోస్టులపై కూడా జిల్లా వాసులు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవుల్లో ప్రాధాన్యం లభిస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. అయితే, ఈ అభివృద్ధి రైలు పట్టాలెక్కి దూసుకెళ్లాలంటే అన్ని వర్గాల్లోనూ చిత్తశుద్ధి అవసరం. అటు అధికార యంత్రాంగం, జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాలు, ప్రజలు సమన్వయంతో ముందుకెళ్లాల్సి ఉంది.
కష్టమే అయినా...
ఇక, వర్షాలు లేక జిల్లా రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అనివార్య పరిస్థితుల్లో విధిస్తున్న విద్యుత్‌కోతలు రైతు కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. ప్రకృతి కరుణించక వర్షాల లేమితో పంటలను వేయలేకపోయిన రైతాంగం వేసిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది.
ఈ నేపథ్యంలో రైతన్నల పరిస్థితి కష్టంగానే ఉన్నా.. భవిష్యత్తు బాగుంటుందనే అశతో ముందుకెళుతున్నారు. వీరిపక్షాన నిలిచి ప్రభుత్వ పరంగా రావాల్సిన సౌకర్యాలను అందించేందుకు ప్రతిపక్ష పార్టీలు కూడా మంచి కృషే చేస్తున్నాయి. విజయదశమి స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాల ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండడం కూడా శుభపరిణామమే.
ఇక, జిల్లా మహిళాలోకంలో కొత్త సందడి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ‘చిత్తూ చిత్తూల గుమ్మ... శివుడీ ముద్దుల గుమ్మా’ అంటూ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల ఉత్సవాలు అంబరాన్నంటడంతో మహిళల్లో ఉత్సాహం నెలకొంది. బతుకమ్మ దీవెనలతో జిల్లా అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తుందని మహిళాలోకం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో విజయదశమి పర్వదినం జిల్లా వాసులకు సుఖసంతోషాలు పంచాలని, జిల్లా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.
ఇక అభివృద్ధే ఆయుధం
Published Fri, Oct 3 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM
Advertisement
Advertisement