సమావేశంలో మాట్లాడుతున్న జల్లెపల్లి సైదులు
-
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు
గార్ల: బయ్యారం ఉక్కు ఖమ్మం జిల్లా హక్కు అయినందున గార్ల, బయ్యారం మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జల్లెపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోద్బలంతోనే ఇల్లెందు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ మూడు ముక్కలు చేశారని విమర్శించారు. ఖమ్మానికి 80 కిలోమీటర్ల దూరంలోగల సత్తుపల్లిని, దగ్గరలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కలపకుండా ఖమ్మం జిల్లాలో కలపడం వెనుక మంత్రి తుమ్మల స్వార్థం ఉందన్నారు. ఖమ్మానికి కేవలం 29 కిలోమీటర్ల దూరంలోగల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపడం ప్రభుత్వానికి తగదన్నారు. ఇనుపరాయి, బైరైటీస్ ఖనిజాలు గల గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలిపితే అక్కడి సంపదను ఖమ్మం జిల్లా కోల్పోయినట్టవుతుందని అన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే సుమారు 60వేల ఉద్యోగవకాశాలు వస్తాయన్నారు. అందుకే, ఆ రెండు మండలాలను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పులి సైదులు, నాయకులు ధరావత్ సక్రు, గుగులోత్ హరి, బి.ఈర్య, టి.రవి తదితరులు పాల్గొన్నారు.