మృతదేహాల కోసం చెరువులో గాలిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు
పశ్చిమగోదావరి, నల్లజర్ల (ద్వారకాతిరుమల): చెరువులో చేపలకు మేత వేస్తున్న సమయంలో పడవ బోల్తాపడి ఇద్దరు యువకులు నీటమునిగి దుర్మరణం పాలయ్యారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. ఈ ఘటన నల్లజర్ల మండలం దూబచర్ల శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అనంతపల్లికి చెందిన కనుమూరి కిషోర్ (23) తండ్రి రాజు ఏడాది క్రితం చనిపోయారు. దీంతో తల్లి అమ్మాజీతో కలసి దూబచర్ల గాంధీ కాలనీలోని తాత తాడిగడప కృష్ణ వద్ద ఐదేళ్ల నుంచి ఉంటున్నాడు. రోజూ కిషోర్ అదే కాలనీకి చెందిన స్నేహితుడు తాడిగడప రమేష్ (33)తో కలసి కూలీ పనులకు వెళుతున్నాడు.
వీరిద్దరు ఎక్కువగా ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోస్తుంటారు. ఇదిలా ఉంటే కిషోర్ మేనమామ తాడిగడప నాగు గాంధీకాలనీ సమీపంలోని వడ్డోడి కుంట పంచాయతీ చెరువును లీజుకు తీసుకుని చేపలు పెంచుతున్నాడు. చెరువులో రోజూ ఉదయం, సాయంత్రం కూలీలు చేపలకు మేత వేస్తుంటారు. అయితే గురువారం ఉదయం కూలీలు ఎవరూ లేకపోవడంతో కిషోర్, రమేష్ రేకు పడవపై చెరువులోకి వెళ్లి మేత వేస్తున్నారు. ఈ సమయంలో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో వారిద్దరూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన నల్లజర్ల పోలీస్టేషన్, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. నల్లజర్ల పోలీసులు, భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యేక బోటు ద్వారా చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కిషోర్, రమేష్‌ను బయటకు తీయగా అప్పటికే రమేష్ మృతిచెందాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కిషోర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు రమేష్‌కు భార్య సత్యవతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిషోర్‌కు ఇంకా వివాహం కాలేదు.
అక్రమ తవ్వకాలే ప్రాణాలు తీశాయి
స్థానిక అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలే కిషోర్, రమేష్‌ను బలిగొన్నాయని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి చెరువులో మట్టిని ఇష్టానుసారం తవ్వేయడం వల్ల లోతు పెరిగిపోయిందని, అందువల్లే వారిద్దరు ప్రాణాలను కోల్పోయారని అంటున్నారు. ఈ చెరువు సమీపంలో ఉన్న ఆర్సీఎం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కిషోర్, రమేష్‌ల అకాల మరణంతో దూబచర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment