
సోమవారం హైదరాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో కేంద్రమంత్రి తోమర్‌తో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్
సాక్షి, హైదరాబాద్: బయ్యారం స్టీల్‌ప్లాంటు అంశాలపై టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశామని, మూడు నెలల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఉక్కు, ఖనిజ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. సోమవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో తోమర్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యానని వెల్లడించారు. కేంద్రం ప్రకటించిన మైనింగ్ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఇద్దరు సీఎంలను కోరినట్టు చెప్పారు.
నూతన మైనింగ్ పాలసీ వల్ల కేంద్రానికి ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా అక్రమ మైనింగ్‌కు అవకాశం లేకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖ ఉక్కు ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తోమర్ తెలిపారు.
మజ్లిస్ మెప్పుకోసమే యోగాకు దూరం..
మజ్లిస్ పార్టీ మెప్పుకోసమే అద్భుతమైన ప్రక్రియ యోగాకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులు దూరంగా ఉన్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. యోగాలోని విశిష్టతను అర్థం చేసుకుని గవర్నరు సహా చాలామంది ముఖ్యులు వారి కుటుంబాలతో సహా యోగాలో పాల్గొన్నారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొందరు మంత్రులను మొక్కుబడిగా పంపిందన్నారు. టీఆర్‌ఎస్ ముఖ్యులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పెద్దలు మాత్రం యోగాలో పాల్గొనకుండా రాజకీయ విన్యాసాలు చేశారని డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.