
బెట్టియా: రెండు వర్గాలకు చెందిన ఇద్దరు మైనర్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. వీరి హత్యలతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వీటిని పరువు హత్యలుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబీకులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెట్టియా ఎస్పీ వినయ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. బన్‌హోరా గ్రామానికి చెందిన వ్యాపారి రవికాంత్‌షా కుమారుడు ముకేష్‌కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. ఇతడు పొరుగునే ఉన్న బలువా గ్రామానికి చెందిన నూర్జహాన్ ఖాతూన్‌తో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమికులు ఇద్దరు సోమవారం బలువా గ్రామంలో కలుసుకున్నారు. వారు అక్కడున్న విషయం తెలుసుకున్న నూర్జహాన్ సోదరుడు మరో ఇద్దరితో కలిసి ఇద్దరినీ చంపేశారు. చెల్లెలి మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని చంద్రావత్ నది ఒడ్డున ఉప్పుతో నింపిన గుంతలో పాతిపెట్టారు. ఎవరికీ గుర్తు తెలియకుండా పైన బురదపూశారు.
బాలుడి మృతదేహాన్ని మొదట బలువా గ్రామ శివారులో, ఆ తర్వాత అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారే గ్రామం వద్ద పడేశారు. ముకేశ్‌కుమార్ అదృశ్యమయ్యాడని కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు మృతదేహాలు వేర్వేరు చోట్ల కనిపించటంతో పోలీసులు బాలిక అన్న అల్లాఉద్దీన్ అన్సారీని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడు చేసిన దారుణాన్ని అంగీకరించాడు. తన సోదరి వేరే వర్గం బాలుడితో సన్నిహితంగా ఉండటం ఇష్టం లేక ఈ పనికి పూనుకున్నట్లు తెలిపాడు. తనతో పాటు బంధువులు గుల్సనోవర్, అమిర్ మియాలు ఈ హత్యాకాండలో పాలుపంచుకున్నారని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment