కేసరపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో నుజ్జయిన కారు
రహదారులు రక్తమోడుతున్నాయి. మితిమీరిన వేగం యమపాశమై ప్రాణాలను కబళించేస్తోంది. బుధవారం దైవదర్శనానికి వెళ్లి తిరిగివస్తున్న రెండు కుటుంబాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ పెను విషాదాన్ని నింపింది. ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు.. గన్నవరం కేసరపల్లి వద్ద మరొకరు మృతి చెందారు.
జూపూడి(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం మండలం జూపూడి 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు వేగమే యమపాశమై ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరిని కబళించింది. దైవదర్శనానికని వెళ్లిన ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. వేగంగా వెళ్తున్నకారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రగాయాల పాలైయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం.. తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంకు చెందిన యలమంచిలి శ్రీధర్ కుటుంబ సభ్యులు మొక్కులు చెల్లించుకునేందుకు కోదాడ గ్రామంలోని ఓ దేవాలయానికి వెళ్లారు. అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో డ్రైవర్ సీటులో ఉన్న కుటుంబ యజమాని యలమంచి శ్రీధర్(42) అక్కడికక్కడే మృతి చెందారు. పక్క సీటులో కూర్చున్న శ్రీధర్ అత్తయ్య మాదల పద్మినీకుమారి(55) స్థానిక నిమ్రా వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. వెనుకసీటులో ఉన్న శ్రీధర్ భార్య సుశీల, కుమారుడు చైతన్య, కుమార్తె సాత్వికా, ఇంట్లో పనిమనిషి పెండెం శివపార్వతి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన నలుగురిని స్థానిక నిమ్రా వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం నిమిత్తం గొల్లపూడి ఆంధ్రా వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం సీఐ దుర్గారావు, ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు పరిశీలించారు. బాధితుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసరపల్లి వద్ద ప్రమాదంలో ఒకరు మృతి
గన్నవరం: మండలంలోని కేసరపల్లి శివారు బుడమేరు వంతెన వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడలోని చుట్టగుంటలో ఉన్న విశాలాంధ్ర రోడ్డులో నివాసం ఉంటున్న గార్లపాటి నాగేశ్వరరావు(49) మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 29వ తేదిన శ్రీకాకుళం జిల్లా అరసపల్లి దేవాలయం సందర్శన నిమిత్తం నాగేశ్వరరావు, ఆయన భార్య భారతి, కుటుంబ సభ్యులైన చట్టు కృష్ణారావు, పుష్పవతి, రేగుళ్ల నాగలక్ష్మీతో కలిసి అద్దె కారులో బయలుదేరారు. అరసపల్లి, సింహాచలం, అన్నవరం దేవస్థానాలను సందర్శించి ఈ నెల 30వ తేది రాత్రి 7 గంటలకు విజయవాడ బయలుదేరారు. తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో కేసరపల్లి శివారు భారత్‌బెంజ్ షోరూం దాటిన తర్వాత బుడమేరు వంతెన వద్ద కారు అదుపు తప్పి రోడ్డు ఎడమవైపునకు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీట్లో కూర్చున్న నాగేశ్వరరావు తల, ఛాతి భాగంలో బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను 108లో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ చిరంజీవి నిర్లక్ష్యంగా వాహనం నడపడం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు క్షతగాత్రులకు పేర్కొన్నారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment