
సాక్షి, మహబూబాబాద్: జలపాతాన్ని చూసి ఉల్లాసంగా గడుపుదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నిండింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కళ్లముందే నీట మునిగింది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. బయ్యారం మండల కేంద్రానికి చెందిన అంబటి సతీష్, శ్రీవిధ్య దంపతులు, కూతురు శివాని, కుమారుడు శివాజీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి చింతోని గుంపు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఫోటోలు దిగి సరదాగా గడిపారు.
(చదవండి: శ్రీనివాస్ చనిపోయాడు.. )
తిరిగి ఇంటికి వచ్చే సమయంలో శివానీ సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీట మునిగి ఆమె కనిపించకుండా పోయింది. సమాచారం అందుకున్న బయ్యారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. శివానీ ఆచూకీ లభించకపోవడం రెండు జేసీబీల సహాయంతో ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. దాంతో విగత జీవిగా మారిన శివానీ కనిపించింది. ఆమె యానిమల్ హజ్బెండరీలో డిప్లమా చేస్తున్నట్టు తెలిసింది. కళ్లముందే తమ బిడ్డ జల సమాధి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఈ సమయంలో వాటిని సందర్శించడం మంచిది కాదని పోలీసులు ప్రజలకు సూచించారు.
(చదవండి: ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ... )
Comments
Please login to add a commentAdd a comment