సందీప్ (5), కీర్తి (3)
శ్రీశైలం ప్రాజెక్ట్ : ఆ ఇంటి ఆశాదీపాలు ఆరిపోయాయి. చిన్నారుల ముద్దుముద్దు మాటలు వారికి శాశ్వతంగా దూరమయ్యాయి. బుడిబుడి అడుగుల సవ్వడులు మూగబోయాయి. అంతవరకూ లోకాన్ని మరిచి ఆడుకున్న చిన్నారులు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. రిక్రియేషన్ క్లబ్ సమీపంలో బుధవారం ఆటో ఢీకొనడంతో గోడ కూలి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల మేరకు..
వెస్ట్రన్‌కాలనీ సమీపంలోని రిక్రియేషన్‌క్లబ్ ఎదురు వీధిలో తిరుపతినాయక్ కుటుంబం ఉంటోంది. ఈయనకు ఇద్దరు తమ్ముళ్లు శక్రూనాయక్, శీనునాయక్. వీరంతా కలిసే ఉంటున్నారు. శక్రూనాయక్ ఒక కుమారుడు(సందీప్), ఒక కుమార్తె, శీనునాయక్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె(కీర్తి) ఉన్నారు.
ఉదయం ఇటుకల లోడుతో ఓ ఆటో తిరుపతినాయక్ ఉంటున్న వీధిలోకి వచ్చింది. డ్రైవర్ వేగంగా నడపడంతో ఆటో పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈక్రమంలో గోడ కింద ఆడుకుంటున్న చిన్నారులు సందీప్ (5), కీర్తి (3)కి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే ఉన్న శీను నాయక్ భార్య రమణమ్మ గాయాలపాలైంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఆటో డ్రైవర్ మైనర్?
ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్ మైనర్ అని తెలిసింది. అతడికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని సమాచారం. ఆటోకు కూడా రికార్డులు లేనట్లు తెలుస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులు తమ కళ్ల ముందే ప్రమాదానికి గురై మరణించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మృతి చెందిన చిన్నారులకు రెండు రోజుల్లో కేశఖండన కార్యక్రమం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
ఈ సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చిన్నారులు మృతి చెందడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు , టూ టౌన్ ఎస్‌ఐ ఓబులేసు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment