పచ్చని అడవి ఒడిలో సేదదీరుతున్నట్టుండే ఆ ఊరు ఎన్నో ఆదర్శాలకు మారుపేరు. ఆ ఊళ్లోని వారెవరూ మద్యం ముట్టరు. ఇప్పటివరకు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది లేదు. చిన్నా చితకా తగాదాలొచ్చినా.. కూర్చుని మాట్లాడుకుంటారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం గ్రామ ప్రత్యేకతలివీ..
సాక్షి, బయ్యారం: పూర్తిగా ఆదివాసీలుండే ఈ గ్రామంలో నేటికీ ఆచార వ్యవçహారాలు, కట్టుబాట్లు పక్కా కొనసాగుతున్నాయి. గ్రామ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ గ్రామస్తులెవరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది లేదు. తగాదాలొస్తే పెద్దమనుషుల సమక్షంలోనే పరిష్కరించుకుంటారు. పెద్దలు చెప్పే తీర్పునకు ఇరువర్గాలు కట్టుబడుతాయి. ఆదివాసీలు పెద్దలుగా భావించే పటేల్, దొరల తీర్పే నేటికి ఆ పల్లెవాసులకు వేదవాక్కు. గతంలో రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మొట్లతిమ్మాపురాన్ని ఇటీవల కొత్తగా పంచాయతీగా ఏర్పాటుచేశారు.
గ్రామస్తులు సర్పంచ్, వార్డుసభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుని ఆదర్శంగా నిలిచారు. పదేళ్లకు ముందు ఆ గ్రామంలో మిగతా గ్రామాల మాదిరిగానే సారా, మద్యం అమ్మకాలు జరిగేవి. పెద్దల నుంచి పిన్నల దాకా అంతా మద్యానికి బానిసలై.. తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఏకమై మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానించారు. అప్పటి నుండి గ్రామంలో మద్యం అమ్మకాల్లేవు. ఈ గ్రామస్తులు అన్నింటా చైతన్యాన్ని ప్రదర్శిస్తారు. అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఉపాధ్యాయులు విధులకు ఆలస్యంగా వస్తే నిలదీస్తారు. అందరూ అక్షరాలు నేర్చుకోవడంలో ముందున్నారు. గ్రామంలో 20 మందికిపైగా ఉన్నత విద్యావంతులు ఉన్నారు.
అందరికీ మరుగుదొడ్లు
మైదాన ప్రాంతంలోనే పూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణం జరగని పరిస్థితుల్లో అటవీ ప్రాంతంలో ఉన్న మొట్లతిమ్మాపురంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. గ్రామంలో 40 కుటుంబాలు ఉండగా అందరి ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ పల్లె బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఐకమత్యంగా ఉండే ఆ గ్రామంలో అన్ని రాజకీయపార్టీల సానుభూతిపరులు ఉన్నారు. ఎవరికి వారు తమ తమ పార్టీలకు మద్దతుదారులుగా ఉంటున్నా.. రాజకీయపరమైన విభేదాలు, పోటీల జోలికి వెళ్లరు. ఎన్నికలప్పుడు గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీనిచ్చే పార్టీ అభ్యర్థికే సమష్టిగా ఓట్లు వేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
ఒకచోట కూర్చొని సమస్యలను చర్చించుకుంటున్న గ్రామస్తులు
పోటీలేదు..
ఇతర పంచాయతీల్లో అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడి డబ్బు ఖర్చుపెట్టి పదవులు కొనుక్కొంటున్న పరిస్థితి.. అందుకు భిన్నంగా నాపై నమ్మకంతో గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నా. – బిజ్జ స్వరూప, సర్పంచ్
గ్రామస్తులు కలసికట్టుగా ఉంటారు
కొత్తగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పొందిన నాకు మొట్లతిమ్మాపురంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనకు గ్రామస్తులంతా సహకరిస్తున్నారు. వివాదాల జోలికి వెళ్లరు. సమస్య వస్తే ఒక దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటారు. ఊరిలో మద్యం అమ్మకాల్లేవు. – బానోత్ నరేష్, పంచాయతీ కార్యదర్శి, మొట్ల తిమ్మాపురం
రాజకీయాలతో సంబంధం లేదు
మా ఊర్లో అన్ని పార్టీల జెండాలు ఉన్నాయి. అయితే ఆ జెండాలు మా మధ్య ఏనాడూ గొడవలు సృష్టించలేదు. పార్టీలతో సంబంధం లేకుండా అందరం ఊరి అభివృద్ధికి పాటుపడుతున్నాం. అందుకే మా ఊరి వాసులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి ఎదురుకాలేదు. – బూర్క పాపయ్య, గ్రామ వాసి
చెప్పినట్లు వింటారు
చిన్నపిల్లవాడి నుండి పెద్దల వరకు పెద్దమనుషులు చెప్పినట్లు వింటారు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఒక అభిప్రాయంతో పరిష్కరించుకుంటాం. సారా, మద్యం లేకపోవటంతో ఊరు ప్రశాంతంగా ఉంది. – బిజ్జ విశ్వనాథం, గ్రామ వాసి
Comments
Please login to add a commentAdd a comment