‘బయ్యారం’పై వచ్చే ఏడాది స్పష్టత | Resolution next year on the bayyaram | Sakshi
Sakshi News home page

‘బయ్యారం’పై వచ్చే ఏడాది స్పష్టత

Published Thu, Jul 7 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

‘బయ్యారం’పై వచ్చే ఏడాది స్పష్టత

‘బయ్యారం’పై వచ్చే ఏడాది స్పష్టత

- సాక్షి, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా బయ్యారంలో ప్రతిపాదిత ఉక్కు కర్మాగార నిర్మాణం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ముడి ఇనుప ఖనిజం లభ్యతపై స్పష్టత వస్తేనే కర్మాగారం నిర్మిస్తామని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) స్పష్టం చేసింది. దీనిపై సర్వే చేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) నివేదిక సమర్పణకు గడువు కోరుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు తుది నివేదికను సమర్పిస్తామని చెబుతోంది.     
    
 20 కోట్ల టన్నులు ఉంటేనే...
 రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం స్థాపనకు సుముఖత వ్యక్తం అయింది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, ప్రోత్సాహకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. అయితే 20 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజం నిక్షేపాలు ఉంటేనే కర్మాగారం ఏర్పాటు సాధ్యమవుతుందని సెయిల్ తెలిపింది. మరోవైపు ఉక్కు కర్మాగారం నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఏర్పాటైన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ బయ్యారంలో 20 కోట్ల టన్నుల ముడి ఇనుప ఖనిజం లభించడం అసాధ్యమని నివేదికలో పేర్కొంది. అయితే ఈ సమాచారం అసంపూర్తిగా ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మైనింగ్ అధికారులు అభిప్రాయపడ్డారు. ఒకట్రెండు ప్రాంతాల్లో నమూనాలు తీసుకుని ముడి ఇనుము లభ్యతపై అంచనాకు రావడం శాస్త్రీయంగా లేదని, ముడి ఖనిజం లభ్యతపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.
 
 నత్తనడకన జీఎస్‌ఐ సర్వే
 రాష్ట్రంలోని ఐదు జిల్లాల పరిధిలో ముడి ఇనుప ఖనిజం లభ్యతపై జీఎస్‌ఐ ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారా సంయుక్త సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో అనుమతి ఇచ్చింది. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని 13 బ్లాకుల పరిధిలో 340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ముడి ఖనిజం ఉందని మైనింగ్ విభాగం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో 240.85 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముడి ఇనుప ఖనిజం అన్వేషణకు సరిహద్దులు నిర్ణయిస్తూ సర్వేకు అనుమతి ఇచ్చింది. నిర్దేశిత విస్తీర్ణంలో కోర్టుల్లో వివాదంలో ఉన్న భూములు, ఇనుప ఖనిజం వెలికితీతకు ఇప్పటికే అనుమతులు పొందిన సంస్థలకు సంబంధించిన భూములను సర్వే నుంచి మినహాయించాలని సూచించింది.

మొత్తం 13 బ్లాకులుగా ముడి ఇనుప ఖనిజం లభ్యత కలిగిన ప్రాంతాలను విభజించి బయ్యారంలోని రెండు బ్లాకుల్లో జీఎస్‌ఐ క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు బ్లాకులకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇస్తామని జీఎస్‌ఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మిగతా 11 బ్లాకుల్లో సర్వే పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. డ్రిల్లింగ్ పనుల్లో జాప్యమే అందుకు కారణం. ఈ ఏడాది మార్చి నాటికే సర్వే పూర్తి చేయాల్సి ఉండగా తుది నివేదిక వచ్చే ఏడాది 2017 మార్చి నెలాఖరుకు అందే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement