ఉన్మాదుల అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ జిల్లా ఎస్పీ షీమూషిబాజ్‌పేయి
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి నలుగురు మృతికి, ఇద్దరు చిన్నారులు గాయాల పాలవ్వడానికి కారణమైన నిందితులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీ బాజ్‌పేయి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటాల సమయంలో కోట్ని సత్యవతి(50) ఆమె కుమారుడు కోట్ని రాము(16) కుమార్తె గంటాా దుర్గా భవానీ(30) భవానీ కుమార్తె గంటాా విజయలక్ష్మి, మరో ఇద్దరు గంటా దుర్గా మహేష్, గంటాా యేసు కుమార్ ఒకే గదిలో నిద్రిస్తుండగా కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన మాసాడ శ్రీను, అతడి బావ మర్లపూడి మోహన్‌లు ఇంటి తలుపులు తీసి పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారని తెలిపారు. ఈ సంఘటనలో కోట్ని రాము(16), గంటా విజయలక్ష్మి(5) అక్కడికక్కడే దగ్ధమై మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలతో కోట్ని సత్యవతి, గంటా దుర్గా భవానీ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వీరితో పాటు గాయాలపాలైన గంటా దుర్గా మహేష్, గంటా ఏసు కుమార్‌లు కోలుకున్నారని వివరించారు.
వివాహం చేస్తామని చెప్పి.. మాట తప్పారని..
కోట్ని సత్యవతికి మేనల్లుడయ్యే మాసాడ శ్రీనుకు తన రెండో కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని అతడి వద్ద రూ.లక్ష నగదు తీసుకుందని, అనంతరం శ్రీను వ్యసనాలకు బానిస కావడంతో వివాహం చేయలేదని వివరించారు. మేనత్త కూతుర్ని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి, తీసుకున్న అప్పు ఇవ్వకుండా తనను మోసం చేసిన మేనత్తపై కక్ష పెంచుకున్న మాసాడ శ్రీను ఆమె రెండో కుమార్తె రామలక్ష్మికి వేరే వివాహం చేశారని తెలుసుకొని జనవరి 17వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో దుళ్ల గ్రామంలోని సత్యవతి ఇంటికి వచ్చి ఆమె గొంతుపై చాకుతో దాడి చేసి పరారయ్యాడని తెలిపారు. ఈ సంఘటనపై కడియం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం తన మేనత్త బతికి ఉందని తెలుసుకున్న మాసాడ శ్రీను, అతడి బావ (అక్క భర్త) మర్లపూడి మోహన్‌లు, సత్యవతిని హత్య చేయాలని జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో దుళ్ల గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించుకొని సత్యవతి ఇంట్లో పడుకున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి బయట తలుపు గొళ్లెం పెట్టాడని వివరించారు. గదిలో మంటలు వ్యాపించి గదిలో నుంచి బయటకు వచ్చేందుకు వీలులేక మంటల్లో కాలిపోతూ కేకలు వేశారని తెలిపారు. ఈ కేకలు విన్న స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారని, ఈ సంఘటనలో కోట్ని రాము, గంటా విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కోట్ని సత్యవతి, ఆమె కుమార్తె గంటా దుర్గా భవాని చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు.
నిందితులను ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖ జిల్లా రావికవతం మండలం, టి.అర్జాపురం గ్రామంలోని సిమెంట్ ఇటుకల బట్టీ వద్ద మాసాడ శ్రీను, మర్లపూడి మోహన్ లను సౌత్ జోన్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కడియం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్ కుమార్ వారి సిబ్బంది సీహెచ్‌వీ రమణ, కె.సురేష్ బాబు, కె.బాల గంగాధర్, బి.నాగరాజుల సహాయంతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని, స్పెషల్ టీమ్‌ను అభినందించి రివార్డు అందజేశారు.
నిందితులను అరెస్ట్ చేసేందుకుతొమ్మిది ప్రత్యేక బృందాలు
నిందితులను అరెస్ట్ చేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ షిమూషీ బాజ్‌పేయి తెలిపారు. ఎక్కడా ఆధారాలు లేకుండా మారణ హోమం సృష్టించిన నిందితులు ఆరు నెలలు ఒక చోట చొప్పున గ్రామాలు మారుతూ అప్పులు చేస్తుంటారని పోలీస్ విచారణలో తేలిందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి నిందితులు స్కూటీ పై దుప్పల పూడి వెళ్లి, కోళ్ల ఫారం వద్ద ఉంటున్న కుటుంబ సభ్యులకు ఏమి తెలియకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. కోళ్లఫారం యజమాని వద్ద తమ కుమారుడికి వంట్లో బాగోలేదని చెప్పి రూ.రెండు వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. సామర్లకోట రైల్వే స్టేషన్‌లో స్కూటీ మోటారు సైకిల్‌ను ఉంచి అనకాపల్లికి మకాం మార్చారని వివరించారు. మాసాడ శ్రీను, అతడి తండ్రి, తల్లి, అక్క, బావ వారి పిల్లలు నలుగురూ ఒక గ్రూప్‌గా ఉంటూ అప్పులు చేసి అక్కడి నుంచి పరారవుతుంటారని తెలిపారు. విశాఖ జిల్లా రావికవతం గ్రామంలో సిమెంట్ ఇటుకల బట్టీలో పనికి కుదిరారని, అక్కడ నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment