బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తీత్రీ తండా
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని తీత్రీ తండావాసులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లుగా పెళ్లయిన దంపతులకు సంతానం కలగడంలేదు. దీంతో వారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు తండా నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి వెంటనే సంతానం కలుగుతోంది. దీంతో తండాకు ఏమైందని స్థానికులు అయోమయం చెందుతున్నారు. తండాకు చెందిన ఆడపడుచులు వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్తుండగా, వారికి ఏడాది తిరిగే సరికి సంతానం కలుగుతుండగా.. పురుషులకు మాత్రం కావడం లేదు. సుమారు 70 ఏళ్ల క్రితం భర్మావత్ తీత్రీ అనే మహిళ బయ్యారం పెద్దగుట్ట పక్కన తండాను ఏర్పాటు చేయగా ఈ తండాలో ప్రస్తుతం 42 కుటుంబాలు నివసిస్తుండగా, 170 మంది జనాభా ఉంది.
ఆరేళ్లుగా..
తండాకు చెందిన బోడ చిరంజీవి, గుగులోత్ సురేష్, గుగులోత్ సుమన్, బానోత్ రమేష్, భర్మావత్ చందకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటి వరకు సంతానం కలగలేదు. సంతానం కోసం వీరు పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భర్మావత్ చంద తమ బంధువుల అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంటుండగా, మిగతా వారు సంతానం కోసం ఎదురుచూస్తున్నారు.
వలస వెళ్లిన వ్యక్తికి సంతానం
ఇదే తండాకు చెందిన బానోత్ సురేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఇతను బతుకుదెరువు కోసం భార్య జ్యోతితో కలసి హైదరాబాద్‌కు వలస వెళ్లగా అక్కడ వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం సురేష్ దంపతులు తండాలో నివసిస్తుండగా తండాలోని మినీ అంగన్‌వాడీ కేంద్రంలో సురేష్‌కు చెందిన ముగ్గురు పిల్లలు మాత్రమే ప్రీస్కూల్ విద్యార్థులుగా నమోదయ్యారు.
పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు
తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పాఠశాలలో రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఐదుగురు విద్యార్థులే ఉన్నారు. తండాలో ఆరేళ్లుగా పిల్లలు పుట్టకపోవటంతో కొత్త పిల్లల నమోదు నిలిచిపోయింది.
ఎన్ని ఆస్పత్రుల్లో తిరిగినా..
నా పెద్ద కొడుక్కి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశా. ఇప్పటి వరకు సంతా నం కలగలే. మహబూ బాబా ద్, ఖమ్మంలోని పలు ఆస్పత్రులకు వె ళ్లాం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు.
– బోడ సరోజ, చిరంజీవి తల్లి
ఇలా ఎప్పుడూ జరగలే..
తండా ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. తండాకు చెందిన వారికి కొన్నేళ్లుగా ఎందుకు సంతానం కలగటం లేదో అర్థం కావటం లేదు.
– వాంకుడోత్ రాంచంద్, తండావాసి
కారణాలు అనేకం ఉంటాయి
దంపతులకు పిల్లలకు కలగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. స్త్రీ, పురుషుల్లో పలు సమస్యలు ఉంటాయి. సంతానం లేని వారు ఒక్కసారే ట్రీట్‌మెంట్ చేసుకొని ఆ తర్వాత వైద్యుల సలహాలను పాటించకపోవటం, పరీక్షించిన వైద్యులు ఇతర వైద్యులకు రెఫర్ చేస్తే అక్కడికి వెళ్లకపోవటం వల్ల సంతానం కలగకపోయే అవకాశాలున్నాయి.
– డాక్టర్ బి.వీరన్న, డీజీఓ, మానుకోట ఏరియా ఆస్పత్రి
ఇద్దరం ఉన్నప్పటికీ పిల్లలు లేరు
పాఠశాలలో ఇద్దరం ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ మా బడిలో తగిన సంఖ్యలో పిల్లలు లేరు. ఆరేళ్లుగా తండాకు చెందిన పలువురికి సంతానం కలగకపోవటంతో చిన్నక్లాసులో అడ్మిషన్లు జరగటం లేదు.
– మోహన్, పాఠశాల హెచ్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment