
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నఎస్‌ఐ సురేష్‌బాబు
అరకటివేములలో ఘోరం జరిగింది. ఈదురుగాలులకు తెగిపడిన విద్యుత్ తీగలను గమనించకుండా తాకిన ఇద్దరు వ్యక్తులు షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
పుట్లూరు:అరకటివేముల గ్రామంలోని రజక వీధిలో మంగళవారం తెల్లవారుజామున గాలివానకు విద్యుత్ తీగ తెగిపడింది. అదే సమయంలో బాలరంగయ్య (30), చాకలి ఓబుళపతి (55) అనే వ్యక్తులు తాడిపత్రికి వెళ్లడానికి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. తెగిపడిన తీగలను గమనించకుండా తాకడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. బాలరంగయ్య తండ్రి ఏడాది క్రితం చనిపోవడంతో తనే ఇంటికి పెద్దదిక్కయ్యాడు. ఇటువంటి సమయంలో విద్యుదాఘాతంతో అతడు కూడా మృతి చెందటంతో తమకు దిక్కెవరు అంటూ తల్లి, సోదరుడు కన్నీరుమున్నీరయ్యారు. మరో మృతుడు ఓబుళపతికి భార్య వెంకటమ్మ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ :అరకటివేముల గ్రామంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన బాలరంగయ్య, చాకలి ఓబుళపతి కుంటుంబాలను వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి పరామర్శించారు. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతులకు ఆయన నివాళులు అర్పించారు. ఈయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాఘవరెడ్డి, నాయకులు కంచెం శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment