నిందితులు , వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ రక్షితమూర్తి
నేరేడ్‌మెట్: రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్)గా చెప్పుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నేరెడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.1.75లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, సీఎం కార్యాలయం పేరుతో రూపొందించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్‌మెట్‌లోని తన కార్యాలయంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి, గీతానగర్‌కు చెందిన కార్తికేయ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేసేవాడు. తార్నాక, కార్తికేయనగర్‌కు చెందిన మోకానికల్ ఇంజినీర్ ఫ్రెడరిక్ అతడికి స్నేహిడు. గతంలో పలు ప్రైవేట్ కంపెనీల్లో పని చేసిన కార్తికేయ ప్రభుత్వ అనుమతులు, బిజినెస్ ప్రతిపాదనలు, ప్రాజెక్టు నివేదికలు, ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. ఇందులో భాగంగా తరచు తన స్నేహితుడు ఫ్రెడరిక్‌తో సచివాలయానికి వెళ్లి ఉన్నతాధికారులను కలిసేవాడు. ఈ నేపథ్యంలో అతను మంత్రి కేటీఆర్ పేషీలో వ్యక్తిగత కార్యదర్శుల వివరాలు సేకరించాడు.
కేటీఆర్ పీఎస్‌గా చెప్పుకుని..
అనంతరం మంత్రి కేటీఆర్ పీఎస్‌గా అవతారమెత్తిన కార్తికేయ పలువురు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మంత్రి కేటీఆర్ పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్‌గా పరిచయం చేసుకునేవాడు. మంత్రి చెప్పారని అవసరమైన పని చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చేవాడు. ఇందులో భాగంగా మారేడుపల్లిలోని కస్తూర్బా గాంధీ మహిళా కాలేజీ ఏఓ శ్రీరాములు రాజుకు ఫోన్ చేసిన అతను మంత్రి స్నేహితుడు కార్తికేయ అనే వ్యక్తి వచ్చి కలుస్తాడని, అతనికి అవసరమైన సహాయం చేయాలని చెప్పాడు. అనంతరం తానే కాలేజీకి వెళ్లి ఏఓను కలిసి తన స్నేహితుడి కుమార్తెకు అడ్మిషన్ ఇప్పించాడు. ఇందుకుగాను వారి నుంచి రూ.90వేలు వసూలు చేశాడు.
నకిలీ లెటర్‌ఆఫ్ క్రెడిట్‌తో..
తన కుమారుడి ఆరోగ్యం క్షిణించడంతో శ్రీరాములు రాజు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం మంత్రి పీఎస్‌గా చెప్పుకున్న కార్తికేయకు ఫోన్ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.2లక్షల ఆర్థిక సహాయం(లెటర్ ఆఫ్ క్రెడిట్) ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అనంతరం ఫ్రెడరిక్‌తో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జారీ అయిన ఎల్‌ఓసీ పత్రాలను ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసి నకిలీ ఎల్‌ఓసీ పత్రాలను రూపొందించి శ్రీరాములురాజుకు అందజేశారు. ఈ లెటర్ ఆధారంగా శ్రీరాములురాజు తన కుమారుడిని శ్రీకర్ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం చేయించాడు. అనంతరం ఆసుపత్రి అధికారులు బిల్లు క్లెయిమ్ చేసే ప్రక్రియలో శ్రీరాములురాజు ఇచ్చిన ఎల్‌ఓసీ నకిలీదని గుర్తించి అతడికి సమాచారం అందించారు. దీంతో అతను కార్తికేయ, ఫ్రెడరిక్‌లకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ చేసినట్లు గుర్తించాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీరాములు రాజు ఈనెల 6న ఘట్‌కేసర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ, ఘట్‌కేసర్ పోలీసులు విచారణ చేపట్టగా నిందితులు మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకుని పలు ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులకు ఫోన్లు చేసి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
మోసాల చిట్టా ఇదీ..
బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పేరుతో జీడిమెట్లకు చెందిన సురేష్ నుంచి రూ.లక్ష వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయించినందుకుగాను ముంబైకి చెందిన సమీర్, రాకేష్ నుంచి రూ.7లక్షలు వసూలు చేశారు. పట్టాపాస్ పుస్తకాల జారీ కోసం దుండిగల్ తహసీల్దార్‌కు ఫోన్లు చేసినట్లు వెల్లడైంది.
నల్గొండ జిల్లాలోనూ కేసు...
నల్గొండ జిల్లా, వేంపల్లి మండలం రావులపెంట జెడ్పీ ఉన్నత పాఠశాల(బాలికలు) ప్రధానోపాధ్యాయురాలు మానవతా మంగళ ఓపెన్ స్కూల్ సమన్వయకర్తగా పని చేసేది. ఆమె మరో ప్రాంతానికి బదిలీ కావడంతో నిందితులు నకిలీ ఆర్డర్లను తయారు చేసి ఆమె బదిలీని రద్దు చేసి, యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కమిషనర్‌కు సిఫారసు చేశారు. ఈ పత్రాలు నకిలీవని రుజువు కావడంతో నల్గొండ వన్‌టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. నిందితుడిపై కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పీఎస్‌లో నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మంత్రి కేటీఆర్ పీఎస్‌గా చెప్పుకుని ఎవరెవరికీ ఫోన్లు చేశారు, ఎంత మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేరాలు అంగీకరించడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ రక్షిత కె.మూర్తి తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఏసీపీ నర్సింహ్మారెడ్డి, ఘట్‌కేసర్ సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్‌ఓటీ సీఐ నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసును త్వరగా చేధించిన ఘట్‌కేసర్, ఎస్‌ఓటీ పోలీసులను డీసీపీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment