లారీ చక్రాల కిందపడి మృతిచెందిన సావిత్రిబాయి ,మృతురాలు సావిత్రిబాయి (ఫైల్
కలికిరి : మండలంలోని టేకలకోన బస్టాప్ వద్ద బుధవారం లారీని ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె–2 డిపోకు చెందిన నాన్‌స్టాప్ బస్సు ప్రయాణికులతో మదనపల్లె నుంచి తిరుపతి బయలుదేరింది. వేగంగా వెళుతూ కలికిరి, వాల్మీకిపురం మండలాల సరిహద్దు గ్రామం టేకలకోన వద్ద గూడూరు నుంచి బెంగళూరుకు సిలికాన్ ఇసుక లోడుతో వెళుతున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో లారీ క్యాబిన్ దెబ్బతింది. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిజివేడు గ్రామానికి చెందిన లారీ డ్రైవరు పోలయ్య(50) క్యాబిన్‌లో ఇరుక్కుపోయి మృతిచెందాడు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న సావిత్రిబాయి(46) బస్సు నుంచి లారీ చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. అదేవిధంగా మదనపల్లె పట్టణం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లికి చెందిన బస్సు డ్రైవరు రాము(30) తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను కోమాలో ఉన్నాడు.
బస్సులో ప్రయాణిస్తున్న చంద్రకళ(53), కృష్ణకుమారి(50), మరో ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారు. వారికి కలికిరి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, తిరుపతికి తరలించారు. మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా బాలయ్యగారిపల్లి మండలం వెంకటరెడ్డిపల్లికి చెందిన లారీ క్లీనర్ సురేష్‌కు రక్తగాయాలయ్యాయి. ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు వేగంగా వచ్చి ఢీకొందని, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని క్లీనర్ సురేష్ పోలీసులకు వివరించాడు. మృతురాలు సావిత్రిబాయి మదనపల్లె జిల్లా కోర్టులో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త గనేనాయక్ కడప జిల్లా జైలు డెప్యూటీ సూపరిం టెండెంట్‌గా పనిచేస్తున్నారు. సంఘటన స్థలాన్ని జిల్లా ఏఎస్పీ సుప్రజ, మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, వాల్మీకిపురం సీఐ సిద్ధతేజోమూర్తి పరిశీలించారు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన పోలయ్య మృతదేహాన్ని వెలికి తీయించి, ఆస్పత్రికి తరలించారు. లారీ, బస్సును జేసీబీతో పక్కకు తొలగించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment